Tuesday, 28 April 2015

ఐఐటి జెఇఇ మెయిన్స్‌లో తెలుగు పిల్లల తడాఖా


హైదరాబాద్: ఐఐటి జెఇఇ మెయిన్స్ పరీక్షల్లో ఎప్పటిలాగే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. సోమవారం సాయంత్రం సిబిఎస్‌ఇ జెఇఇ మెయిన్స్ ఫలితాలు వెలువడ్డాయి. రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 80వేల మంది మెయిన్స్‌కు హాజరుకాగా, 20 వేలమంది వరకూ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించినట్టు తెలుస్తోంది. అయితే, పూర్తి లెక్కలు ఇంకా తేలాల్సి ఉంది. 360 మార్కులకు జరిగిన మెయిన్స్ పరీక్షలో టాపర్‌కు 335 మార్కులు రాగా, అడ్వాన్స్‌డ్ పరీక్షకు ఎంపికైన చిట్టచివరి అభ్యర్ధికి 105 మార్కులు వచ్చాయి. అంటే 105 మార్కులు దాటివచ్చిన వారంతా అడ్వాన్స్‌కు ఎంపికయ్యారు. ఈసారి ఓబిసి కటాఫ్ మార్కులు 70కాగా, ఎస్సీ కటాఫ్ మార్కులు 50, ఎస్టీ కటాఫ్ మార్కులు 44గా నిర్ణయించినట్టు సిబిఎస్‌ఇ చెప్పింది. జెఇఇ మార్కులకు 60శాతం వెయిటేజీ, ఇంటర్ మార్కులకు 40శాతం వెయిటేజీ కలిపి తుది ర్యాంకులను ప్రకటిస్తారు. ఈసారి జెఇఇ మెయిన్స్‌కు 13 లక్షలమంది హాజరుకాగా, అందులో కేవలం లక్షన్నర మంది మాత్రమే అడ్వాన్స్‌కు ఎంపిక చేస్తున్నారు. జనరల్ పిడబ్ల్యుడి కోటా కలిపి 75,750 మంది, ఓబిసి 40,500, ఎస్సీ 22500, ఎస్టీ 11250 మంది ఎంపికయ్యారు. ఇందులో జనరల్ 73,478 మంది మాత్రమే. అన్ని క్యాటగిరిల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 20వేల మందికి పైగానే ఉన్నారు. అడ్వాన్స్ పరీక్షకు మే 2 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మొదలవుతుంది. పరీక్ష మే 24న జరుగుతుంది. జూన్ 18న తుది ఫలితాలు ప్రకటించే వీలుంది. జూన్ 3న ఒఆర్‌ఆర్ కాపీలను నెట్‌లో అందుబాటులో ఉంచుతారు. జూన్ 8న తొలి కీ ప్రకటించి, దానిపై 8 నుండి 11 వరకూ అభ్యంతరాలను స్వీకరిస్తారు. అభ్యంతరాల ఆధారంగా 13న తుది కీ ప్రకటిస్తారు. దానికి అనుగుణంగా జూన్ 18న ఫలితాలిస్తారు. జూలై 1న తొలి రౌండ్ సీట్ల పంపిణీ జరుగుతుంది.

Sunday, 19 April 2015

జస్ట్ ...‘ఓకే’ బంగారం(రివ్యూ)


అతి కొద్ది మంది దర్శకుల చిత్రాలకు మాత్రమే ...హీరోలతో సంభందం లేకుండా థియోటర్లు హౌస్ ఫుల్ అయ్యే మార్కెట్ ఉంది. అటువంటివారిలో ముందు వరసలో ఉన్న దర్శకుడు మణిరత్నం. ఆయన డబ్బింగ్ చిత్రాలు తెలుగులో చాలా సార్లు స్టైయిట్ చిత్రాలుకు పోటీ ఇచ్చాయి. అయితే ఆయన గత సంవత్సరాలుగా విజయం అనే మాటకు దూరంగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుని మరీ సినిమాలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా 'కడలి' చిత్రం ఆయన వీరాభిమానులను సైతం భయపట్టేసింది. ఈ నేపధ్యంలో ఆయన మళ్లీ 'సఖి' రోజులను గుర్తు చేసేలా ఓ లవ్ స్టోరీని ఎత్తుకుని...దానికి తగ్గట్లు తన దైన శైలిలో ప్రోమోలు,పోస్టర్స్ క్రియేట్ చేసి 'ఓకే బంగారం' అంటూ ఆశలు రేకిత్తించి థియోటర్ కు వచ్చేలా చేసారు. అంతేకాదు ఈ తరం నమ్ముతూ నిరంతంర చర్చకు నిలుస్తున్న లివ్ ఇన్ రిలేషన్ షిప్ అనే పాయింట్ ని టచ్ చేసి,దాని చుట్టూ కథని అల్లారు. అయితే ఈ రొమాంటిక్ మూవిలో హీరో,హీరోయిన్స్ రిలేషన్ కు సమస్య వచ్చేసరికే... సినిమా క్లైమాక్స్ కు వచ్చేస్తుంది. ఆ సమస్యను కూడా తేలిగ్గా...సినిమాటెక్ గా రొటీన్ గా ముగించేయటం కొద్దిగా నిరాసపరుస్తుంది. ముఖ్యంగా చాలా ప్రెడిక్టుబుల్ గా కథనం నడుస్తుంది. ఫస్టాఫ్.. నత్తనడకతో ప్రారభైమైనా రొమాన్స్ తో బాగుంటుంది అదే ...సెకండాఫ్ కు వచ్చేసరికి ఇంకా స్లోగా నడుస్తూ..క్లైమాక్స్ కు వచ్చేసరికి ముగించాలి కాబట్టి ఓ ముగింపుని ఉన్నంతలో వెతికేసి అతికేసినట్లు అనిపిస్తుంది. అయితే అద్బుతమైన పాటల చిత్రీకరణ, లీడ్ పెయిర్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ ...మణిరత్నం మాత్రమే చేయగలరని మరోసారి అర్దమవుతుంది. స్క్రిప్టు మరింత పగడ్బందీగా ఉంటే...ఓ సెమీ క్లాసిక్ అయ్యే అవకాసం ఉండేది ఖచ్చితంగా. ముంబైలో కార్పోరేట్ సంస్ధలలో పనిచేస్తున్న ఆది (దుల్కర్ సల్మాన్),తార(నిత్యామీనన్) పోష్ లైఫ్ ని గడుపుతూంటారు. పెళ్లనే కాన్సెప్ట్ ని నమ్మని వీళ్లిద్దరూ ...అనుకోని పరిస్ధితుల్లో పరిచయమై...ఆ స్నేహం అనతికాలంలోనే ఏకాభిప్రాయాలతో బలపడి...సహజీవనం(లివ్ ఇన్ రిలేషన్ షిప్)గా రూపాంతరం చెందుతుంది. అయితే తమ భవిష్యత్ కోసం వీరిద్దరూ వేరు వేరు దేశాలకు వలస వెళ్లాల్సిన పరిస్ధితి వస్తుంది. ఈ నేపధ్యంలో వీరు తమ బంధానికి ఫుల్ స్టాప్ చెప్తారా..లేక దాన్ని పెళ్లితో బలపరుచుకుంటారా అనేది కథలో కీలకాంశం.

మెగాస్టార్‌ ను 'మా' విజేతలు కలిసిన వేళ...(ఫొటోలు)


హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు నటకిరీటి రాజేంద్రప్రసాద్ శనివారం సాయంత్రం మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. తన గెలుపుకు కారణమైన మెగా ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలియజేశారు. చిరంజీవి మాట్లాడుతూ.... రాజేంద్రప్రసాద్ గెలుపు తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. మా నూతన కార్యవర్గ సభ్యులందరూ సినీ కార్మికులు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్‌ ప్యానల్‌ సభ్యులను చిరంజీవి సన్మానించారు. నువ్వా నేనా అన్నట్టు సాగిన 'మా' (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) ఎన్నికల్లో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నటి జయసుధపై ఆయన 85 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. శుక్రవారం హైదరాబాద్‌లోని చలన చిత్ర వాణిజ్య మండలిలో ఎన్నికల అధికారి వి.కృష్ణమోహన్‌ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు జరిగింది. ఏడు రౌండ్లుగా ఓట్లని లెక్కించారు. ప్రతీ రౌండ్‌లోనూ రాజేంద్రప్రసాద్‌ ఆధిక్యం ప్రదర్శిస్తూ విజయ దుందుభి మోగించారు.

