Thursday, 5 December 2013

10 జిల్లాల తెలంగాణనే ఫైనల్..?


న్యూఢిల్లీ : రాయల తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది. రాయల తెలంగాణ ప్రతిపాదనను ఉపసంహరించుకుని 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం మొగ్గు చూపుతున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అనంతపురం, కర్నూలు జిల్లాలతో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఇరు ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకరావడంతో కేంద్ర వెనక్కితగ్గినట్టు తెలుస్తోంది. బలవంతంగా ఏర్పాటు చేస్తే ఇరు ప్రాంతాల్లోనూ దెబ్బతింటామనే ఆలోచనలో పడినట్టు సమాచారం. అంతేగాక, రాయల తెలంగాణకు మద్దతు ఇవ్వబోమని బీజేపీ ప్రకటించడంతో కాంగ్రెస్ పునరాలోచనలో పడింది. బీజేపీ నాయకుడు వెంకయ్యనాయుడుతో కేంద్ర మంత్రి జైరాం రమేష్ కలిసి ఈ విషయంపై చర్చించారు. రాయల తెలంగాణకు వెంకయ్య నాయుడు ససేమిరా అన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో 10 జిల్లాలతో కూడిన తెలంగాణ బిల్లు కేంద్ర కేబినెట్ ముందుకు రావచ్చని భావిస్తున్నారు. సాయంత్రం ఐదుగంటలకు కేంద్ర కేబినెట్ కీలక సమావేశం జరగబోతోంది.

తెలంగాణయా? రాయల తెలంగాణయా అనేది కేంద్రకేబినెట్‌ భేటీ తర్వాత అధికారికంగా తేలిపోనున్నది. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేస్తామంటూ సీడబ్లూసీ, కేబినెట్ తీర్మానం చేసిన నేపథ్యంలో అందుకు అనుగుణంగానే కేంద్రం వ్యవహరిస్తుందా లేక రాయల తెలంగాణకు ఆమోదం తెలుపుతుందా అనేదానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. విభజనపై చర్చల పర్వాన్ని పూర్తి చేసిన తర్వాత కూడా చర్చోప చర్చలు చేస్తున్న మంత్రుల బృందం తన నివేదికను ఇవాళ కేబినెట్‌కు సమర్పించనుంది.

 జీఓఎం సిఫారసులపై కేబినెట్‌లో వాడీవేడి చర్చ జరగనున్నది. సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో భేటీ అయిన ఆ ప్రాంత కేంద్రమంత్రులు, ఎంపీలు భవిష్యత్‌ కార్యాచరణపై చర్చలు చేసినట్టు సమాచారం. రాయల తెలంగాణ అంశాన్ని ఆ ప్రాంత నేతలు తేల్చుకుంటారు..దాంతో మాకు సంబంధం లేదనే వాదనను కావూరి, పళ్లంరాజు చేస్తున్నారు. రాయలసీమను విభజించకూడదని...ఇవ్వాల్సి వస్తే రాయలసీమ రాష్ట్రం ఇవ్వాలనేది మంత్రి కిషోర్‌చంద్రదేవ్‌ వాదన. మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి రాయల తెలంగాణకు మద్దతు పలుకుతున్నారు...మంత్రుల బృందంలోను తెలంగాణా? రాయల తెలంగాణా? అనేదానిపై అభిప్రాయ భేదాలున్నాయి.

Sunday, 1 December 2013

హాలీవుడ్ నటుడు పాల్ వాకర్ మృతి


లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ నటుడు పాల్ వాకర్ శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పడంతో కాలిఫ్లోర్నియాలోని శాంతా క్లారిటాలోఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఫిలీప్పిన్స్ తుపాను బాధితుల సహాయార్థం నిధుల సేకరణకు శాంతా క్లారిటాలో ఓ కారు ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే క్రమంలో అతని స్నేహితునితో కలిసి పోర్చ్ జీటీ కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని వాకర్ ప్రతినిధి మీడియాకు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం వాకర్ కారు వేగంగా వెళ్లడంతో అదుపుతప్పి ఒక చెట్టుని కొన్నదన్నారు. ఆ తరువాత కారు లో చెలరేగిన మంటల్లో పాకర్ తో పాటు, అతని స్నేహితుడు కూడా మృతి చెందారన్నారు. అకస్మికంగా చోటు చేసుకున్న ఈ పరిణామణానికి హాలీవుడ్ దిగ్ర్భాంతికి గురైయ్యింది. 'వార్సిటీ బ్లూస్','ద ఫాస్ట్ అండ్ ఫూరియాస్' చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వాకర్ అశేష అభిమానులను సొంతం చేసుకున్నాడు. గత పద్నాలుగు సంవత్సరాల నుంచి తమ స్టూడియో ప్రతినిధులతో పాకర్ ఎంతో నమ్మకశక్యంగా ఉండే వాడని యూనివర్శల్ స్టూడియో పేర్కొంది. ఇతడు నటించిన ‘ హవర్స్’ సినిమా ఈ డిసెంబర్ నెల లో విడుదల కానుంది.

