Monday, 6 January 2014
Sunday, 5 January 2014
ఉరేసుకొని హీరో ఉదయ్ కిరణ్ సూసైడ్, భార్యకు మెసేజ్!
హైదరాబాద్: ప్రముఖ తెలుగు హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన శ్రీనగర్ కాలనీలోని స్వగృహంలో ఆదివారం అర్ధరాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గ మధ్యలో మృతి చెందారు. ఆయన నటించిన తొలి సినిమా 'చిత్రం'. దీనిని ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పైన ప్రముఖ దర్శకులు తేజ తెరకెక్కించారు. 'నువ్వు నేను' సినిమాలో ఉత్తమ నటనకు గాను 2001లో ఫిలింఫేర్ అవార్డు పొందారు. నువ్వు నేను, మనసంతానువ్వే, శ్రీరామ్ చిత్రాలతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఉదయ్ కిరణ్ తమిళంలో కూడా నటించాడు. మొత్తం 19 సినిమాలలో నటించాడు. తెలుగులో 16, తమిళంలో 3 సినిమాల్లో నటించారు. 1980 జూన్ 26న జన్మించిన ఉదయ్ సికింద్రాబాదులోని వెస్లీ కళాశాలలో చదువుతున్న రోజుల్లో మోడలింగ్ వైపు వెళ్లారు. ఆ తర్వాత చిత్రం సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. హ్యాట్రిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఉదయ్ కిరణ్ 2012 అక్టోబర్ 24న విషితను పెళ్లి చేసుకున్నారు. చనిపోయే ముందు ఉదయ్ భార్యకు ఐ లవ్యూ అని మెసేజ్ పెట్టారట. ఉదయ్ కిరణ్ ఇంటికి క్లూస్ టీం చేరుకుంది. ఆయన సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చివరిసారిగా ఓ మిత్రుడితో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. భూపాల్ ద్వారా తమకు సమాచారం అందిందని హీరో శ్రీకాంత్ అన్నారు. తాము వెళ్లేసరికి మృతి చెందాడన్నారు. ఉదయ్ తండ్రి అందుబాటులో ఉన్నారని, మామ, భార్య ఆసుపత్రికి వచ్చారని చెప్పారు.
Tuesday, 17 December 2013
అంత సంపాదన లేదు, ఫోర్బ్స్ కథనంపై నాగ్ అసంతృప్తి
హైదరాబాద్: ప్రముఖ ఇంటర్నేషనల్ బిజినెస్ మేగజైన్ ఫోర్బ్స్ ఇండియాలోని టాప్ 100 సెలబ్రిటీల లిస్టు విడుదల చేసిన సంగతి తెలిసిందే. పాపులారిటీ పరంగా, సంపాదన పరంగా టాప్ 100 వ్యక్తులను సెలక్ట్ చేసింది ఫోర్బ్స్ మేగజైన్. అయితే ఈ జాబితాలో తన పేరు రావడంపై తెలుగు సినీ స్టార్ నాగార్జున అసంతృప్తి వ్యక్తం చేసారు. ఫోర్బ్స్ లిస్టులో నాగార్జున 61వ స్థానం దక్కించుకున్నారు. 2013 సంవత్సరంలో రూ. 20.5 కోట్లు సంపాదించినట్లు పేర్కొనబడి ఉంది. సంపాదన పరంగా ఆయన 34వ స్థానంలో, పాపులారిటీ పరంగా 75వ స్థానంలో ఉన్నట్లు ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది. అయితే తనకు అంత సంపాదన లేదని, ఊహా జనితంగానే ఆ లెక్కలు ప్రకటించారని అంటున్నారు నాగార్జున. ఈ మేరుకు ఫోర్బ్స్ ఎడిటర్‌కు ఈమెయిల్ పంపినట్లు ఆయన తెలిపారు. ఈ పత్రిక ప్రటించి ఇతర తెలుగు సెలబ్రిటీల వివరాల్లోకి వెళితే...పవన్ కళ్యాణ్ కు ఈ లిస్టులో 26వ స్థానం దక్కింది. అతని సంపాదన రూ. 57 కోట్లుగా పేర్కొన్నారు. సంపాదన పరంగా పవన్ కళ్యాణ్ 13వ స్థానంలో ఉన్నారని, పాపులారిటీ పరంగా 79వ స్థానంలో ఉన్నారని పేర్కొంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈ లిస్టులో 54వ స్థానం దక్కింది. ఆయన సంపాదన రూ. 