పుత్తూరులో ఉగ్రవాదుల కోసం ఆక్టోపస్ రెస్క్యూ టీం సాగించిన వేట ముగిసింది.. ఈ ఆపరేషన్ లో ఇద్దరు ఉగ్రవాదులను ఆక్టోపస్ సిబ్బంది అదుపులోకి తీసుకుంది. వీరిద్దరినీ మున్నా, బిలాల్ గా గుర్తించారు.ఎం జరిగింది ? పుత్తూరులోని ఓ ఇంట్లో ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నారని తమిళనాడులో అరెస్టయిన ఓ ఉగ్రవాది అందించిన సమాచారంతో తమిళనాడు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఉగ్రవాదులు ఉన్న ఇంటిని గుర్తించిన పోలీసులు.. తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో ఇంటి వెనుక భాగం నుంచి దాడికి యత్నించారు. వారిని గుర్తించిన ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో, సిఐ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మరోవైపు పోలీసులు, ఉగ్రవాదుల మధ్య భీకరమైన కాల్పులు జరిగాయి. కాల్పులు కొనసాగిస్తే.. తాము ఉన్న ఇంటిని బాంబులతో పేల్చేస్తామని టెర్రరిస్టులు హెచ్చరించడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
క్షణ క్షణం..
ఉగ్రవాదులు తాము తలదాచుకున్న ఇంటిని సిలిండర్ తో పేల్చేస్తామని, ఇంకా నాలుగైదు ప్రాంతాల్లో బాబులు పెట్టామని చెప్పడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. సమాచారం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ డీజీపీ ప్రసాదరావు పరిస్థితిని సమీక్షించి, ఆక్టోపస్ టీంను రంగంలోకి దించారు. 'ఆక్టోపస్' ఆపరేషన్ రంగంలోకి దిగిన ఆక్టోపస్ టీం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. ఉగ్రవాదులున్న ఇంట్లోకి టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. అనంతరం.. ఇంటిలో ఉన్న ఒక మహిళతో పాటు ముగ్గురు పిల్లలలను సురక్షితంగా రక్షించి 108 ద్వారా ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిలో ముగ్గురు ఎస్పీలు పరిస్థితిని సమీక్షిస్తూ ఆపరేషన్ పక్కాగా కొనసాగించారు. ఓవైపు కాల్పులు కొనసాగిస్తూనే.. మరోవైపు ఇంటి వెనక నుంచి గోడకు రంధ్రాలు చేసి, ఉగ్రవాదులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. గాయపడ్డ ఉగ్రవాదులు లొంగిపోతున్నట్లు ప్రకటించడంతో.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు.
No comments:
Post a Comment