Saturday, 30 November 2013

జూనియర్ ప్రిన్సు బిరుదు ఫై మోజు పడుతూ తెరంగేట్రం చేయబోతున్నహీరో!!


ఇది వరకు సినిమా హీరోల సినిమాలు సూపర్ హిట్ అయిన తరువాత వారి అబిమానులు వారిని సూపర్‌స్టార్‌, యాక్టివ్‌స్టార్, మెగాస్టార్‌ స్టైలిష్ స్టార్, ఎనర్జిటిక్‌స్టార్, గ్లామర్‌స్టార్ ఇలా రకరకాల పేర్లతో పిలుచుకునేవారు. దీనికోసం గతంలో అయితే సినిమా పత్రికల వాళ్ళచేత ఈ బిరుదులు రాయించేసి ఫ్యాన్స్‌చేత అలా పిలిపించేవారు. ఇప్పటి ట్రెండ్‌ మారడంతో టీవీ ఛానల్స్‌ రావడంతో ఆహీరోల పేర్ల ముందు స్క్రోలింగ్‌ రూపంలో ఏదో ఒక బిరుదు తగిలించేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే బిరుదులు వారికి వచ్చే దాక వారు ఇండస్ట్రీ లో నిలబడగలరో లేదో అన్న భయంతో వారికి వారే బిరుదులు వారి అభిమానుల చేత పిలిపించు కుంటున్నారు.

ఇప్పుడు అక్కినేని కుటుంబంలో మరో స్టార్‌ రాబోతున్నాడు అతడే అక్కినేని అఖిల్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సిసింద్రీ ‘మనం’ సినిమాలో ఉన్నాడని కొందరు లేరని మరి కొందరు ఎవరికీ తోచినట్లు వారు ఉహించు కుంటున్నారు. అయితే అఖిల్ ను మాత్రం అన్నపూర్ణ స్టూడియోస్ లో పనిచేసే ఉద్యోగులు అంతా జూనియర్ ప్రిన్స్ అని పిలుస్తూ ఉంటారట. ఈపిలుపు వినగానే నాగార్జున, అదేవిధంగా అఖిల్ తెగ ఆనంద పడుతూ ఉంటారని టాక్. ఇప్పటికే టాలీవుడ్ ప్రిన్స్ అంటే మహేష్ బాబు అన్న భావన అందరికి అలవాటు పడిపోయింది ఇక రాబోతున్న రోజులలో జూనియర్ ప్రిన్స్ అంటే అఖిల్ అని అనుకోవాలి.

పబ్ లో చిందులేస్తున్న ప్రణిత !


కన్నడ మందారం ప్రణిత ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ కళ్యాన్ తో పాటు తన చెల్లి సమంతాతో కలిసి హంసనందిని, ముంతాజ్ తో కలిసి చిందులేసి ఎంత హడావిడి చేసిందో ఆ సినిమా చూసిన వారందరికీ జ్ఞాపకమే. ఈ బెంగుళూరు ముద్దుగుమ్మ ప్రణీత మరోసారి పబ్ లో హడావిడి చేస్తోంది. అయితే ఈసారి పవన్ కాకుండా హీరో ఉపేంద్రను ఎంచుకుంది. ప్రస్తుతం కన్నడ తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా ‘బ్రహ్మ’ గా విడుదల కాబోతోంది. ఉపేంద్రకు టాలీవుడ్ లో ఉన్న మార్కెట్ రీత్యా ఈ సినిమాను ‘ఉపేంద్రుడు’ గా తెలుగులో తీసుకువస్తారట. ఆర్.చంద్రు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కూడా ఉపేంద్ర, ప్రణీతల పై ఓపబ్ సాంగ్ ను ఈమధ్య ఒక ప్రముఖ పబ్ లో చిత్రీకరించారు. ఈ పాట ఈ సినిమాకి ఓ హైలెట్ గా నిలుస్తుందని చిత్రయూనిట్ పేర్కొంటోంది. రెండు భాషల్లోనూ ప్రణీతనే హీరోయిన్ గా ఎంచుకున్నారు. ఈసినిమాను సంక్రాంతి తరువాత టాలీవుడ్ లో విడుదల చేస్తారట. ఒకప్పుడు తెలుగులో కూడా ఉపేంద్రకు మంచి ఇమేజ్ ఉండేది. కానీ అది రానురాను తగ్గిపోవడంతో ఉపేంద్ర సినిమాలు టాలీవుడ్ లో ఎప్పుడు వచ్చి వెళ్లిపోతయో కూడా అర్ధం కావడంలేదు. ఈ పరిస్థుతులలో తెలుగులో ప్రస్తుతం ప్రణితకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఉపేంద్ర మార్కెట్ డల్ గా ఉన్నా ప్రణిత ఇమేజ్ ని కేష్ చేసుకోవడానికి నిర్మాతలు చేస్తున్న ప్రయత్నం ఉపేంద్ర కు ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.