హైదరాబాద్‌: ట్యాంక్ బండ్‌పై ఉచిత వైఫై పొందడం ఎలా?


హైదరాబాద్: డిజిటల్ ఇండియాలో భాగంగా హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ట్యాంక్ బండ్ చుట్టూ పది కిలో మీటర్లు పరిధిలో వైపై సేవలను ప్రారంభించారు. గురువారం మారియట్ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో తొలి వీడియోకాల్ మాట్లాడి హైదరాబాద్‌లో వైఫై సేవలను రాష్ట్ర ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ వైపై సేవలను నగర ప్రజలు ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం. ట్యాంక్ బండ్‌పై ఉచిత వైఫై పొందడం ఎలా? * మొదటగా వైపై ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. * దీంతో వైపై లిస్ట్‌లో క్యూఫై/ బీఎస్‌ఎస్‌ఎల్ అని డిస్‌ప్లే అవుతుంది. * మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్‌ను ఎంటర్‌ చేయాలి. * మీ మొబైల్‌కు వన్‌టైమ్ పాస్‌వర్డ్ వస్తుంది. * ఎంటర్‌చేసిన మొబైల్ నెంబర్‌కు ఎంఎస్‌ఎంస్ ద్వారా పాస్‌వర్డ్ వస్తుంది * ఈ పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేస్తే వైఫై అందుబాటులోకి వస్తుంది. ఈ వైఫై సేవలను పైలట్ ప్రాజెక్టుగా ట్యాంక్‌బండ్ పరిధిలో 10 కిలోమీటర్ల దూరం వరకు మొదటి ముప్పై నిమిషాల పాటు వైఫై సేవలను ఉచితంగా పొందే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. తొలిదశలో భాగంగా పర్యాటక ప్రాంతమైన ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఈ అవకాశాన్ని కల్పించారు. రాబోయే రోజుల్లో నగరంలోని 2,000 కేంద్రాల ద్వారా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మొదటి 30 నిమిషాలు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత ఛార్జి చేయనున్నారు. ఈ ఛార్జీ కూడా మిగతా సర్వీస్ ప్రొవైడర్లతో పోల్చితే నామమాత్రంగానే ఉండటం విశేషం. ప్రపంచంలో ఇప్పటికే శాన్‌ఫ్రాన్సిస్కో, బార్సిలోనా, లండన్ తదితర నగరాల్లో వైఫైని అందిస్తున్నాయి. వైపై సేవలను ప్రారంభించిన అనంతరం తెలంగాణ ఐటీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దేశంలోనే తొలి పూర్తిస్థాయి వైఫై సౌకర్యం ఉన్న నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని ప్రకటించారు. వైఫై సేవలతో నగరం ఐటీలో అగ్రశ్రేణి నగరం కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలోని మున్సిపల్ కార్పొరేషన్లన్నింటిలోనూ వైఫై సేవలను విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. త్వరలోనే కరీంనగర్, ఖమ్మం, రామగుండం, వరంగల్, నిజామాబాద్ కార్పొరేషన్లలో వైఫై సేవలను ప్రారంభిస్తామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 4జీ, 5జీ నెట్‌వర్క్ సేవలను అందించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. ఉచిత వైఫై అందించడానికి బీఎస్‌ఎన్‌ఎల్ ముందుకురావడం అభినందనీయమని, కొన్ని వారాల వ్యవధిలోనే ఆ సంస్థ అధికారులు ఏర్పాట్లను పూర్తిచేశారని కొనియాడారు.

మధ్యదరా సముద్రంలో పడవ మునక: 700 మంది గల్లంతు


మధ్యధరా సముద్రంలో వలసకూలీలతో ప్రయాణిస్తున్న ఓ నౌక మునిగిపోయింది. అందులో దాదాపు ఏడువందల మంది కూలీలు ఉన్నారని సమాచారం. ఈ నౌక మునిగిపోవడంతో వారందరూ గల్లంతయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. వలస కూలీలను కాపాడేందుకు లిబియా జలాలలోని లాంపడూస తీరానికి 130 మైళ్ల దూరంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇటలీకి చెందిన నౌకలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇరవై ఎనిమిది మంది కూలీలను కాపాడినట్లుగా తెలుస్తోంది. కాగా, నౌకలో ఏడువందల మంది కంటే ఎక్కువ మందే ఉండవచ్చుననే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాగా, ఇటీవలే మధ్యదరా సముద్రంలో నౌక ముక్కలైన విషయం తెలిసిందే. అది జరిగి వారం కాకముందే మరో ప్రమాదం జరగడం గమనార్హం.

Friday, 17 April 2015

పవన్ కళ్యాణ్ కోసం అభిమాని సుదూర సైకిల్ యాత్ర


హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు సైకిల్ యాత్ర చేపట్టారు. అతను పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్ పూర్ నుండి సైకిల్ యాత్ర ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. పవన్‌ను కలిసేందుకు ఆయన ఈ యాత్ర చేపట్టారు. కాగా, సినిమాల్లో టాప్ స్టార్‌గా ఎదిగిన పవన్ కళ్యాణ్ గత ఏడాది జనసేన పార్టీని స్థాపించి.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం - భారతీయ జనతా పార్టీలకు మద్దతు పలికారు. ఆ పార్టీల తరఫున విస్తృత ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేతల పర్యటన నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలన్నారు. రైతుల తరఫున నష్ట పరిహారం చెల్లించే వరకు రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకు వస్తామని చెప్పారు. కాంగ్రెస్ నేతల్లో డీ శ్రీనివాస్, మల్లు భట్టి విక్రమార్క తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో వరి పంట ఎక్కువగా దెబ్బతిన్నదని వారు చెప్పారు. ఎకరాకు 15వేల నుండి 20వేల వరకు నష్టపరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రాజకీయాల నుండి 'మా' వరకు: జయసుధకు అంతా రివర్స్!


