Wednesday, 29 January 2014

అక్కినేనికి ఎన్నారైల సంతాపం


డల్లాస్: పద్మవిభూషన్ అవార్డు గ్రహీత, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ఘన నివాళులర్పించింది. జనవరి 25న డల్లాస్‌లో సమావేశమైన తానా సభ్యులు, అమెరికాలోని అక్కినేని అభిమానులు ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావు(ఏఎన్నార్) సేవలను కొనియాడారు. తానా మాజీ అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. ఏఎన్నార్‌కి 2012లో తానా లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డును ప్రకటించిందని గుర్తు చేశారు. ఏఎన్నార్ 89వ జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం 89 నాణేలను విడుదల చేసినట్లు ప్రసాద్ తోటకూర తెలిపారు. భక్తవత్సలు ధామ, రవి కొండబోలు, హోస్టన్ తెలుగు అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శారద అకునూరిలు హాజరై ఏఎన్నార్‌కు నివాళులర్పించారు.


 2013, సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లో జరిగిన అక్కినేని నాగేశ్వరరావు 90 జన్మదిన వేడుకల్లో పాల్గొని, ఆయన ఎదుట పాట పాడానని ఈ సందర్భంగా రవి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్నార్ అభిమానులు డాక్టర్ సిఆర్ రావు, డాక్టర్ శ్రీనివాస రెడ్డి ఆళ్ల, మురళీ వెన్నం, చలపతి రావు కొండ్రకుంట, రావు కల్వల, డా. విశ్వనాథం పులిగండ్ల, డా. సుధాకర్ రుమల్ల, సురేష్ వులువుల, కృష్ణప్రియా, సాయి సతీష్, డాక్టర్ ప్రశాంతి గణేశా, ప్రొ. జగదీశ్వరణ్, రేఖ పుదురు, శాంత పులిగండ్ల, రామకృష్ణారెడ్డి, అనుసూయ రెడ్డి, నర్సింహారెడ్డి ఉరిమిడి, సురేష్ మండువా, సుబ్బు జొన్నలగడ్డ, శారద సింగిరెడ్డి, సతీష్ పున్నం, డా. తారకుమార్ రెడ్డి, నసీం షేక్, కృష్ణ పుట్టపర్తి, వెంకట్ ముకులట్ల, హరి, సాంబ దొడ్డ, శ్రీకాంత్ పోలవరపు, దినేష్ త్రిపురనేని, శ్రీనివాసరావు, దామోదర్ రాయుడు, విజయ్ మోహన్ కకర్ల, డా. నవనీత కృష్ణ గొర్రెపాటి, సంధ్యా రెడ్డి గువ్వా, రామసూర్యారెడ్డి, అనంత పుజ్జురు, సతీష్ రెడ్డిలు పాల్గొని నట దిగ్గజానికి నివాళులర్పించారు. అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రసాద్ తోటకూర ఈ సందర్భంగా తెలిపారు. అక్కినేనికి సంబంధించిన జీవిత విశేషాలను దీని ద్వారా ప్రచారం చేయనున్నట్లు చెప్పారు. విద్యా, న్యాయ, జర్నలిజం వంటి వివిధ రంగాల అభివృద్ధికి పాటుపడిన, ప్రతిభ కనబరిచిన వారికి ఫౌండేషన్ ద్వారా ఏఎన్నార్ అంతర్జాతీయ అవార్డులను ప్రతీ సంవత్సరం అందజేయనున్నట్లు తెలిపారు. తనతోపాటు రవి కొండబోలు, శ్రీనివాస రెడ్డి ఆళ్ల, భక్తవత్సలు ధామ, డా. రావు, శారద ఆకునూరి, మురళీ వెన్నం, రావు కల్వల, చలపతి రావు కొండ్రకుంట ఈ ఫౌండేషన్ బోర్డ్ డైరెక్టర్లుగా ఉండనున్నారని ప్రసాద్ తోటకూర తెలిపారు. కేంద్రం అందించే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను అక్కినేని నాగేశ్వరరావుకి అందించేలా కృషి చేయాలని వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

