Monday, 7 October 2013

కరెంట్ షాక్ తో కళ్లు తేలేసిన కాంగ్రెస్



ఆందోళనలు సహజం, అవి ముందుగా ఊహించినవే, పట్టించుకోవాల్సిన పనిలేదు, విభజన విషయంలో ముందుకే పోతాం అని కుండబద్దలు కొట్టిన కాంగ్రెస్ హైకమాండ్ కు కరెంట్ షాక్ కాస్తా గట్టిగానే తాకిందంటున్నారు. ఏపిఎన్జీఓలు 60 రోజులుగా సమ్మెలో ఉండి సమైక్య ఉద్యమాన్ని ఉవ్వెత్తున చేపడితే కూడా చీమకుట్టినట్టు కూడా లేకుండా ఉన్న కాంగ్రెస్ హైకమాండ్ ఒక్క రోజు విద్యుత్ ప్లాంట్ ల ఉద్యోగుల సమ్మెతో కళ్లుతేలేసింది.

 పరిస్థితులను అర్థం చేసుకోండి సమ్మె విరమించండి అని ఏకంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ కోరారంటే కరెంట్ షాక్ గట్టిగా తాకినట్టే అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కారణం విజయవాడ విటిపిఎస్ తో పాటు రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యోగులతో పాటు సీమాంద్రలోని విద్యుత్ ఉత్పత్తి స్టేషన్లన్ని ఉత్పత్తిని నిలిపివేసాయి. ఇది ఒక ఏపి పైనే కాకుండా ఏకంగా నాలుగు రాష్ట్రాలపై పడింది. ఇది మరో 24 గంటలు ఇదే పరిస్థితి ఉంటే దక్షిణాది గ్రిడ్ పడిపోయే అవకాశం ఉంది.

అదే జరిగితే విద్యుత్ పునరుద్దరణ నాలుగు రాష్ట్రాల్లో జరగడం అసాధ్యం. మామూలు సమ్మెతో కాకుండా రైళ్లకు, ఆసుపత్రులకు, అత్యవసర సేవలకు కూడా విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తుండడంతో చాలా పెద్ద ఝలక్ తగిలింది. అసలే దసరా పండగవేళ రైళ్లు నిలిచిపోవడంతో భారీ ఆదాయానికి కూడా గండి పడింది. ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్సలు, ఆపరేషన్లకు కరెంట్ కోతతో నిలిచిపోయి ఎందరో అభాగ్యుల ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం కూడా ఏర్పడింది. అందుకే కాంగ్రెస్ హైకమాండ్ ఏదో ఒకటి చేస్తుందన్న వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి.

No comments:

Post a Comment