హైదరాబాద్: ప్రముఖ సినీ నటి, సికింద్రాబాద్ మాజీ శాసన సభ్యురాలు జయసుధకు 'మా' అధ్యక్ష ఎన్నికలు షాకిచ్చాయి. జయసుధకు ఇటీవలి కాలంలో రాజకీయంగా, తాజాగా 'మా' అంశంలో రివర్స్ అయిందని చెప్పవచ్చు. అనూహ్యంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన జయసుధ, అదే రాజకీయాల పైన అసంతృప్తితో దూరం జరిగారు. ఇప్పుడు 'మా' ఎన్నికల్లో ఆమె బలి అయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో జయసుధ 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. సికింద్రాబాద్‌లో తలసాని శ్రీనివాస్ యాదవ్ హవా ఎంతగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాంటి సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి ఆమె పోటీ చేశారు. ఇక్కడి నుండి పోటీ అంటే జయసుధ ఓటమిని కొని తెచ్చుకోవడమేనని, స్థానికంగా తలపండిన తలసానితో పోటీ అంటే కష్టమేనని అప్పట్లో భావించారు. కానీ, అనూహ్యంగా చాలామంది అంచనాలు తలక్రిందులయ్యాయి. ఈ ఎన్నికల్లో జయసుధ ఘన విజయం సాధించారు. ఆమె నాలుగు వేల పై చిలుకు ఓట్లతో గెలుపొందారు. నాటి ఆమె గెలుపుకు చాలా కారణాలున్నాయి. అవి ఏమైనప్పటికీ.. చాలామంది అంచనాలు తారుమారు కావడం గమనార్హం. అనంతరం కొద్ది రోజులకే వైయస్ దుర్మరణం చెందారు.ఈ నేపథ్యంలో.. అప్పటి వరకు 'రాజకీయం' అంతగా తెలియని జయసుధ.. ఇటు కాంగ్రెస్, అటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు.. ఎటు వెళ్లాలో తెలియక డైలమాలో పడ్డారు. చివరికి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కానీ ఒకవిధంగా ఆమె రాజకీయాల్లో ఇమడలేకపోయారనే చెప్పవచ్చు. జయసుధ రాజకీయాల పైన పలుమార్లు తన అసంతృప్తిని వ్యక్తం చేశారు కూడా. గ్రూపు రాజకీయాల పట్ల ఆమె పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు.. జయసుధ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయరనే ఊహాగానాలు వినిపించాయి. అంతకుముందు.. ఆమె పలుమార్లు రాజకీయాల పైన అసంతృప్తి వ్యక్తం చేయడం కూడా ఆ ఊహాగానాలకు ఊతం ఇచ్చాయి. కానీ, కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆమె అనూహ్యంగా ఓడిపోయారు. 2009లో ఓడిపోతారనుకున్న జయసుధ గెలిచారు. 2014లో అందుకు విరుద్ధమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జయసుధ గెలుస్తారని అందరూ భావించారు. కానీ, కనీసం ఆమె రెండో స్థానంలో కూడా నిలబడలేకపోయారు. తెరాస తరఫున పోటీ చేసిన టీ పద్మారావు గెలుపొందారు. రెండో స్థానంలో టీడీపీ కూన వెంకటేష్ ఉండగా.. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన జయసుధ ఘోర ఓటమి చవి చూశారు. తాజాగా, 'మా' ఎన్నికల కోసం ఆమెను హఠాత్తుగా చెన్నై నుండి తీసుకు వచ్చారనే వాదనలు ఉన్నాయి. 'మా' ఎన్నికల్లో పోటీ గురించి ఆమె అసలు ఆలోచించలేకపోయి ఉంటారు. అనుకోనివిధంగా రంగంలోకి దిగి ఉంటారు. అయినప్పటికీ ఆమె గెలుపుపై ప్యానల్ ధీమా వ్యక్తం చేసింది. 6పర్యాయాలు 'మా' అధ్యక్షుడిగా ఉన్న మురళీ మోహన్ అండ, పలువురు బిగ్ షాట్స్ ఆమెకు మద్దతుగా నిలబడిన నేపథ్యంలో ఆమె గెలిస్తుందనుకున్నారు. 'మా' ఎన్నికల పైన కొందరు కోర్టుకు కూడా వెళ్లారు. కోర్టుకు వెళ్లిన వారు రాజేంద్ర ప్రసాద్‌కు అనుకూలురని, జయసుధ గెలుస్తుందనే అభిప్రాయంతోనే వారు కోర్టును ఆశ్రయించారనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె గెలుపు ఖాయమని అందరికీ అనిపించింది. కానీ ఇక్కడ కూడా ఆమె అనూహ్యంగా ఓడిపోయారు. అయితే, ఓటమికి ఆమెను బాధ్యులుగా ఎవరు భావించడం లేదు. 'మా' ఎన్నికల్లో ఆమె ఓడినప్పటికీ.. ఈ ఓటమి ఎంపీ మురళీ మోహన్‌దే తప్ప, జయసుధది కాదని గెలిచిన ప్యానల్ సభ్యులు కూడా అంటున్నారు. రాజేంద్ర ప్రసాద్‌పై జయసుధ పోటీ చేసినప్పటికీ.. ఆమె ఓటమిగా దాదాపు ఎవరు చెప్పడం లేదు.

గాలి కబురా...నిజమా..నితిన్ చెప్పాలి


హైదరాబాద్ : అక్కినేని అఖిల్, ప్రముఖ దర్శకుడు వివి వినాయిక్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటిగ్ రెగ్యులర్ గా హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ చిత్రంలో నిఖిల్ గెస్ట్ గా చేసే అవకాసం ఉందని చెప్పుకుంటున్నారు. వినాయిక్, నిఖిల్ కాంబినేషన్ లో గతంలో దిల్ చిత్రం వచ్చి హిట్టైంది. ఇప్పుడు మళ్లీ నితిన్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ నేపధ్యంలో ఓ చిన్న కీలకమైన పాత్రను నితిన్ కోసం డిజైన్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఇది గాలి కబురా నిజమా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. లేదా నితిన్ చెప్పాలి.మరో ప్రక్క ఈ చిత్రానికి అందుతున్న సమాచారం ప్రకారం ‘మిస్సైల్ ' అనే టైటిల్ ని ఖరారు చేసే అవకాసం ఉందని సమాచారం. కథ ప్రకారం ఈ టైటిల్ అయితే ఫెరఫెక్ట్ గా ఏప్ట్ అవుతుందని భావిస్తున్నారని, ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారని చెప్పుకుంటున్నారు. దసరాకు ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.అఖిల్‌ సరసన సాయేషా సైగల్‌ నటిస్తున్న ఈ చిత్రానికి వి.వి.వినాయక్‌ దర్శకుడు. ఈ చిత్రంలో అఖిల్‌ తండ్రి పాత్ర కోసం రాజేంద్రప్రసాద్‌ను ఎంచుకున్నట్లు సమాచారం. అలాగే ఈ చిత్రం మేజర్ పార్ట్ అడవి నేపధ్యంలో జరుగుతుందని తెలుస్తోంది. దాంతో చిత్రంలోని కొన్ని కీ సీన్స్...సౌత్ ఆఫ్రికా అడవులలో షూటింగ్ జరుగనుందని సమాచారం. మిగతా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియో లో జరగుతుందని వినికిడి. వివి వినాయక్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఇటివలే కంప్లీట్ అయ్యింది. రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాలలో హీరో అఖిల్ పై ఇంట్రడక్షన్ ఫైట్ చిత్రీకరించారు. ‘ఫస్ట్ షెడ్యూల్ వాజ్ అమైజింగ్ ఎక్స్ పీరియన్స్. అదిరిపోయే ఇంట్రడక్షన్ ఫైట్ తీసిన స్టంట్ మాస్టర్ రవి వర్మకు థాంక్స్ చెప్పాల్సిందే. సం అమైజింగ్ ఫుటేజ్.' అని అఖిల్ ట్వీట్ చేశారు.

శృతి హాసన్‌ను వేధించేందుకే కేసు!


హైదరాబాద్: శృతి హాసన్‌ను వేధించేందుకే పిక్చర్ హౌస్ మీడియా ఆమెపై కేసు దాఖలు చేసిందని ఆమె తరుపు న్యాయవాది న్యాయస్థానికి వివరించారు. ఆమె స్థానంలో నిర్మాతలు తమన్నాను కూడా తీసుకున్నారని, షూటింగ్ కూడా జరుగుతోందని...కేవలం ఆమెను వేధించేందుకే ఆమెపై కేసు వేసారని వాదించారు. వాదనలు విన్న కోర్టు కేసును ఈ నెల 20కి వాదాయి వేసింది. కేసు పూర్తి వివరాలు... నాగార్జున-కార్తి నటిస్తున్నా చిత్రానికి శృతి హాసన్ తొలుతు సైన్ చేయడం, ఆ తర్వాత డేట్స్ ఎడ్జెస్ట్ కాక తప్పుకోవటంతో ఆమెతో కాంట్రాక్టు కుదుర్చుకున్న సంస్థ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. శృతి హాసన్ ఉన్నట్టుండి అర్ధాంతరంగా తప్పుకోడాన్ని అనైతిక చర్యగా, అన్ ప్రొఫిషనల్ వ్యవహారంగా పరిగణించినట్లు ఆ సంస్ద ప్రకటించింది. ఆమె షూటింగుకు రాక పోవడం వల్ల తమకు ఫైనాన్సియల్ లాస్, రిప్యుటేషన్ లాస్ అయిందని నిర్మాతలు ఆందోళన చేసింది. కోట్లాదిరూపాయల డబ్బు, రిప్యుటేషన్ పోవటంతో పాటు తమ సమయం కూడా చాలా వృధా అయిందని, దీనివలన బిజిగా ఉన్న మిగతా ఆర్టిస్టుల షెడ్యుల్ దెబ్బ తిని లాస్ చాలా ఉంటుందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ విషయమై హీరోయిన్ శృతి హాసన్ మీద కేసు వేసారు. ఈ నేపథ్యంలో.... శృతి హాసన్ కొత్త సినిమా ఒప్పుకోకూడదని, క్రిమినల్ ఇన్విస్టిగేషన్ చెయ్యమని చెన్నై కోర్టు ఆర్డర్ వేసిన సంగతి తెలిసిందే. పిక్చర్ హౌస్ మీడియా లిమిటెడ్ (హైదరబాద్,చెన్నై) వారు ఆమెపై సివిల్ మరియు, క్రిమినల్ ప్రొసీడింగ్స్ జరుపమని కోర్టు కెక్కడంతో కోర్టు ఆదేశాల మేరకు కేసు విచారణ జరుగుతోంది.

