ఫెయిల్యూర్స్ అంటే ఎలా ఉంటాయో బాగా తెలిసినవాడు నితిన్. అందుకే సక్సెస్ వచ్చేసరికి ఆనందంతో పొంగిపోతున్నాడు. పెద్ద పెద్ద దర్శకులంతా తనతో సినిమాలు చేయడానికి ముందుకొస్తుంటే, ఉత్సాహంతో ఊగిపోతున్నాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తో హార్ట్ అటాక్ లో చేస్తున్న సంగతి తెలిసిందే కదా! ఈ సినిమా విషయంలో చాలా ఎగ్జయిటైపోతున్నాడు నితిన్.హార్ట్ అటాక్ చిత్రం శరవేగంగా షూటింగ్ చేసుకుంటోంది. ప్రస్తుతం స్పెయిన్లో సందడి చేస్తోంది. దీని హడావుడి ఎంతగా ఉందంటే... అక్కడి పత్రికలో ఈ సినిమా షూటింగ్ గురించి ప్రచురించారు. దాంతో తెగ మురిసిపోయాడు నితిన్. అతడు అంతకంటే ఎక్కువ ఆనందపడిపోతోన్న విషయం ఇంకోటుంది. అదేంటంటే... ఈ చిత్రానికి పూరి దర్శకత్వం వహించడం. అతడి వర్కింగ్ స్టయిల్ అద్భుతంగా ఉందట. ఆయన టేకింగ్ సూపర్బ్ గా ఉంటుందని తెలుసుగానీ, పని చేసే విధానం ఇంత ఫెంటాస్టిక్ గా ఉంటుందని ఇప్పుడే తెలిసిందంటూ గంతులు వేస్తున్నాడు.
నితిన్ ఇంత హడావుడి ఎందుకు చేస్తున్నాడో అర్థం కావడం లేదు. అతడికి పెద్ద డైరెక్టర్లతో పని చేయడం కొత్తేమీ కాదు. గతంలో వీవీ వినాయక్ అతడితో సూపర్ హిట్ ఇచ్చాడు. రాఘవేంద్రరావు, తేజ లాంటి డైరెక్టర్లతో కూడా పని చేశాడు. మరి ఎప్పుడూ గొప్ప డైరెక్టర్ ముఖమే చూడనట్టు, పెద్ద దర్శకుడితో పనిచేసే చాన్సే రాలేదన్నట్టు మురిసిపోవడమేంటో కామెడీ కాకపోతే. కానీ నితిన్ కి ఓ విషయం అర్థం కావడం లేదు. సినిమాని స్పీడుగా తీయడం, వైవిధ్యంగా పని చేయడమే కాదు, ఫ్లాపులను ఇవ్వడంలో కూడా పూరి స్పెషలే. ఆ విషయం మనసులో పెట్టుకుని, సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూసేవరకూ కాస్త కంట్రోల్ చేసుకో నితిన్ బాబూ!