28.96 కోట్లుగా పేర్కొన్నారు. సంపాదన పరంగా 24వ స్థానం, పాపులారిటీ పరంగా 84వ స్థానం దక్కించుకున్నాడు మహేష్ బాబు. ఇక రవితేజకు 68 స్థానం దక్కగా సంపాదన రూ. 13 కోట్లు ప్రకటించారు. సంపాదన పరంగా రవితేజ 54వ స్థానం, పాపులారిటీ పరంగా 73వ స్థానంలో ఉన్నారు. రామ్ చరణ్ 69వ స్థానం దక్కించుకోగా, సంపాదన 12.67 కోట్లు. సంపాదన పరంగా చరణ్ 55వ స్థానం, పాపులారిటీ పరంగా 72వ స్థానంలో ఉన్నట్లు తెలిపారు.
Wednesday, 11 December 2013
రాహుల్ గాంధీకి తృటిలో తప్పిన విమాన ప్రమాదం
న్యూఢిల్లీ: ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి విమాన ప్రమాదం తృటిలో తప్పింది. ఢిల్లీ విమానాశ్రయంలో రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చాయి. పైలట్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది.
రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానం ల్యాండ్ కావలసిన సమయానికే రన్ వేపై మరో విమానం ఉంది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. రాహుల్ గాంధీ రాయబరేలీ నుంచి ఢిల్లీ వస్తుండగా ఈ ఘటన జరిగింది.Sunday, 8 December 2013
రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు మనోజ్‌కు గాయాలు
ఔటర్‌రింగ్‌రోడ్డుపై అప్పా వద్ద ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న సినీ నటుడు మోహన్‌బాబు కుమారుడు మనోజ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అతన్ని వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. జూబ్లీహిల్స్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వెళ్తుండగా గేదె అడ్డుతగిలి కారు బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ఉన్న బెలూన్స్ తెరుచుకోవడంతో అందులోని మనోజ్‌తో పాటు డ్రైవర్, బాడీగార్డు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ముగ్గురికి స్వల్ప గాయాలయ్యా యి. వివరాల్లోకి వెళితే...మనోజ్ రాజేంద్రనగర్‌లో జరుగుతున్న ఓ పెళ్లికి హాజరుకావడానికి స్నేహితుడు రంజిత్, డ్రైవర్ నరేష్, బాడీగార్డు రాజుతో కలిసి రాత్రి 8 గంటలకు తన ఇంటి నుంచి ఫార్చూనర్ కారు (ఏపీ 03ఏవై 0019)లో ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా బయలు దేరారు.అప్పా జంక్షన్ దాటిన తరువాత వీరి కారు ప్రమాదానికి గురైంది. బోల్తాపడ్డ కారు 200 మీటర్ల దూరం వరకు రోడ్డును రాసుకుంటూ పోయింది. గాయపడిన మనోజ్, నరేష్, రాజులను ఓ కారులో బంజారాహిల్స్‌లోని ఆపోలో ఆస్పత్రికి తరలించా రు. రోడ్డుపై మృతి చెంది పడి ఉన్న గేదెను కారు ఢీకొనడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. గాయపడ్డ మనోజ్‌కు అపోలో ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందించారు. ఆయన కుడి చెయ్యి, కుడి కన్ను వద్ద స్వల్ప గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు మోహన్‌బాబు, నిర్మల, సోదరుడు మంచు విష్ణు దంపతులు ఆస్పత్రికి వచ్చారు. అప్పటికే ఆస్పత్రికి భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. చికిత్స అనంతరం రాత్రి మనోజ్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఇక మంచు మనోజ్ ...