జయసుధను ఓడించిన రాజేంద్రప్రసాద్



హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్.......దాదాపు 700 మంది సభ్యులు ఉండే ఒక సినిమా నటుల సంఘం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ‘మా' అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ ఎన్నికలకు ఇంత హైప్ రావడానికి కారణంగా ప్రముఖ నటులంతా రెండు వర్గాలుగా విడిపోయి ఎన్నికల్లో పోటీకి దిగడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమే. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన రాజేంద్రప్రసాద్ వర్గం వెనక చిరంజీవి, జయసుధ వర్గం వెనక దాసరి నారాయణరావు ఉన్నాడనే ప్రచారం కూడా ఈ ఎన్నికలు రసవత్తరంగా మారడానికి మరో కారణం. ఇంతకు ముందు ‘మా' అధ్యక్షుడిగా మురళీ మోహన్ కొనసాగారు. ఈసారి ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదని ప్రకటిచడంతో....రాజేంద్రప్రసాద్ ‘మా' అధ్యక్ష పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. తొలుత ఈ విషయాన్ని ఆయన నాగబాబు, కాదంబరి కిరణ్, శివాజీ రాజా, ఏడిద శ్రీరామ్ తదితరులకు వెల్లడించారు. వారి మద్దతు కూడా లభించడంతో మీడియా ముందుకు వచ్చి ‘మా' ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. అప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న మురళీ మోహన్, మరికొందరికి రాజేంద్రప్రసాద్ ‘మా' అధ్యక్షుడు అవ్వడం ఇష్టం లేదు. ఆయన ఎందుకు అవ్వ కూడదు అని నాగబాబు వెళ్లి అడిగితే రాజేంద్రప్రసాద్ అర్హుడు కాదంటూ వ్యాఖ్యానించారు. నాగబాబు మురళీ మోహన్ వ్యాఖ్యలతో విబేధించారు. ఆయన్నే మేం నిలబెడతాం అంటూ తెగేసి చెప్పారు. దీంతో తన మాట నెగ్గించుకోవాలని నిర్ణయించుకున్న మురళీ మోహన్...రాజేంద్రప్రసాద్ ను ఓడించడానికి జయసుధను రంగంలోకి దింపారు. జయసుధ వర్గంలో ప్రముఖ నటులందరినీ తీసుకొచ్చారు. రాజేంద్రప్రసాద్‌కు ఎవరూ మద్దతు ఇవ్వకుండా తన శక్తిమేర ప్రయత్నించారు. జయసుధ ప్యానెల్ లో ఉన్న మంచు లక్ష్మీప్రసన్న వైస్ ప్రెసిడెంట్ పదవికి ఏకగ్రీవంగా ఎంపికైన విషయం తెలిసిందే. ఇంకా జయసుధ ప్యానెల్ లోతనికెళ్ల భరణి, శివకృష్ణ, నరేశ్, అలీ, రఘుబాబు, పరుచూరి గోపాలకృష్ణ తదితరులు ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ జాబితాలో ఛార్మి ఉంది. అసలు ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు జయసుధ వర్గం జోరు చూసి గెలుపు ఆమెదే అని అంతా అనుకున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వచ్చాయి.

Wednesday, 15 April 2015

పీవీపీ భాగస్వామ్యంతో నాగార్జున కొత్త టీవీ ఛానల్!


హైదరాబాద్: నిన్న మొన్నటి వరకు నాగార్జున, చిరంజీవి, అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్ తదితరు భాగస్వామ్యంలో నడిచిన ‘మా టీవీ' నెట్వర్క్ ఛానల్స్‌ను..... స్టార్ ఇండియా వారు భారీ ఒప్పందంతో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం విలువ దాదాపు రూ. 2000 కోట్లు ఉంటుందని అంచనా. సక్సెస్ ఫుల్‌గా నడుస్తున్న ‘మా టీవీ' నెట్వర్క్ ను ఎందుకు అమ్మేసారనేది అసలు ఎవరికీ అర్థం కాలేదు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అక్కినేని నాగార్జున మరో టీవీ ఛానల్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ సినీ నిర్మాత, ఫైనాన్షియల్ ప్రసాద్ వి పొట్లూరి భాగస్వామ్యంతో కలిసి ఆయన ఈ కొత్త టీవీ ఛానల్ ప్రారంభించబోతున్నట్లు టాక్. పూర్తి వినోదాత్మక కార్యక్రమాలతో సాగు ఈ చానల్ కు ‘మనం' అనే పేరు ఖరారు చేసినట్లు సమాచారం. టీవీ ఛానల్ ఏర్పాటుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ తెరవెనక సాగుతున్నాయని, ఏప్రిల్ 24 నుండి టెస్ట్ సిగ్నల్ రిలే పరీక్షించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై ఇప్పటి వరకు అటు నాగార్జున నుండి గానీ, ఇటు పీవీపీ నుండి గానీ ఎలాంటి ప్రకటన వెలువడే లేదు. త్వరలో నిజా నిజాలు తెలియనున్నాయి.

