"ఇండస్ట్రీని ఏడేళ్ల పాటు దగ్గరగా చూశా కాబట్టి ఏ పనిని ఎలా చేయకూడదో తెలుసుకున్నాను. కాబట్టే జాగ్రత్తతో, భయంతో సినిమాలు చేస్తున్నా. దాని వల్లే నాకు విజయాలు లభిస్తున్నాయి'' అని చెప్పారు దర్శకుడు మారుతి. స్వల్ప కాలంలో ఇటు దర్శకునిగా, అటు నిర్మాతగా వరుస విజయాలు సాధిస్తూ వస్తున్న ఆయన ప్రస్తుతం అల్లు శిరీశ్, రెజీనా కసాండ్రా నాయకా నాయికలుగా 'కొత్త జంట' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మంగళవారం పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆ సినిమా సెట్స్‌పై పత్రికలవారితో సంభాషించారు మారుతి. ఆ విశేషాలేమిటో ఆయన మాటల్లోనే...
ప్రతి ఒక్కరూ ఎలాంటి జీవితం, గుర్తింపు రావాలని కోరుకుంటారో అలాంటి జీవితం, పేరు నాకు చాలా స్వల్ప వ్యవధిలోనే వచ్చాయి. వాటిని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తాను. రెండేళ్ల క్రితం నాటి నా జీవితానికీ, ఇప్పటి నా జీవితానికీ పోలికే లేదు. అదివరకు బొమ్మలు వేసుకుంటూ, యానిమేటర్‌గా పనిచేసుకుంటూ ఉండే నేను ఇవాళ వంద మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగాను. ఇది నా శ్రమకు దక్కిన ఫలితమే కాక, దేవుడిచ్చిన కానుక అని కూడా అనుకుంటాను. అందువల్ల ఈ పుట్టినరోజుకు చాలా సంతోషంగా ఉన్నా.
భయంతో చేస్తున్నా
జీవితం అంటే క్లారిటీ ఉన్నవాణ్ణి. ఇక్కడ విజయాలు శాశ్వతం కాదని నాకు తెలుసు. ఏ మాత్రం బద్దకించినా పరాజయం వెన్నంటి ఉంటుంది. చాలామంది మహానుభావులకూ ఇది అనుభవమే. ఇప్పటివరకూ ప్రేక్షకులు మెచ్చే మంచి సినిమాలే తీస్తూ వచ్చాను.
నేను ఏ డైరెక్టర్ వద్దా పనిచేయక పోయినా నాకు నచ్చినట్లు పనిచేశాను. అది ప్రేక్షకులకు కనెక్టవుతూ వచ్చింది.
తపన ఉంటేనే తియ్యాలి
వారానికి ఎనిమిది, తొమ్మిది సినిమాలు రిలీజవుతున్నాయి. వాటిలో చాలావరకు నష్టపోతున్నాయి. డబ్బులు ఉన్నాయనో, ఆడుతున్న వేరే సినిమాలను చూసో సినిమాలు తియ్యకూడదు. సినిమాల మీద తపన ఉన్నప్పుడే, కమిట్‌మెంట్ ఉన్నప్పుడే తీయాలి. మన అభిరుచి కంటే ప్రేక్షకుల అభిరుచికి ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే విజయాలు లభిస్తాయి. ప్రేక్షకుల అభిరుచులు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. నేను నా మొదటి రెండు సినిమాల్ని.. 'ఈ రోజుల్లో', 'బస్‌స్టాప్'ను ఓ తరహాలో తీశాను. తర్వాత బాణీ మార్చి 'ప్రేమ కథా చిత్రమ్' చేశాను. ఇప్పుడు 'కొత్త జంట'ను ఇంకో తరహాలో తీస్తున్నా. ప్రతి సినిమాకీ ఏదో కొత్తదనం ఇవ్వాలని తపిస్తుంటా.
మారుతి ముద్ర
'మారుతి ముద్ర' అనే పేరు రావడం సంతోషకరమే కదా. 'ఈ రోజుల్లో'కు కొనసాగింపుగా 'బస్‌స్టాప్' తీశాను. నేటి యువత ఎలా ఉంటున్నారో వాటిలో చూపించాను. మేం నిర్మించిన 'రొమాన్స్' వాటికి కొనసాగింపుగా ఉండటంతో నా మీద వేరే రకమైన ముద్ర పడింది. అయితే ఇప్పుడు నేను చేస్తున్న 'కొత్త జంట' చాలా క్లీన్ ఫిల్మ్. ధూమపానం, మద్యపానానికి సంబంధించిన చిన్న సన్నివేశమే కాదు, కనీసం వాటికి సంబంధించిన ప్రకటనలు కూడా సినిమాలో కనిపించవు.
కానీ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. ఇద్దరు స్వార్థపరులు ప్రేమించుకుంటే ఎలా ఉంటుందనేది ఈ సినిమా. ఆగస్ట్ 2న షూటింగ్ ప్రారంభించాం. గీతా ఆర్ట్స్ కాబట్టి నిర్మాణ విలువల గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ ఎవరం మొనగాళ్లం కాదు. మనలో ప్లస్‌లతో పాటు మైనస్‌లూ ఉంటాయి. అల్లు శిరీశ్‌ని చాలా కాలంగా తెలిసినవాణ్ణి కాబట్టి అతని ప్లస్‌లూ, మైనస్‌లూ నాకు తెలుసు. అతని ప్లస్‌లను ఉపయోగించుకుంటూ ఈ సినిమా చేస్తున్నా.
తదుపరి చిత్రాలు
డి.వి.వి. దానయ్య, బన్నీ వాసు, బెల్లంకొండ సురేశ్, డి.వి.వి. దానయ్య, 'జులాయి' నిర్మాత రాధాకృష్ణ, దిల్ రాజు బేనర్‌లలో చేసేందుకు ఒప్పుకున్నా. అడ్వాన్సులు కూడా తీసుకున్నా. వీటితో పాటు మా గుడ్‌సినిమా గ్రూప్‌కీ ఓ సినిమా చేయాల్సి ఉంది. 'ప్రేమ కథా చిత్రమ్'ను బాలీవుడ్‌లో డైరెక్ట్ చేయమని అడుగుతున్నారు. జి. ఆదిశేషగిరిరావు, యుటీవీ బేనర్ సంయుక్తంగా ఆ సినిమా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. వీటి తో పాటు నా నిర్మాణ భాగస్వామ్యంలో 'లవ్ యు బంగా రం', 'గ్రీన్‌సిగ్నల్', 'లవర్స్' సినిమాలు రాబోతున్నాయి.