తన ఫ్యామిలీ మల్టీ స్టారర్ మూవీ ‘పాండవులు పాండవలు తుమ్మెద' చిత్రంలో చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మొహన్ బాబు ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలయిన సంగతి తెలిసిందే. తాజాగా మంచు మనోజ్ ఈచిత్రంలోని తన ఫస్ట్ లుక్ ఫోటోను ట్విట్టర్ ద్వారా విడుదల చేసారు. మనోజ్ గెటప్‌ను బట్టి ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో మనోజ్ మీసాలు లేకుండా కనిపిస్తున్నాడు. తన ఈ లుక్‌లో మీసం లేదని, ఇతర సన్నివేశాల్లో మీసం ఉంటుందని మనోజ్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. తన లుక్ చూసి సీరియస్ రోల్ అనుకోవద్దని, ఫుల్ టైం కామెడీ రోల్ చేస్తున్నట్లు మనోజ్ తన పాత్ర గురించి చెప్పుకొచ్చారు.
Saturday, 7 December 2013
కొత్త రాజధాని రేస్ లో ఉన్నవి ఈ నగరాలే
సీమాంధ్ర రాజధానిపై నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. కాకినాడలో ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి పల్లంరాజు కోరారని ఆయన చెప్పారు. సీమాంధ్ర రాజధానికి విశాఖపట్నం, విజయవాడ, అమరావతి, కర్నూలు ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌పై పూర్తి అవగాహన ఉన్నవారే జివోఎంలో ఉన్నారని ఆయన చెప్పారు. జివోఎం 53రోజులు పనిచేసిందని, రాష్ట్రానికి చెందిన అందరినీ సంప్రదించామని ఆయన చెప్పారు. తెలంగాణకు చెందిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి శ్రీధర్ బాబు, సీమాంధ్రకు చెందిన ముఖ్మమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి వట్టి వసంతకుమార్లతో తాము మాట్లాడినట్లు ఆయన తెలిపారు. రాజకీయ పార్టీలు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఇరు ప్రాంతాలకు ప్రయోజనం కలిగే విధంగా జివోఎం నిర్ణయాలు తీసుకుందని ఆయన చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర విభజనకు సహకరించాలని ఆయన కోరారు. సింగరేణి తెలంగాణకే చెందుతుందని ఆయన చెప్పారు. ఐదు రోజులపాటు భద్రాచలంపై చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇంతకు ముందు తెలుసునని, ఇప్పుడు ఆయనెవరో తనకు తెలియదని జైరాం రమేష్ అన్నారు. విశాఖపట్నం - చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. సీమాంధ్రలో సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణాలకు సహకరిస్తామని ఆయన చెప్పారు.సినిమా రివ్యూ: ఆడు మగాడ్రా బుజ్జీ
ఎస్సెమ్మెస్, ‘ప్రేమ కథా చిత్రం’తో గుర్తింపు తెచ్చుకున్న సుధీర్‌బాబు ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ అనే ఓ క్రేజీ, ఫ్యాన్సీ టైటిల్‌తో మరోసారి డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ద్వారా కృష్టారెడ్డి గంగదాసు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. టైటిల్‌తో విడుదలకు ముందే ప్రేక్షకుల్లో అంచనాలను పెంచిన ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ ఏలాంటి టాక్‌ను సంపాదించుకుందో తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళ్తాం.