Thursday, 9 April 2015

సినిమా రివ్యూ - సన్ ఆఫ్ సత్యమూర్తి


మానవ సంబంధాలే... తివిక్రమ్ బాక్సాఫీస్ ఆస్తి .......................................... చిత్రం - సన్ ఆఫ్ సత్యమూర్తి, తారాగణం - అల్లు అర్జున్, సమంత, నిత్యా మీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, సంపత్‌రాజ్, ‘వెన్నెల’ కిశోర్, పాటలు - ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, దేవిశ్రీ ప్రసాద్, సంగీతం - దేవిశ్రీ ప్రసాద్, స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్- సాయిగోపాల్ ఆర్., కెమేరా - ప్రసాద్ మురెళ్ళ, ప్రొడక్షన్ డిజైనర్ - ఎస్. రవీందర్, యాక్షన్ - పీటర్ హెయిన్, కూర్పు - ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.వి. ప్రసాద్, నిర్మాత - సూర్యదేవర రాధాకృష్ణ, రచన - దర్శకత్వం - త్రివిక్రమ్ శ్రీనివాస్ ......................................... ఒకే కథను ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతారు. చెప్పేవాడు గనక చేయితిరిగిన కథకుడైతే, మామూలు కథ కూడా వెండితెరపై కళ్ళకు కొత్తగా కనిపిస్తుంది. హఠాత్తుగా నాన్న చనిపోవడంతో వీధిన పడ్డ కుటుంబాన్ని కాపాడే ఒక కథానాయకుడి కథ మనకు కొత్త కాకపోవచ్చు. కానీ, దానికి నాన్న బోధించిన విలువలే అతి పెద్ద ఆస్తి అనే పాయింట్‌నూ, ఆయన గౌరవాన్ని కాపాడేందుకు హీరో ఎంత దూరమైనా వెళ్ళడాన్నీ జోడించి తీస్తే? త్రివిక్రమ్ - అల్లు అర్జున్‌ల కాంబినేషన్‌లో వచ్చిన తాజా సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (‘...విలువలే ఆస్తి’ అనేది ఉపశీర్షిక) అలాంటి కథే. ఆస్తికీ, ఆనందానికీ లింక్ లేదని ప్రతిపాదిస్తుంది. కథ ఏమిటంటే... విరాజ్ ఆనంద్ (అల్లు అర్జున్) ఒక పెద్ద కోటీశ్వరుడైన సత్యమూర్తి (అతిథి పాత్రలో ప్రకాశ్‌రాజ్) కుమారుడు. మనుషులు, అనుబంధాల కన్నా ఆస్తులు, డబ్బులు విలువైనవి కావనే మంచి మనిషి. అనుకోని ఒక దుర్ఘటనలో ఆయన చనిపోతాడు. తండ్రి చెప్పిన విలువల్ని కాపాడడం కోసం రూ. 300 కోట్ల ఆస్తిని అప్పులవాళ్ళకు వదిలేసి హీరో తన కుటుంబంతో వీధిన పడతాడు. అప్పటికే పల్లవి (అదాశర్మ)తో కుదిరిన పెళ్ళిని మామ (రావు రమేశ్) క్యాన్సిల్ చేస్తాడు. అమ్మ (పవిత్రా లోకేశ్), మతి చెడిన అన్నయ్య (‘వెన్నెల’ కిశోర్), వదిన, వాళ్ళ చిన్నారి పాప సంరక్షణభారం హీరో మీద పడుతుంది. ఆర్థిక సంపాదన కోసం హీరో చివరకు వెడ్డింగ్ ప్లానర్ అవతారమెత్తుతాడు. తీరా ఆ పెళ్ళి తనను కాదన్న పల్లవిదే! అక్కడ జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో సమీరా అలియాస్ సుబ్బలక్ష్మి (సమంత)తో హీరో ప్రేమలో పడతాడు. ఆ ప్రేమను దక్కించుకోవడానికీ, చనిపోయిన తన నాన్న మీద ఆమె తండ్రి సాంబశివరావు (రాజేంద్రప్రసాద్) వేసిన అభాండాన్ని చెరిపివేయడానికీ హీరో ఏకంగా తమిళనాడులోని రెడ్డియార్‌పట్టి వద్ద స్థిరపడ్డ ఓ తెలుగు కుటుంబం దగ్గరకు వెళతాడు. అక్కడికి ఫస్టాఫ్. తమిళనాట కొన్ని గ్రామాలకు నియంతగా వ్యవహరించే దేవరాజు నాయుడు (ఉపేంద్ర), అతని భార్య (స్నేహ)ల కుటుంబంలోకి హీరో, అతని మిత్రుడు పరంధామయ్య (అలీ) చేరతారు. అక్కడ జరిగిన అనేక సంఘటనల మధ్య 600 మంది ప్రైవేటు సైన్యమున్న దేవరాజు తన చెల్లెలు వల్లి (నిత్యామీనన్)ని హీరోకు ఇచ్చి పెళ్ళిచేయాలనుకుంటాడు. ఇష్టం లేని ఆ పెళ్ళిని హీరో ఎలా తప్పించుకున్నాడు, 8 వేల గజాల స్థలం అమ్మకం విషయంలో తన తండ్రి మీద పడ్డ అభాండాన్ని ఎలా చెరిపేసుకున్నాడన్నది మిగతా కథ. ఎలా చేశారంటే... క్యారెక్టర్ ఆర్టిస్టు ఎమ్మెస్ నారాయణ ఆకస్మికంగా మరణించడానికి ముందు నటించిన చివరి సినిమాల్లో ఒకటి ఇది. షూటింగ్ అయిపోయాక ఆయన మరణించడంతో, వేరొకరి మిమిక్రీతో డబ్బింగ్‌ను తెలివిగా మేనేజ్ చేసిన ఈ చిత్రబృందం ఈ సినిమాను గౌరవంగా ఎమ్మెస్‌కే అంకితం చేసింది. నిజానికి, ఈ సినిమా నిండా బోలెడంతమంది నటీనటులు. కాబట్టి, ఏ ఫ్రేమ్‌లో చూసినా తెర నిండుగా నటీనటులు కనిపిస్తూనే ఉంటారు. ఇన్ని పాత్రల మధ్యనా అల్లు అర్జున్ విపరీతమైన ఎనర్జీతో, విచిత్రమైన ఒక డైలాగ్ డెలివరీ శైలితో అందరినీ ఆకట్టుకున్నారు. బాధ్యతాయుతమైన కొడుకుగా, చలాకీ ప్రేమికుడిగా రకరకాల షేడ్స్ ఉన్న పాత్రను బాగా పోషించారు. కొన్ని పాటలకు చులాగ్గా అతను వేసిన స్టెప్పులు బాగున్నాయి. మెయిన్‌స్ట్రీమ్ సినిమాల హీరోయిన్ సమంత డయాబెటిక్ పేషెంట్ లాంటి పాత్ర పోషించడం విశేషమే. అందం, అభినయం కలగలిసిన పాత్రపోషణ ఆమెది. నిత్యా మీనన్ కనిపించేది కాసేపే అయినా, బాగున్నారు. అదాశర్మది చాలా కొద్దిసేపు కనిపించే పాత్ర. ఫస్టాఫ్‌లో అలీ, సెకండాఫ్ చివరలో బ్రహ్మానందం కామెడీ పండించే పనిని భుజానికి ఎత్తుకున్నారు. ఉపేంద్ర, కోట శ్రీనివాసరావు, స్నేహ లాంటి వారు నిడివి రీత్యా చిన్నవే అయినా, ఆ యా పాత్రలు నిండుగా కనిపించడానికి తోడ్పడ్డారు. సాంకేతిక విభాగాల పనితీరేమిటంటే... ఫస్టాఫ్ సెంటిమెంట్ సన్నివేశాలతో కొంత నిదానంగా నడుస్తుంది. ఇక, సెకండాఫ్‌లో కొంత వేగంగానే నడిచినా, అనేక అంశాలను ఒక్కచోట గుదిగుచ్చడంతో ఏ పాత్ర మీదా, సంఘటన మీదా పూర్తి శ్రద్ధ పెట్టే అవకాశం లేకుండాపోయింది.అయితేనేం, ఈ సినిమాకున్న అనేక బలాల్లో పాటలు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ముఖ్యమైనవి. ఇప్పటికే ఈ పాటలు రేడియోలో, టీవీల్లో మారుమోగుతున్నాయి. ముఖ్యంగా, ‘చల్ చలో చలో....’ (రచన - రామజోగయ్య శాస్త్రి, గానం - రఘు దీక్షిత్) అనే పాట జీవన తాత్త్వికతను బోధిస్తూ, ఆలోచింపజేసేలా సాగుతుంది. దేవిశ్రీ ప్రసాదే స్వయంగా రాసి, శ్రావణభార్గవితో కలసి పాడిన ‘సూపర్ మచ్చీ...’ పాట సినిమా చివరలో పక్కా మాస్ శైలిలో ఉర్రూతలూపుతుంది. అలాగే, ‘కమ్ టు ది పార్టీ...’ (గానం - విజయ్ ప్రకాశ్) అనే పార్టీ గీతం ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి కలానికి ఉన్న ఆధునిక పాళీని చూపుతుంది. రాగల కొద్దిరోజులు జనం నోట నానుతుంది. శ్రీమణి రాసిన ‘జారుకో...’ గీతం (గానం - దేవిశ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్, ఎం.