1 నేనొక్కడినే, ఎవడు... థర్డ్ వీకెండ్ కలెక్షన్స్


హైదరాబాద్: సంక్రాంతి పండగను పురస్కరించుకుని విడుదలైన ‘1 నేనొక్కడినే', ‘ఎవడు' చిత్రాలు మూడు వారాంతాలు పూర్తి చేసుకున్నాయి. మహేష్ బాబు నటించిన సైకలాజికల్ థ్రిల్లర్, రామ్ చరణ్ తేజ్ నటించిన యాక్షన్ డ్రామా చిత్రాలు రెండు గ్లోబల్ బక్సాఫీసు వద్ద భిన్నమైన పరిస్థితులు ఎదుర్కొన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘1 నేనొక్కినే' చిత్రం జనవరి 10వ తేదీన రికార్డు స్థాయిలో అత్యధిక థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తొలి రోజు ఈచిత్రం మంచి బిజినెస్ చేసినప్పటికీ నెగెటివ్ మౌత్ టాక్ రావడంతో క్రమక్రమంగా బాక్సాఫీసు వద్ద బిజినెస్ తగ్గుముఖం పట్టింది. తొలి 17 రోజుల్లో ‘1 నేనొక్కడినే' చిత్రం ఆంధ్రప్రదేశ్ బక్సాఫీసు వద్ద రూ. 22 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.50 కోట్లు, ఓవర్సీస్‌లో 8 కోట్లు వసూలు చేసింది. టోటల్‌గా ఈచిత్రం వరల్డ్ వైడ్‌గా తొలి మూడు వారాంతాలు గడిచే నాటికి రూ. 33.50 కోట్లు వసూలు చేసింది. ఇక ‘ఎవడు' చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న గ్రాండ్‌గా విడుదలై రామ్ చరణ్ నటించిన సినిమాల్లో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. సినిమాకు తొలి రోజు నుండే పాజిటివ్ టాక్ రావడంతో మంచి వసూళ్లు రాబట్టింది. తొలి 15 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ. 42 కోట్లు వసూలు చేసింది. ‘1 నేనొక్కినే' చిత్రం బిజినెస్ రెండో వారంలోనే తగ్గుముఖం పట్టగా...ఎవడు చిత్రం కలెక్షన్లు మూడో వారంలోనూ బాగున్నాయి. ఈ నెల 31న నితిన్ నటించిన ‘హార్ట్ ఎటాక్', మోహన్ బాబు ఫ్యామిలీ మల్టీ స్టారర్ ‘పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రాలు విడుదలవుతున్న నేపథ్యంలో ‘1 నేనొక్కడినే', ‘ఎవడు' చిత్రాల కలెక్షన్లపై ప్రభావం పడుతుందని టాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇబ్బందే, నయనతో మాట్లాడితే నవ్వుతున్నారు: శింబు


చెన్నై: నయనతార, శింబు మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. ఈ సారి వారి పర్సనల్ విషయాల గురించి కాదు.....వారి ప్రొఫెషనల్ విషయాలు గురించి ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఈ మాజీ ప్రేమికులు చాలా కాలం తర్వాత కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు పాండిరాజ్ దర్శకత్వంలో వీరు ఓ తమిళ సినిమాలో జోడీ కట్టారు. ప్రస్తుతం కలిసి నటిస్తున్న ఈ జంట షూటింగు సమయంలో ఇబ్బంది కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. తమకు ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయో శింబు స్వయంగా వెల్లడించారు. ఆమెతో కలిసి పని చేయడం తనకు కంఫర్ట్‌గా ఉన్నప్పటికీ.....షూటింగు సమయంలో తమను చూసి యూనిట్ సభ్యులు నవ్వుతుండటం ఇబ్బంది కలిగిస్తోందని తెలిపాడు.