సిద్ధు అల్లరి చిల్లరిగా తిరిగే ఓ తుంటరి యువకుడు. చిన్నతనం నుంచి అందర్ని కష్టాల్లో ఇరికించడం సిద్దూకి అలవాటు. సిద్దూ వ్యవహారం ఎలా ఉంటుందంటే.. సొంత తండ్రి ప్రసాద్ (నరేశ్) కూడా వీడు నా కొడుకు అని చెప్పుకోవడానికి కూడా భయపడేంత రేంజ్లో ఉంటుంది. సిద్దూ నుంచి ఎదురయ్యే కష్టాల్ని భరించలేక హాస్టల్ ఉంచి చదివిస్తుంటాడు. చాలా జాలీగా కాలం గడుపుతున్న సిద్దూ, ఇందూ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇందూకి చెర్రి (రణధీర్) అనే ఓ అన్నయ్య ఉంటాడు. ఇందూ వైపు ఎవడైనా చూస్తే తాట తీయడం చెర్రీ పని. అయితే ఒకానొక కారణంగా శంకరన్న అనే రౌడీ పొలిటీషియన్‌ను సిద్దు విపరీతంగా కొడుతాడు. అయితే శంకరన్నకు ఎవరు కొట్టారనే విషయం తెలియదు. తనను కొట్టిన వ్యక్తిపై పగను పెంచుకొని అతని అంతు చూడటానికి వెతుకుతుంటాడు. కథ ఇలా సాగుతుంటే తన ప్రేమ కోసం సిద్దూ అదే కాలేజిలో చదువుతున్న శంకరన్న మరదలు అంజలీతో చెర్రీ ప్రేమలో పడేలా నాటకం ఆడుతాడు. అంజలీ ప్రేమ విషయం తెలుసుకున్న శంకరన్న చెర్రీపై దాడి చేస్తాడు. చెర్రీ, అంజలీలు విడిపోవడానికి సిద్దూనే కారణమని తెలుసుకున్న ఇందూ అతనికి దూరంగా ఉంటుంది. అయితే శంకరన్నను ఎదురించి విడిపోయిన చెర్రీ, అంజలీలను ఎలా కలిపాడు. వారి ప్రేమను పెళ్లిదాకా ఎలా తీసుకువచ్చాడు. అలాగే ఇందూను ప్రేమను సిద్దూ ఎలా గెలుచుకున్నాడు అనేది ఈ చిత్ర కథ.
లవ్, యాక్షన్, కామెడీ అంశాలకు తన ఎనర్జీతో సుధీర్ ఆకట్టుకున్నాడు. టైమింగ్, మెచ్యురిటీతో సిద్దూ పాత్రకు న్యాయం చేకూర్చాడు. గత రెండు చిత్రాల్లోని ఫెర్ఫార్మెన్స్‌కు ధీటుగా తనదైన శైలిలో సుధీర్ బాబు మరోసారి నటుడిగా తనకు తాను ప్రూవ్ చేసుకున్నాడు. పాటల్లో సిక్స్‌ప్యాక్ బాడీతో సుధీర్ అదరగొట్టాడు.కథలను జాగ్రత్తగా ఎంచుకుని తన సినిమాలను ప్లాన్ చేసుకుంటే.. త్వరలోనే స్టార్‌గా ఎదగేందుకు అన్ని అంశాలు సుధీర్‌లో ఉన్నాయని చెప్పవచ్చు. ఇందూ పాత్రలో అస్మితా సూద్ మంచి పాత్రే లభించింది. గ్లామర్‌తో ఆకట్టుకున్న కీలక సన్నివేశాల్లో ఎమోషన్స్ పలికించడంలో కొంత తడబాటుకు గురైంది. అయినా అస్మితా పర్వాలేదనింపించింది. అంజలీ పాత్రలో పూనమ్ కౌర్‌కు అంతగా ప్రాధాన్యత ఉన్న పాత్రేమి కాదు. ప్రధాన విలన్‌గా అజయ్ తనదైన మార్కును ప్రదర్శించాడు. కొన్ని సీన్లలో అజయ్ మంచి పరిణతిని ప్రదర్శించాడు. శంకరన్న లాంటి పాత్రలను అజయ్ ఇప్పటికే ఎన్నో చేశాడు. అజయ్ కేరిర్‌కు అంతగా పేరు తీసుకురాకపోయినా.. విలన్ రేసులో తాను ఉన్నానని చెప్పుకోవడానికి పనికివచ్చే రేంజ్ మాత్రమే. సుమన్, నరేశ్‌లు అతిధి నటుల పాత్రకే పరిమితమయ్యారు. ఇక ఈ సినిమాలో కుక్క పాత్ర హైలెట్ అని చెప్పవచ్చు. కృష్ణభగవాన్ కామెడీ కొంత ప్లస్ అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో గొప్పగా చెప్పుకావాల్సిందేమైనా ఉందంటే అది డైలాగ్స్.