ఎం. మానసి) గమ్మత్తుగా ధ్వనిస్తుంది. ఇక, ప్రసాద్ మురెళ్ళ సినిమాటోగ్రఫీ, రవీందర్ కళా దర్శకత్వం కథానుగుణంగా సాగుతాయి. పీటర్ హెయిన్ చేసిన యాక్షన్ సన్నివేశాల్లో సూట్‌కేసు దొంగలపై హీరో చేసే ఫైటు లాంటివి బాగుంటాయి. ఎలా ఉందంటే... హీరో ప్రయాణం ఎక్కడో మొదలై మరెక్కడే తేలినట్లూ, బలమైన విలన్ సినిమాకు కరవైనట్లూ అనిపించే ప్రమాదం ఉన్న ఈ స్క్రిప్టు నిజానికి అంతకన్నా బలమైన మరో ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. మనం ఎదుటివాళ్ళకు ఏది చేస్తే, అదే మనకూ తిరిగి వస్తుంది. ఎదుటివాళ్ళకు మనం మంచి చేసినా, కోరుకున్నా... అదే మనకూ లభిస్తుందనే విషయాన్ని అంతర్లీనంగా చెప్పే వెండితెర కథ ఇది. త్రివిక్రమ్‌కు బాగా పేరు తెచ్చిన ‘అతడు’, ‘అత్తారింటికి దారేది’ లాంటి వాటి లాగానే ఈ చిత్రం కూడా మానవ సంబంధాలు, బంధాలు, బాంధవ్యాల చుట్టూ తిరిగే కథే. బహుశా అందుకే కావచ్చు... అక్కడక్కడా ఇది త్రివిక్రమ్ - పవన్ కల్యాణ్‌ల ‘అత్తారింటికి దారేది’నీ, తమిళ నేపథ్యంతో వచ్చిన షారుఖ్ ఖాన్ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’నూ గుర్తుకుతెస్తుంది. ఇవన్నీ కుటుంబ కథలు కావడం, సకుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తీసినవి కావడం అనివార్యంగా పోలికలు తెస్తుంది. కాకపోతే, చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా మనసుకు హత్తుకొనేలా, అదీ ప్రేక్షకుడు ఒక్కక్షణం ఆగి ఆలోచించేలాగా కూడా చెప్పడం రచయితగా, దర్శకుడిగా త్రివిక్రమ్‌కు ఉన్న పెద్ద బలం. పైగా, కథలోని ఏ సంఘటననూ ఏకబిగిన ఒకేసారిగా పూర్తిగా వెల్లడించరు. దాన్ని విడతల వారీగా చెప్పుకుంటూ, ముడులు విప్పుకుంటూ వెళ్ళడంలో ఒక ప్రయోజనం ఉంది. ఆ సంఘటనలోని రకరకాల కోణాలు మెల్లగా వెల్లడవుతూ, ఒక సస్పెన్స్‌నూ, సర్‌ప్రైజ్‌నూ ఆఖరు వరకూ కొనసాగిస్తాయి. హీరో తండ్రి తాలూకు ప్రమాదమనే సంఘటనను హీరో దృష్టిలో ఒకసారి కొంత, హీరోకు ప్రత్యర్థి (విలన్ అనచ్చా?) దృష్టిలో మరికొంత, దానికి కొనసాగింపుగా నిత్యా మీనన్ దృష్టిలో మరికొంత వెల్లడించడం అలాంటిదే! ఇలాంటి సినీ కథన పద్ధతి ఆసక్తికరంగానూ, రొటీన్‌కు భిన్నంగానూ అనిపిస్తుంది. డైలాగ్ కామెడీ కన్నా దృశ్యాలు, భావప్రకటన ద్వారా విజువల్ కామెడీకి ఎక్కువ ప్రాధాన్యమివ్వడం కూడా కొత్తగా అనిపిస్తుంది. ఈ సినిమా మొత్తాన్నీ ఆయన ఒక మంచి నవల తరహాలో నేరేట్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో పాత్రలు, సంఘటనలు, కొన్నిచోట్ల రచయితగా రాసిన డైలాగులు మామూలు కన్నా ఎక్కువే. హీరో మరీ ఎక్కువ మాట్లాడుతున్నాడేమో అనీ అనిపిస్తుంది. అయితే, రొటీన్ సినిమాలకు భిన్నమైన ఫీలింగ్ మాత్రం కలుగుతుంది. కొన్నిచోట్ల త్రివిక్రమ్ రాసిన డైలాగులు, పాత్రల ద్వారా వల్లించిన జీవన సూక్తులు చిరకాలం గుర్తుండిపోతాయి. హీరో మాటల్లో వచ్చే ‘‘భార్య అంటే ఇష్టపడి తెచ్చుకున్న బరువు. పిల్లలంటే మోయాలనిపించే బాధ్యత. నాన్నంటే ఒక మర్చిపోలేని జ్ఞాపకం’’..., ‘‘మనం బాగున్నప్పుడు విలువలు మాట్లాడి, కష్టాల్లో ఉన్నప్పుడు లెక్కలు మాట్లాడడం కరెక్ట్ కాదు సార్’’..., ‘‘భార్యను గెలవాలంటే కప్పులు పగలగొట్టడం కాదు సార్! (మధ్యలో ఉన్న) ఆ గోడ బద్దలుకొట్టండి!’’ లాంటి డైలాగులు అందుకు ఉదాహరణ. తమిళనాట సన్నివేశాలకు ‘కూడు తిన్నారా?’ లాంటి అక్కడ మాట్లాడే తెలుగే వాడేందుకు శ్రమించారు. ఇవన్నీ సినిమాకు పాజిటివ్ అంశాలు. అయితే, ఏ సీన్‌కు ఆ సీన్‌గా బాగుందనిపించే ఈ రెండు గంటల 42 నిమిషాల సినిమాలో వచ్చే సవాలక్ష సబ్‌ప్లాట్లు, తండ్రి గౌరవాన్నీ - ఆయన చెప్పిన విలువలనూ కాపాడుకోవడం కోసం హీరో పడే పాట్లు చూశాక కొన్నింటికి సరైన వివరణలు, తార్కికమైన ముగింపులు కనపడవు. హీరో ప్రేమిస్తున్నది అదాశర్మ స్నేహితురాలైన సమంతను అని పెళ్ళి ఏర్పాట్ల మధ్య పదే పదే చెబుతూ వస్తారు కానీ, ఆ పక్కనే కనిపిస్తున్న రాజేంద్రప్రసాద్ కూతురే ఆ అమ్మాయన్న సంగతిని తరువాత సీన్ల ఎప్పుడో బయటపెట్టడం ఒక సినిమాటిక్ స్క్రీన్‌ప్లే కన్వీనియన్స్. ఇక, నిత్యామీనన్ నిజానికి ప్రేమిస్తున్నది తన మేనమామనే అయినా, హీరోతోనూ ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపించడం తికమక కలిగిస్తుంది. అలాగే, ఉపేంద్ర ఇంటిపక్కనే అతని బావమరిది ఉన్నాడని చెబుతారు, చూపిస్తారు కానీ, సినిమాలో అతను మళ్ళీ కనిపించడు. తమిళనాడులోని ఉపేంద్ర ఇంటికి హీరో బృందం రావడానికే కారణమైన సదరు బావమరిది పాత్ర ఆ తరువాత వారి గురించి పట్టించుకోదెందుకో తెలియదు. ఇలాంటి లూజ్ ఎండ్స్‌ను పక్కనపెడితే, మొత్తం మీద ఈ సినిమా సగటు ప్రేక్షకులను నిరాశ పరచదు. అభిమానులతో పాటు కుటుంబ ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుంది. మర్చిపోతున్న మానవ సంబంధాలు, మనం వదిలేసుకుంటున్న మంచి విలువలను మరోసారి గుర్తు చేస్తుంది. ఆ మేరకు ఈ దర్శక - రచయితనూ, తీసిన నిర్మాతనూ అభినందించాల్సిందే! కాకపోతే, పెళ్ళి భోజనానికని సిద్ధమై వచ్చిన ప్రేక్షకులు పూర్తిస్థాయిలో సంతృప్తి పొందుతారా అన్నదే కించిత్ అనుమానం. అయితే, అవేవీ ఈ సినిమా కమర్షియల్ విజయాన్ని అడ్డుకోలేవన్నది మాత్రం అనుమానం అక్కర్లేని నిజం. కొసమెరుపు - అన్నట్లు... ఈ సినిమాలో హీరో పాత్రను ఒకరు నందు అంటారు... మరొకరు ఆనంద్ అంటారు... ఇంకొందరు విరాజ్ అని పిలుస్తారు. వెరసి అతని పూర్తి పేరు - విరాజ్ ఆనంద్ అని ప్రేక్షకులే గ్రహించాలి. మొత్తానికి, సినిమాలో ఒక ప్రధానమైన కథకు బోలెడన్ని ఉపకథలు కలిపినట్లే, ఒక హీరో పాత్రకు ఇన్ని పేర్లు, ముద్దు పిలుపులూ ఉండడం అరుదైన విచిత్రమే! మొత్తానికి, త్రివిక్రమ్ మార్కు డైలాగులు, కథన విధానం, అల్లు అర్జున్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, దేవిశ్రీ బాణీల్లోని పాటలు లాంటి వాణిజ్య విలువలు ఈ ‘సన్నాఫ్ సత్యమూర్తి’కి బాక్సాఫీస్ వద్దే కాక, రేపు పదే పదే టీవీ చానళ్లలో ప్రసారానికీ తరగని ఆస్తి. ‘త్రివిక్రమ్ సినిమా అంటే అలా ఉండాలి, ఇలా ఉండాలి’ అనుకొంటూ, గత చిత్రాల పోలికలతో ‘అంతకు మించి...’ కావాలని కోరుకోకపోతే, వేసవి సినీ కాలక్షేపానికి ఇంతకు మించి కావాల్సింది ఇంకేముంటుంది!

