Friday, 4 October 2013

బొత్సపై భేరి


రణరంగంగా విజయనగరం బొత్స ఇంటి ముట్టడికి పలుమార్లు యత్నం

 ఉదయం నుంచి రాత్రి వరకు రాళ్ల వర్షం

 పట్టణం నుంచి పరారైన బొత్స బంధువులు, అనుచరులు

 బిక్కుబిక్కుమంటున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు

 లాఠీచార్జి, బాష్పవాయువు, రబ్బరు బుల్లెట్ల ప్రయోగం విజయనగరం, అక్టోబర్ 4 : విజయనగరం వరుసగా రెండో రోజూ రణరంగమైంది! శుక్రవారం తెల్లవారుజాము నుంచి రాత్రి పొద్దుపోయే వరకు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ నివాసం వద్ద బీభత్సకాండ కొనసాగింది! పోలీసులు లాఠీచార్జి చేసినా.. దొరికిన వారిని దొరికినట్లు చితకబాదినా.. బాష్పవాయు గోళాలను ప్రయోగించినా.. సమైక్యవాదులు చెక్కుచెదరకపోవడంతో పోలీసులు రబ్బరు బుల్లెట్లను ప్రయోగించాల్సి వచ్చింది! అయినా సమైక్యవాదులు వెనక్కి తగ్గలేదు. సత్తిబాబును, ఆయన భార్య, ఎంపీ ఝాన్సీని 'ద్రోహులు'గా అభివర్ణిస్తూ వారి ఆస్తులపై దాడులు చేశారు. రాష్ట్ర విభజనకు సంబంధించి సీడబ్ల్యూసీ ప్రకటన వెలువడిన జూలై 30వ తేదీ నుంచి నేటి వరకు బొత్స, ఆయన భార్య ఝాన్సీ జిల్లాలో అడుగు పెట్టలేదు. గత 65 రోజులుగా జిల్లాలో సమైక్య ఉద్యమం వారిద్దరి చుట్టూనే తిరిగింది. అయితే, రెండు నెలలుగా సమైక్య వాదులు శాంతియుతంగానే ఉద్యమిస్తున్నారు.

పలు దఫాలు ఆయన ఇంటి ముట్టడికి ప్రయత్నించినా.. ఆస్తుల జోలికి వెళ్లలేదు. కానీ, తెలంగాణ నోట్ ఆగమేఘాల మీద కేంద్ర కేబినెట్ ఆమోదం పొందడం వెనక బొత్స మంత్రాంగం ఉందని జిల్లా ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. బుధవారం ఢిల్లీ వెళ్లిన ఆయన.. రాత్రికి రాత్రి నోట్‌ను తయారు చేయించి కేబినెట్‌లో పెట్టేలా చేశారన్న ఆరోపణలను బలంగా విశ్వసిస్తున్నారు. దీంతో, శుక్రవారం బొత్స, ఆయన కుటుంబ సభ్యులనే ప్రధానంగా టార్గెట్ చేశారు. బొత్స, ఆయన కుటుంబ సభ్యులపై ఉద్యమ కారుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పట్టణంలోని బొత్సకు చెందిన సత్య కళాశాల, ఇతర ఆస్తులపై దాడి చేశారు. సత్య కళాశాలపై విద్యార్థులు రాళ్ల దాడులు చేశారు. కళాశాల అద్దాలు ధ్వంసమయ్యాయి. రాత్రి 8 గంటల సమయంలో మరోసారి కాలేజీపై రాళ్ల వాన కురిపించారు. పలుగులు, పారలతో వెళ్లి కూల్చి వేయడానికి ప్రయత్నించారు. పోలీసు బలగాలు ఉద్యమకారులను అక్కడి నుంచి చెదరగొట్టాయి. అంతకు ముందు ఉదయం బొత్స ఇంటి వెనుకకు చేరుకుని అటునుంచి రాళ్లు రువ్వడం ప్రారంభించారు. దీంతో భయానక వాతావరణం నెలకొంది. గరివిడిలో బొత్స క్యాంపు కార్యాలయంపైనా రాళ్లు రువ్వడంతో బయట, లోపలి అద్దాలు ధ్వంసమయ్యాయి. వీటికి కొనసాగింపుగా రాత్రి ఏడు గంటల సమయంలో బొత్సకు చెందిన సత్య విజన్ కేబుల్ నెట్‌వర్క్‌పై దాడి చేశారు. స్టూడియోకు నిప్పు పెట్టారు. స్టూడియో ముందు భాగాన్ని, లోపలి భాగాన్ని ధ్వంసం చేశారు. తర్వాత లోపలి యాంటెన్నాలు, కంప్యూటర్లు, కేబుల్ వైర్లు, ఇతర ఫర్నిచర్‌ను బయటకు విసిరేసి పెట్రోలు పోసి తగలబెట్టారు. దీంతో, స్టూడియో అగ్ని కీలల్లో పూర్తిగా తగులబడిపోయింది. మంటలు ఆర్పేందుకు వచ్చిన ఫైరింజన్ అధికారులపైనా సమైక్యవాదులు దాడి చేశారు. ఫైరింజన్‌ను తిప్పి పంపేశారు. మరికొంతమంది తోటపాలెంలోని సత్య జూనియర్ కళాశాలలోకి దూసుకుపోయి విధ్వంసం సృష్టించారు. లోపల ఉన్న ఫర్నిచర్‌ను, రికార్డులను, ఇతర విలువైన సామగ్రిని ధ్వంసం చేశారు. జనప్రియ బార్ అండ్ రెస్టారెంట్‌పై దాడి చేసి మద్యం సీసాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. బొత్స ఇంటి ముట్టడికి తీవ్రంగా ప్రయత్నించారు. బొత్స పేరున్న శిలా ఫలకాలను జేఎన్‌టీయూ విద్యార్థులు ధ్వంసం చేశారు. రాత్రి 9 గంటల సమయంలో డిగ్రీ కళాశాలను ధ్వంసం చేశారు. రాత్రి పొద్దు పోయే వరకు బొత్స ఇంటి వద్ద ఆందోళనకారులు మోహరించారు. ఆయన ఆస్తులన్నిటినీ ధ్వంసం చేస్తూనే ఉన్నారు. ఈ పరిణామాలతో జిల్లావ్యాప్తంగా బొత్స కుటుంబ సభ్యులతోపాటు ఆయన అనుచరులు, బంధువులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. కొంతమంది పట్టణాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. విజయనగరంతోపాటు జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భయం భయంగా కాలం గడుపుతున్నారు. బొత్స ఆస్తులపై దాడి సమయంలో ఆందోళనకారులు ముందస్తు ప్రణాళికతో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పోలీసులకు, నిఘా వర్గాలకు అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వేల సంఖ్యలో విద్యార్థులు, యువత, సమైక్యవాదులు బృందాలుగా విడిపోయారు.

No comments:

Post a Comment