Saturday, 12 October 2013

'ముందస్తు'ను తీసుకొస్తున్న తెలంగాణ!


విభజనపై తీవ్ర రాజకీయ చిక్కుముడి పడింది

 రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఏపీ ఎంపీల రాజీనామా అప్పుడిక ఎన్నికలకు వెళ్లాల్సిందే ఎన్సీపీ నేత పవార్ సంచలన వ్యాఖ్యలు ముంబై, అక్టోబర్ 12: తెలంగాణ విభజన అంశం ముందస్తు ఎన్నికలను తెచ్చి పెట్టే అవకాశం కనిపిస్తున్నదని కేంద్ర మంత్రి, ఎన్సీపీ నేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్య చేశారు. ఈ సమస్యపై రానున్న రోజుల్లో పెద్దఎత్తున ఎంపీలు రాజీనామా చేయొచ్చునని కూడా వ్యాఖ్యానించారు. అలాగే, ఇక తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనబోనని పునరుద్ఘాటించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఓ అధికార కార్యక్రమంలో శనివారం శరద్ పవార్ పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులపై ఆయన మీడియాతో ముచ్చటించారు. "తెలంగాణ అంశం తీవ్రమైన రాజకీయ చిక్కుముడిగా మారుతున్నది. నాకు తెలిసిన మేరకు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చాలామంది పార్లమెంటు సభ్యులు తమ లోక్‌సభ సభ్యత్వాన్ని వదులుకునేందుకు సిద్ధమవుతున్నారు. అదే జరిగితే గడువు కన్నా ముందే లోక్‌సభకు ఎన్నికలు జరుగుతాయి'' అని ఆయన వివరించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా..కాంగ్రెస్ పార్టీతో కలిసే పోటీ చేస్తామని చెప్పారు.

అదే సమయంలో తాను ఈసారి లోక్‌సభకు పోటీ చేయడం లేదని తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రాజ్యసభలో అడుగుపెడతానని వివరించారు. కాగా, ఆర్డినెన్స్ విషయమై రేగిన వివాదం గురించి స్పందించేందుకు ఆయన నిరాకరించారు. అలాగే.. ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు ఎందుకు పోటీ పడుతున్నారని ప్రశ్నించగా, సూటిగా సమాధానం ఇవ్వలేదు. గెలుద్దామని పోటీ చేస్తున్నానని చెప్పి ముక్తాయించారు

No comments:

Post a Comment