Saturday, 4 April 2015

మహేష్ మూడు నెలలు కంటిన్యూ కాల్ షీట్స్


హైదరాబాద్ :మహేష్‌బాబు కంటిన్యూగా మూడు నెలలు పాటు అంటే 90 రోజుల పాటు కాల్ షీట్స్ ని శ్రీకాంత్ అడ్డాల చిత్రం కోసం ఎలాట్ చేసినట్లు సమచారం. తూర్పు గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్ లో కథ జరుగుతుందని, అక్కడ కొన్ని సీన్స్ తీస్తారని తెలుస్తోంది. ఈ చిత్రం కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే... శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం' సినిమాలో నటించటానికి కమిటైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మే 31న అంటే మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజున ప్రారంభం కానుందని సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. దర్శకుడు ఇప్పటికే స్క్రిప్టు వర్క్ ఫినిష్ చేసి ఓ వెర్షన్ వినిపించి గ్రీన్ సిగ్నల్ పొందాడని తెలుస్తోంది. గతంలో మహేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' చిత్రం తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దాంతో మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్‌లో ‘బ్రహ్మోత్సవం' రూపొందుతూండటంతో బిజినెస్ కూడా బాగా జరుగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి.సినిమాస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ నిర్మిస్తున్నారు. అయితే పి.వి.పి సంస్థ ఈ సినిమా కోసం కాస్టింగ్‌ కాల్‌ ఇచ్చింది. ఈ చిత్రంలో నటించడానికి 15 నుంచి 50 సంవత్సరాల వయస్సులోపు మేల్‌, ఫీమేల్‌ ఆర్టిస్టులు కావాలని ప్రకటించారు. ఆసక్తి కలవారు ఫుల్ సైజ్, క్లోజప్ ఫోటోతో కాంటాక్ట్ చేయాల్సిందిగా ప్రకటించారు. పైన ఫొటోలో ఉన్న మెయిల్ ఐ.డికి ఫోటోలు పంపించవచ్చు. ఈ సినిమా మహేష్ బాబుతోనే అయితే... తనతో తెరపంచుకునే అవకాశం కొత్త వారికి కలుగుతుంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తర్వాత మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘బ్రహ్మోత్సవం'. పివిపి సినిమాస్ పతాకంపై ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘బ్రహ్మోత్సవం'లో మహేష్ సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ఎంపికైనట్టు వార్తలు వచ్చాయి. వాటిని చిత్ర బృందం ఇంకా ఖరారు చేయలేదు. ఈ సినిమాలో రావు రమేష్ కీలక పాత్రలో నటించనున్నారు. మిగతా వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

పవన్ కళ్యాణ్.....సరసన అంటూ ఆ ముగ్గరు హీరోయిన్లు!


హైదరాబాద్: పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్-2' చిత్రం వస్తుందంటూ గత రెండు మూడేళ్లుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే సినిమా మాత్రం ఇప్పటికీ మొదలు కాలేదు. అసలు ఎప్పుడు మొదలవుతుందో కూడా తెలియని పరిస్థితి. సంపత్ నంది దర్శకత్వంలో ప్రీప్రొడక్షన్ పనులు మొదలైనా....సినిమా పట్టాలెక్కక ముందే దర్శకుడు మారాడు. ప్రస్తుతం ఈ చిత్రం దర్శకుడు బాబీ చేతిలో ఉంది. అయితే ఈ సినిమా మొదలయ్యే సమయానికి బాబీ ఉంటాడో? మరో దర్శకుడు వస్తాడో? లేక పవన్ కళ్యాణే ఈ చిత్రానికి దర్శకుడి అవతారం ఎత్తుతాడో? తెలియని పరిస్థితి. అయితే సందెట్లో సడేమియాలా....పవన్ కళ్యాణ్ పేరు వాడి పలువురు అప్ కమింగ్ హీరోయిన్లకు ప్రచారం కల్పిస్తున్నారు గాసిప్ రాయుళ్లు. ‘గబ్బర్ సింగ్-2' చిత్రంలో ఇప్పటికే అనిషా ఆంబ్రోస్ హీరోయిన్‌గా ఎంపికయింది. రెండో హీరోయిన్ కోసం వెతుకులాట సాగుతోందట. ఇం దుకోసం రెజీజా, రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా పేర్లను పరిశీలిస్తున్నారట. అసలు సినిమా ఎప్పుడు మొదలవుతుందో అనే విషయమై ప్రొడక్షన్ టీం నుండి ఇప్పటి వరకు ఎలాంటి సమచారం లేక పోవడం గమనార్హం. ఇప్పటికే సంపత్ నంది మార్చిన పవన్.... స్క్రిప్టు డెవలప్ మెంటు విషయంలో బాబీ పని తీరును కూడా మెచ్చడం లేదని, అతన్ని కూడా మార్చే అవకాశం ఉందని అంటున్నారు. దర్శకుడు ఫోన్ చేస్తే అసలు సమాధానమే ఇవ్వడం లేదటన పవన్. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మిస్తున్నారు. కనీసం ఆయన కూడా ఈ సినిమాపై ఎలాంటి సమాచారం మీడియాకు ఇవ్వక పోవడం గమనార్హం.

సన్నీ లియోన్ ఆ హోటల్‌లో..? అనుమానాలు? ఎఫ్ఐఆర్!