ఈ సినిమాలో డైలాగ్స్ ప్రధాన ఆకర్షణ. ’సంతానం కోసం సముద్ర స్నానం చేస్తే ఉప్పు నీళ్లతో ఉన్నది పొయింది’ లాంటి డైలాగ్‌తోపాటు, మరికొన్ని సన్నివేశాల్లో డైలాగ్స్ బాగా పేలాయి. ఫోటోగ్రఫి కూడా అదనపు ఎస్సెట్. ఈ చిత్రంలో శ్రీ సంగీతం అంతగా ఆక ట్టుకోలేకపోవడం, పాటలు క్యాచీగా లేకపోవడం మైనస్. ఆడు మగాడ్రా బుజ్జీ అనే ఎనర్జీ ఉన్న టైటిల్‌తో దర్శకుడిగా పరిచయమైన కృష్ణారెడ్డి తొలి భాగంగా ఓకే అనిపించాడు. మంచి ఎంటర్టైన్మెంట్తో తొలి భాగంపై గ్రిప్‌ను సాధించినట్టు కనిపించినా.. అదే ఊపును ద్వితీయార్ధంలో కొనసాగించలేకపోయాడు. కుక్క ఎపిసోడ్, కృష్ణ భగవాన్ సీన్లు బాగా పండించాడు. తొలి భాగంలో ప్రేక్షకుల్ని కన్విన్స్ చేయడంతోపాటు.. రెండవ భాగంపై ఆసక్తిని రేకేత్తించాడు. అయితే రెండవ భాగంపై ఆశలు పెంచుకున్న ప్రేక్షకులకు నిరాశను పంచాడు. తొలి చిత్రం ద్వారా రొటీన్ కథను ఎంచుకోవడం కృష్ణారెడ్డి కొంత సాహసామేనప్పటికి.. ఆడు మగాడ్రా బుజ్జీ టైటిల్లో ఉండే ఫోర్స్‌ను పూర్తి స్థాయిలో చూపించడంలో విఫలమయ్యాడనే చెప్పవచ్చు.
Thursday, 5 December 2013
విభజనకు నిరసనగా రేపు రాష్ట్ర బంద్: వైఎస్ జగన్
10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలుపడాన్ని నిరసిస్తూ రాష్ట్ర బంద్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. స్వచ్చందంగా బంద్ లో ప్రజలు, వ్యాపార , విద్యా సంస్థలు పాల్గొనాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.
తెలుగు ప్రజల అభిప్రాయాన్ని కేంద్రం పట్టించుకోలేదు అని వైఎస్ జగన్ ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో 75 శాతం మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నా కేంద్రం పట్టించుకోలేదని ప్రకటనలో తెలిపారు. బంద్ కు సమాజంలోని ప్రతి పౌరుడు మద్దతివ్వాలని వైఎస్ జగన్ విజ్క్షప్తి చేశారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయం వినాశనం దిశగా మరో అడుగు అని వైఎస్ జగన్ అన్నారు.
Subscribe to:
Posts (Atom)