Saturday, 12 October 2013

అమ్మ కోసం ముంబైలో చివరి టెస్టు: సచిన్


న్యూఢిల్లీ: దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను ముంబైలోనే జరపాలని భారత క్రికెట్ నియంత్రణ మండలిని కోరిన విషయం తెలిసిందె. అయితే ఇందుకు ఓ ప్రత్యేకమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. క్రికెట్ జీవితానికి స్వస్తి పలుకబోయే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ తిలకించేందుకు తన తల్లి రజిని ముంబైలో మ్యాచ్ జరిగితే హాజరవుతుందనే ఆలోచనతోనే సచిన్ బిసిసిఐకి విజ్ఞప్తి చేశారు. సచిన్ టెండూల్కర్ కోరిక మేరకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో తన 200వ టెస్టును నిర్వహించేందుకు బిసిసిఐ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. చివరి మ్యాచ్‌కు తన తల్లి హాజరై వీక్షించడం తనకు గర్వంగా ఉంటుందని సచిన్ భావిస్తున్నట్లు తెలిసింది. కాగా సచిన్ టెండూల్కర్ తన 199వ టెస్ట్ మ్యాచ్‌ను కోల్‌కతా ఈడెన్ గార్డెన్ స్టేడియంలో, ఆ తర్వాత 200వ టెస్ట్ మ్యాచ్‌ను అతనికి ఇష్టమైన ముంబై వాంఖడే స్టేడియంలో నిర్వహించనున్నట్లు సమాచారం. సచిన్ టెండూల్కర్ క్రికెట్ జీవితాన్ని ప్రారంభించిన వాంఖడే స్టేడియంలోనే తన తల్లి సమక్షంలో తన క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలకనున్నారు. తనను ప్రోత్సహించిన పలువురు ప్రముఖులు, ముంబై ప్రజల మధ్య తన చివరి మ్యాచ్‌ను ఆడనుండడం తనకు సంతోషన్నిచ్చే అంశంగా సచిన్ భావిస్తున్నట్లు సమాచారం.

No comments:

Post a Comment