హైదరాబాద్: పోర్న్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సన్నీ లియోన్...ఇక్కడ క్రమ క్రమంగా తన రేంజి పెంచుకుంటోంది. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగింది. అశ్లీల చిత్రాల(పోర్న్) ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావడంతో ఇండియాలో అడుగు పెట్టిన మొదట్లో ఆమెను అంతా వ్యతిరేకించారు. ఆ విమర్శలను భరించి తనపై పాజిటివ్ ఇమేజ్ వచ్చేలా చేసుకుంది సన్నీ. అయితే ఇప్పటికీ ఆమెపై ఉన్న బ్యాడ్ ఓపీనియన్ జనాల్లో తగ్గలేదని తాజాగా ఓ సంఘటన రుజువు చేసింది. తను నటించిన ‘ఏక్ ఫహెల లీలా' సినిమా ప్రమోషన్ కోసం సన్నీ లియోన్ లాస్ట్ సండే సూరత్ పట్టణానికి వచ్చింది. తన భర్త డేనియల్ వెబర్, బాలీవుడ్ నటుడు జై భానుశాలి, డైరెక్టర్ బాబీ ఖాన్ తో కలిసి ఆమె ప్రమోషన్లో పాల్గొనాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో వేదిక ఫైస్టార్ హోటల్ నుండి మరో చోటికి మార్చారు. దీంతో స్థానిక వ్యక్తి ఒకరు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆమె వచ్చింది సినిమా ప్రమోషన్ కోసం కాదని, ఇతర కారణాలంటూ తన మనసులో ఉన్న అనుమానాలు వ్యక్తం చేసారు. అయితే సూరత్ పోలీసులు మాత్రం ఆమెపై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని స్పష్టం చేసారు. సన్నీ లియోన్ సినిమాల విషయానికొస్తే ‘ప్రస్తుతం ఆమె నటించిన ‘ఏక్ పెహలీ లీలా' చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. దీంతో పాటు మిలప్ జవేరి దర్శకత్వంలో వస్తున్న సెక్స్ కామెడీ చిత్రం ‘మస్తీ జాదే'లో డ్యూయల్ రోల్ చేస్తోంది. దీంతో పాటు దేవాంగ్ ధోలకియా దర్శకత్వంలో ‘కుచ్ కుచ్ లోచా హై' చిత్రంలో కూడా నటిస్తోంది.

కాదు...త్రీ (‘అవును 2′ రివ్యూ)


తొలినుంచి మనకు సీక్వెల్ చిత్రాలు పెద్దగా వర్కవుట్ అవటం లేదు. పెరిగిన ఎక్సపెక్టేషన్స్, బిజినెస్ పర్పస్ లో సీక్వెల్ కోసం కథలేకపోయినా సాగతీసే కథనం చాలా సార్లు కారణమవుతూంటాయి. ఇప్పుడు అవును 2 కి అదే పరిస్ధితి ఏర్పడింది. దెయ్యమా సాప్టవేర్ ఇంజినీరా అని డౌట్ వచ్చేలా జరిగే ఈ చిత్రం ఆకట్టుకునేటట్లు కనపడటం లేదు. హర్రర్ సినిమా కదా అని భయపడదాం అని ప్రిపేరై వెళ్లినవాళ్ళు...ఇలాంటి సినిమాకు వచ్చేమేంటిరా అని భయపడేలా రవిబాబు తీసారు. దానికి తోడు ఈ హర్రర్ జానర్ చిత్రాలు చూసే ఆసక్తి ఉన్నవాళ్లు ఎక్కువగా హాలీవుడ్ పై ఆధారపడుతూంటారు. కాబట్టి అక్కడ నుంచి కథ,కానీ సీన్స్ కాని ఎత్తుకొస్తే ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఈ విషయం మర్చిపోయాడో ఏమో కానీ రవిబాబు...Paranormal Activity, The Entity , The Haunted చిత్రాలు కలిపి వండేసారు. అవన్నీ హర్రర్ అభిమానులు ఒకటికి నాలుగుసార్లు చూసేవే..కాబట్టి...మరోసారి వాటినే చూద్దామనిపిస్తుంది ఈ సినిమా చూసి బయిటకు వచ్చాక. ఇవన్నీ ప్రక్కన పెడితే హీరోయిన్ పూర్ణ అభిమానులకు ఇది...ఆమె సినిమా..ఆమె భుజాలపై మోసిన సినిమా గా చూడవచ్చు.దర్శకుడు మొదటే చెప్పినట్లు ‘అవును 2′ కథ సరిగ్గా ‘అవును′ సినిమా చివరి షాట్ దగ్గరనుండి మొదలవుతుంది(దానివల్ల పెద్దగా ఒరిగేది ఏమీ లేదనుకోండి). ఒక్కసారి ‘అవును' చిత్రం గుర్తు చేసుకుంటే...ఆ మొదటి భాగంలో మోహిని (పూర్ణ)ను కామంతో రగిలిపోయిన కెప్టెన్ రాజు(రవిబాబు) ప్రేతాత్మ ఆమెను అనుభవించాలని ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో తన భర్త హర్ష(హర్షవర్దన్ రాణే)ని పొడిచేస్తుంది.

 సెకండ్ పార్ట్ కు వస్తే... అక్కడితో తమను వదిలి ఆ ప్రేతాత్మ వెళ్ళిపోయిందని హర్ష, మోహినిల జంట భావించి, మనశ్శాంతి కోసం ఊరి బయటనున్న తమ ఫ్లాట్ నుండి కొత్తగా సిటీకి దగ్గరలోని మరో ఫ్లాట్‌లోకి మారతారు. (అయితే మనుష్యులే కష్టపడి ఇల్లు వెతుక్కుని వెళ్లిపోయినప్పుడు ఆత్మలు వెల్లలేవా... కెప్టెన్ రాజు ప్రేతాత్మ కూడా అక్కడకి ఆమె వెతుక్కుంటూ వెళ్తుంది). దాంతో వెళ్ళిపోయిందనుకున్న ఆత్మ మళ్ళీ తిరిగి రావడం, మోహిని, హర్షలను మళ్ళీ వేధించడం మొదలుపెడుతుంది. ఆ తర్వాత కెప్టేన్ రాజు భారి నుండి ఈ జంట ఎలా తప్పించుకున్నారు? అలాగే కాశీకి వెళ్ళినపుడు అక్కడి అఘోరా ఇచ్చిన యంత్రం వీరిని ఏమన్నా కాపాడకలిగిందా? చివరకు కెప్టెన్ రాజ్ ఏమయ్యాడు? అన్నది మిగతా కథ. వినటానికి ఈ కథ బాగనే ఉందనిపించినా ఫైనల్ గా ఈ చిత్రం తను ఏం చేయాలో క్లారిటీ లేని దెయ్యం లేదా ప్రేతాత్మ కథ గా తయారైంది. ముఖ్యంగా దెయ్యం (కెప్టెన్ రాజు) కు ఎంతసేపూ టెక్నాలిజీ మీదే దృష్టే కానీ...మొదటి పార్ట్ లలోగా మోహని పై ఉన్నట్లు కనిపించదు. అలాగే అసలు ఏం జరుగుతోందా అని డౌట్ వచ్చేలా... శరీరమే లేకుండా..మోహన్ ని మానబంగం చేయటానికి ప్రయత్నించటం, ఇంకొసారి..వేరే వారి శరీరంలో ప్రవేసించటం వంటివి ఆ దెయ్యం చేస్తూంటుంది. అంతేకానీ ఇలా చేద్దాం..అని ఆదెయ్యానికి ఎక్కడా క్లారిటీ ఉన్నట్లు కనపడదు. అలాగని మీరీ ప్లస్ పాయింట్లు లేవు అని కాదు... అవునులో ఆటోమేటిక్ లైటింగ్ సిస్టం ద్వారా భయపెట్టినట్టే, ఇక్కడ ఆటోమేటిక్ మస్కిటో స్ప్రే ద్వారా భయపెట్టే ప్రయత్నం బాగుంది. అలాగే తొలిభాగం చూడనివారికి కూడా ఇది సంపూర్తిగా అర్దమయ్యేలా దర్శకుడు డిజైన్ చేయటం కూడా మంచి ఎలిమెంటే. అంతేకాకుండా హీరోయిన్ పూర్ణ ..ఈ సినిమాకు పెద్ద హైలెట్. ఆమె లేకపోతే ఈ సినిమాని చివరి వరకూ చూడటమే కష్టం. హర్షవర్దన్ రాణే కూడా బాగా చేసాడు. రవివర్మ పాత్ర క్లైమాక్స్ లో మాత్రమే ఏక్టివ్ అయ్యింది