Saturday, 23 November 2013

హైటెక్ సిటీ బాబు సొత్తా, ఫోటోలకి ఫోజులిస్తున్నాడు: కెకె


రాష్ట్ర రాజధానిలోని హైటెక్ సిటీ వద్ద తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఫోటోలకు ఫోజులిస్తున్నాడని, అది ఆయన సొత్తు కాదని తెరాస జాతీయ కార్యదర్శి కె కేశవ రావు శనివారం విమర్శించారు. హైదరాబాద్ నగరంలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని తమ వారికి ధారాదత్తం చేసిన బాబు హైటెక్ సిటీ తన సొత్తు అన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. హైటెక్ సిటీ నిర్మించిన భూములేమైనా బాబు సొత్తా అని ప్రశ్నించారు. ఈ భూములన్నీ తెలంగాణ భూములేనని బాబు గ్రహించాలని అన్నారు. హైదరాబాద్‌లో దోపిడీని కొనసాగించేందుకే కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారని టిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే నాయిని నర్సింహా రెడ్డి విమర్శించారు. టిఆర్‌ఎస్ 13ఏళ్ల ఉద్యమ ఫలితంగానే తెలంగాణ ఏర్పడుతోందని అన్నారు. సంపూర్ణ తెలంగాణాను టిఆర్‌ఎస్ కోరుకుంటోందని, ఎలాంటి పేచీలు పెట్టినా మళ్లీ ఉద్యమించడానికి టిఆర్‌ఎస్ సిద్ధంగా ఉందని నాయిని హెచ్చరించారు. అసెంబ్లీ ప్రొరోగ్ వ్యవహారం రామాయణంలో పిడకల వేట కంటే చిన్న విషయమని, దానిని తాము పట్టించుకోబోమని తెలంగాణ ఐకాస చైర్మన్ కోదండరాం వేరుగా అన్నారు.

 అసెంబ్లీ ప్రొరోగ్ అయినా కాకపోయినా అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై నిర్ణీత వ్యవధిలో చర్చ జరిగినా జరగకపోయినా ఆ బిల్లును పార్లమెంటుకు పంపించే పూర్తి అధికారాలు రాష్ట్రపతికి ఉన్నాయన్నారు. ఆర్టికల్ 371 డి, ప్రొరోగ్ ఆలోచనలన్నీ అవివేకపు, మూర్ఖత్వపు ఆలోచనలేనని, తెలంగాణ ఆగే ప్రసక్తే లేదని అన్నారు. 'భద్రాచలం తెలంగాణలో అంతర్భాగం' అనే అంశంపై హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో కోదండరాం మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు ముగింపు దశకు వచ్చిందని, సీమాంధ్ర పాలకులకు ఇంగిత జ్ఞానం ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో విడిపోయిందని తెలుసుకుని శాంతియుతంగా విభజనకు సహకరించాలని, లేకుంటే కాల గర్భంలో కలిసి పోతారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌పై ఏ ఒక్క ఆంక్షనూ సహించబోమన్నారు.

ఐశ్వర్యారాయ్ కు సైతం తప్పని అత్తపోరు...


అత్త పోరుపై ఆ మధ్య కాలం దాకా సినిమాలు వచ్చి ఆగిపోయాయి. తర్వాత కోడళ్లు సాధింపు సీరియల్స్ పాపులర్ అయ్యాయి. దానకి ఉమ్మడి కుటుంబాలు... కలిసి కాపురాలు తగ్గాయన్నారు. అయితే ఈ కాలంలో కూడా ఐశ్వర్యారాయ్ వంటి స్టార్ హీరోయిన్ కి అత్తపోరు తప్పలేదని ముంబై మీడియా సమాచారం. అందాల సుందరి ఐశ్వర్యారాయ్‌ కూడా ఇప్పుడు ఇలాంటి విషయంలో వార్తల్లోకెక్కింది. బిగ్‌బీ కుటుంబంలో ఇప్పుడు ఇలాంటి వాతావరణం ఉందా అని అందరూ ఒకింత ఆశ్చర్యపోతున్నారు. దానికి కారణం అత్తాకోడళ్లకు పడడంలేదన్న వార్తలు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు కూడా ఇది నిజమేనేమో అనేలా చేశాయి. బచ్చన్‌ కోడలు ఐశ్వర్య వేరు కాపురం పెట్టాలని యోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అత్త జయాబచ్చన్‌ వైఖరితో ఐశ్వర్య ఇమడలేకపోతోందట. ఐశ్వర్యారాయ్‌కు సంబంధించిన ప్రతి చిన్న విషయంలోనూ జయాబచ్చన్‌ జోక్యం చేసుకోవడాన్ని ఐశ్వర్య జీర్ణించుకోలేకపోతోంది. ఈ కారణంవల్లే అత్తాకోడళ్ల మధ్య మనస్ఫర్ధలు పొడచూపుతున్నట్లు తెలుస్తోంది.

