గత రెండు నెలలుగా విడుదలకు నోచుకోకుండా ఆగిపోయిన 'ఎవడు' చిత్రాన్ని ఇక ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా జాప్యం జరగడంతో ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయడం శ్రేయస్కరం కాదన్న ఆలోచనతో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 31న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు నిర్మించిన మరో చిత్రం 'రామయ్యా వస్తావయ్యా' ఈ నెల 10న రిలీజ్ అవుతోంది. అంటే, దీనికీ, దానికీ మూడు వారాల గ్యాప్ ఉంటుందనీ, పెద్ద సినిమాల మధ్య ఈ గ్యాప్ అభిలషణీయమనీ నిర్మాత అభిప్రాయపడుతున్నాడు. ఈ లెక్కన జూలై 31న రిలీజ్ కావలసిన ఈ 'ఎవడు' చిత్రం సరిగ్గా మూడు నెలల అనంతరం ప్రేక్షకుల ముందుకు వస్తోందన్న మాట. కాగా, సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఇటీవల రీ షూట్ చేయడంతో ఇప్పుడు క్వాలిటీ పరంగా మరింత సంతృప్తికరంగా వచ్చిందని అంటున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన శృతి హాసన్, ఎమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించారు.
No comments:
Post a Comment