Thursday, 30 January 2014

ఆశారాం బాపు సంపద రూ. 10 వేల కోట్లు


సూరత్: కుబేరుడికే కళ్లుతిరిగేలా.. కార్పొరేట్లకే ఈర్ష్య పుట్టేలా స్వామీజీ ఆశారాం బాపు ఆస్తులు కూడగట్టారు. అదంతా పోలీసులు స్వాధీనం చేసుకున్న పత్రాల ద్వారా ఇప్పుడు బయటకి వస్తోంది. ఇప్పటి వరకూ లెక్కించిన ఆయన సంపద విలువ దాదాపు రూ. 10 వేల కోట్లు ఉందని గురువారం పోలీసులు చెప్పారు. ఆయన ఆశ్రమంపై దాడి చేసిన సందర్భంలో లభించిన డాక్యుమెంట్లను పరిశీలించగా.. బ్యాంకు ఖాతాలు, షేర్లు, డిబెంచర్లు, ప్రభుత్వ బాండ్ల రూపంలో ఆశారాం సొమ్ము రూ. 9 వేల కోట్ల నుంచి రూ. 10 వేల కోట్లు ఉంటుందని సూరత్ పోలీస్ కమిషనర్ రాకేష్ అస్తానా విలేకరులకు తెలిపారు. దీనిలో దేశవ్యాప్తంగా ఆయనకు ఉన్న భూముల విలువ కలపలేదన్నారు. మరిన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవాల్సి ఉందని, అప్పుడు ఆయన సంపద విలువ మరింత పెరగవచ్చని సీపీ తెలిపారు. ఈ విషయంలో లోతైన విచారణ కోసం సీబీడీటీ, ఐటీ, ఈడీలకు విన్నవించామని ఆయన చెప్పారు. కొన్ని నెలల క్రితం అహ్మదాబాద్‌లోని ఆయన ఆశ్రమ భవనంలో సోదా చేసిన సందర్భంగా 40 పెద్ద సంచుల నిండుగా ఉన్న వేలాది డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. వాటి ఆధారంగానే గుజరాత్‌లోని 45 ప్రాంతాల్లో ఆయనకు భూములున్నట్లు, అంతేగాక రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో కూడా భూములు సంపాదించినట్లు బయటపడిందని సీపీ రాకేష్ వెల్లడించారు. మరిన్ని చోట్ల ఆయన ఇంకా డాక్యుమెంట్లు దాచి పెట్టారా అనే విషయం పరిశీలించాల్సి ఉందన్నారు. కాగా, లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న 72 ఏళ్ల ఆశారాం బాపు జోధ్‌పూర్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఆయన కుమారుడు నారాయణ సాయి కూడా అలాంటి కేసులోనే జైలు పాలయ్యారు

ప్రస్తుత బిల్లును ఆమోదిస్తేనే: సన్యాసంపై సిఎం ట్విస్ట్


హైదరాబాద్: శాసనసభ తిరస్కరించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లును (తెలంగాణ బిల్లును) యథాతథంగా పార్లమెంటులో ఆమోదిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ బిల్లును శాసనసభ, శాసన మండలి రెండూ బిల్లును తిరస్కరించాయని, దీన్ని కేంద్రం గౌరవించాలని ఆయన అన్నారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన కిరణ్ కుమార్ రెడ్డి గురువారంనాడు పార్టీ అధిష్టానంపై, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటానంటే కొత్త పార్టీ పెడతానని కాదని ఆయన అన్నారు. కొత్త పార్టీ పెట్టడమనేది తనకు ప్రధానాంశం కాదని, రాష్ట్ర భవిష్యత్తు తనకు ముఖ్యమని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకే బిల్లును తిరస్కరించామని ఆయన అన్నారు. రాజకీయ జీవితం కన్నా రాష్ట్ర సమైక్యతే తనకు ముఖ్యమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజల అభీష్టాన్ని కేంద్రం గౌరవించాలని ఆయన అన్నారు. బిల్లును శానససభ, మండలి తిరస్కరించిన తర్వాత ముందుకు వెళ్లడం ప్రజాస్వామ్యం అనిపించుకోదని ఆయన అన్నారు. తెలుగు ప్రజల భవిష్యత్తును ఢిల్లీ నిర్ణయించకూడదని ఆయన అన్నారు. విభజన రాజకీయాలకు, రాజకీయ పార్టీలకు సంబంధం పెట్టకూడదని ఆయన అన్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగమని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పెద్ద తిప్పదమని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పడితే మనుగడ సాగించలేదని ఆయన అన్నారు. అధిష్టానం తప్పు చేయడం వల్లనే తాను ప్రజల తరఫున పోరాడుతున్నానని ఆయన అన్నారు. రాష్ట్ర సమైక్యత కోసం ఎంతకైనా తెగిస్తానని ఆయన అన్నారు. తన రాజకీయ భవిష్యత్తును పట్టించుకోనని, రాష్ట్ర భవిష్యత్తు తనకు ప్రధానమని ఆయన అన్నారు. తెలంగాణ కావాలో, వద్దో ప్రజలు వచ్చే లోకసభ ఎన్నికల్లో తేలుస్తారని ఆయన అన్నారు. విభజన జరిగితే విద్య, నీరు వంటి వివిధ రంగాల్లో సమస్యలు వస్తాయని ఆయన అన్నారు. హైదరాబాద్ పెద్ద సమస్య అని ఆయన అన్నారు. భవిష్యత్తు కార్యాచరణ కోసం తాము సమావేశమవుతున్నట్లు ఆయన తెలిపారు. ఏది ఏమైనా రాష్ట్రాన్ని కాపాడుకుంటామని ఆయన అన్నారు. బిల్లును ప్రభుత్వానికి పంపవద్దని రాష్ట్రపతిని శాసనసభ కోరుతుందని ఆయన చెప్పారు. ప్రజల మనోభావాలను గౌరవించాలని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ ప్రజలకు దూరమైందని, తాను ప్రజల తరఫున నిలబడ్డానని ఆయన అన్నారు.