 వ్యక్తిగత స్వేచ్ఛతో సంబంధం లేకుండా చేసే ప్రతిపని, తీసుకునే ప్రతి నిర్ణయం గురించి అత్త జయాబచ్చన్‌కు ఐశ్వర్య చెప్పాల్సిందేనట. అత్తతో రోజూ ఎదుర్కొంటున్న సమస్యతో విసుగెత్తిపోయి, ఓపిక నశించిపోవడంతో స్వతంత్రంగా ఉండాలని ఐశ్వర్య ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఫొటో జర్నలిస్టులు ఐశ్వర్యను ఆమె పేరుతో (అత్తింటి పేరు లేకుండా) పిలవడంతో చూసిన జయబచ్చన్‌ కోపంతో ఊగిపోయిందంటున్నారు. అంతేగాక ఆ ఫొటో జర్నలిస్టులపై తీవ్రస్థాయిలో మండిపడింది. 'ఐశ్వర్యా... ఐశ్వర్యా అంటూ పిలవడం ఏమిటి... ఆమె ఏమైనా మీ స్నేహితురాలా, క్లాస్‌మేటా?'' అని ప్రశ్నించింది. ఇదంతా మీడియా ఎదుటే చోటుచేసుకోవడంతో అత్త జయాబచ్చన్‌ వ్యవహారశైలి కోడలు ఐశ్వర్యరాయ్‌ను నొప్పించింది.

 ఈ సంఘటన తర్వాత అత్తపై అసంతృప్తి వ్యక్తంచేయకపోయినా ఇద్దరి మధ్యా దూరం పెరిగినట్లు తెలుస్తోంది. అయితే భర్త అభిషేక్‌ బచ్చన్‌, మామ అమితాబ్‌ బచ్చన్‌లపై ఐశ్వర్యకు ప్రేమాభిమానాలు ఏమీ తగ్గలేదు. అభిషేక్‌ ఆమెకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛనిస్తారట. దానికితోడు మామ అమితాబ్‌ ఆమె వ్యక్తిగత విషయాల్లో అసలు జోక్యం చేసుకోరని అంటున్నారు. ఓ బిడ్డకు తల్లి అయిన ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ త్వరలోనే బాలీవుడ్‌లోకి తిరిగి ప్రవేశించాలని భావిస్తోంది. ఈ సమయంలో ఐశ్వర్య అభీష్టానికి అత్తగా జయాబచ్చన్‌ అడ్డుచెబితే ఇరువురి మధ్యా విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో ఇదంతా జరగడానికి ముందే భర్త, కుమార్తెతో కలిసి అత్తమామలకు దూరంగా వేరు కాపురం పెట్టాలని ఐశ్వర్యారాయ్‌ భావిస్తున్నట్లు సమాచారం.

హీరోయిన్ గా శృతి హాసన్ చెల్లెలు ఖరారు...డిటేల్స్


: తెలుగు,తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న శృతి హాసన్ చెల్లి త్వరలో ప్రేక్షకులను అలరించటానికి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. కమల్‌ హాసన్‌ రెండవ కుమార్తె అయిన అక్షర హాసన్ ఆర్‌.బల్కి రూపొందించబోతున్న ఓ హిందీ సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకోబోతున్నారు. ఇంతకాలం డైరక్షన్ డిపార్టెమెంట్ లో అశోశియేట్ డైరక్టర్ గా పలువురు దర్శకుల దగ్గర పనిచేసిన అక్షర ఉన్నట్టుండి నటనవైపు ఆసక్తి చూపించటంతో కమల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ధనుష్ సరసన ఆమె హీరోయిన్ గా కనిపించనుంది. అలాగే ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ మరో కీలకపాత్రలో చేయనున్నారు. అమితాబ్ తో బల్కి గతంలో చీనీకామ్, పా చిత్రాలు రూపొందించారు. దాంతో ముంబయికి మకాం మార్చమని చెల్లెలికి సలహా ఇచ్చిందట శ్రుతి హాసన్‌. అక్షర కూడా ముంబయిలో ఫ్లాటు కోసం అన్వేషిస్తున్నట్లు సన్నిహితులు తెలిపారు. కమల్ కూతురు అనే ముద్రతో వెండి తెర మీదకొచ్చినా ఇప్పుడు తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సాధించింది శ్రుతి హాసన్‌. ప్రస్తుతం ఆమె తెలుగు, హిందీల్లో చేతి నిండా సినిమాలతో తీరిక లేకుండా ఉంది. ఇప్పుడు ఆమె బాటలోనే చెల్లెలు అక్షర హాసన్‌ కూడా నడవాలని భావిస్తున్నట్లు బాలీవుడ్‌ సమాచారం.
 తండ్రితో పాటు శృతిని స్ఫూర్తిగా తీసుకుని అక్షర హాసన్‌ కూడా తెరంగేట్రం చేయబోతోందని వినికిడి. ఇందుకోసం ఇప్పటికే పావులు కదుపుతోందని, అందుకు తండ్రి మద్ధతు కూడా ఆమెకు ఉందని అంటున్నారు. అక్షర హాసన్‌ మొదటిగా బాలీవుడ్‌లో పాగా వేయాలని కోరుకుంటోందని, ఓ హిందీ చిత్రంలో ఆమెను ఎంపికచేశారని చెప్పుకుంటున్నారు. అక్షర కూడా తన అక్క శృతి మాదిరిగానే సినీ పరిశ్రమలో ఏ శాఖ ఎంచుకోవాలన్న తర్జనభర్జనలో ఉందని అంటున్నారు. మొదట్లో శృతి కూడా గాయనిగా, సంగీత దర్శకురాలిగా రాణించాలని అనుకుని, ఆ తర్వాత నటనను వృత్తిగా ఎంచుకోవడం విశేషం. ఇక అక్షర కూడా హీరోయిన్‌గా, రచయిత్రిగా, దర్శకురాలిగా ఎందులో రాణిస్తే అందులో స్థిరపడాలని ఆకాంక్షిస్తోందట.