రాయల పోయింది... రాజధానిగా మారింది


అందితే కాళ్లు లేకుంటే చేతులు అన్న సామెత ఇప్పుడు సీమాంద్ర నేతలను చూస్తే నిజమే అనిపిస్తోంది. నిన్నటి దాకా రాయలసీమ పరిరక్షణ సమితి ఏర్పాటు చేసి ట్రాక్టర్ యాత్ర చేసిన సీమ నేత బైరెడ్డి ఇక అది కాదని తెలుసుకున్నాడు. దీంతో ఏం చేయలేక ఢిల్లీ వెల్లి జంతర్ మంతర్ వద్ద దీక్షచేపట్టాడు, అందరు ప్రత్యేక రాయలసీమకోసం చేస్తున్నాడు అనుకున్నారు, కాని అది సీమకోసం కాదు, కొత్తగా ఏర్పడే రాష్ట్రంలో రాజధాని సీమలోనే ఉండాలి అంటూ కొత్త పల్లవి అందుకున్నారు బైరెడ్డి. ఇక సీమాంద్ర కేంద్రమంత్రుల తీరు చూడనే చూసాం, సమైక్యం అన్నారు, కాదని తేలాకా సమన్యాయం అన్నారు, ఇప్పుడు హైదరాబాద్ యూటి అంటున్నారు. ఇలా ఒకటి అందకుంటే మరోటి పట్టుకుంటున్నారన్నది అర్థమవుతోంది.

రాష్ట్రం ఇంకా ఏర్పడనే లేదు ఇప్పుడు రాజధాని అంటూ కొట్టుకోవడం మొదలుపెట్టారు. సీమాంద్ర నేతలు సమైక్యఉద్యమం చేసేటప్పుడు కూడా ఐక్యంగా ఉండకుండా విడిపోయే ఒకరినొకరు తిట్టుకుంటూ చేసారు, అది సక్సెస్ కాకుండా రాష్ట్రం విడిపోయే దాకా వచ్చింది. ఇప్పుడు సీమనేతలు రాజధాని కర్నూల్ అంటే కోస్తాంద్ర నేతలు విశాఖపట్టణం అని, ఆంద్రానేతలు విజయవాడ అని వాదన మొదలు పెట్టారు. దీంతో విడిపోక ముందే విబేదాలు సీమాంద్ర వాదుల్లో మొదలయ్యాయి. ఇప్పటికి కూడా వారిలో ఐక్యత లేకపోతే వారు సాధించుకోవాల్సిన వన్నీ ఇలాగే గాలికి పోతాయన్న వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది.

రామ్ చరణ్ పేరుతో నకిలీ దరఖాస్తు


దేశంలో ఓటరు గుర్తుంపు కార్డుల జారీ వ్యవస్థ ఎంత అద్వాన్నంగా తయారైందో గతంలో అనేక సంఘటనలు రుజువు చేసాయి. అప్పటి నుంచి చాలా అప్రమత్తంగా ఉంటున్న అధికారులు ఇటీవల తెలుగు సినీ స్టార్ రామ్ చరణ్ పేరుతో వచ్చిన నకిలీ ఓటరు గుర్తుంపు కార్డు దరఖాస్తును పసిగట్టారు. ఆన్ లైన్ దరఖాస్తుల విభాగంలో కొందరు ఆకతాయిలు ఈ చర్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ధర్మవరం నియోజకవర్గంలో ఈ ఘటన వెలుగు చూసింది. రామ్ చరణ్ తేజను ధర్మవరం ఓటురుగా నమోదు చేయాలంటూ 27939854 ఐడీ నెంబర్‌తో దరఖాస్తు అందింది. ఇందులో అతని ఇంటిపేరు ‘బండి', తండ్రి పేరు ‘చిరు', వయసు 53 ఏళ్లు, ధర్మవరం పట్టణంలోని రామ్ నగర్ ఏరియాలో 8-6-1969 నెంబరుగల ఇంట్లో ఉంటున్నట్లు పేర్కొన్నారు. మగధీర చిత్రంలోని రామ్ చరణ్ ఫోటోను జతచేసి ఆన్ లైన్లో దరఖాస్తు చేసారు ఫోటో చూడగానే ఇది నకిలీ దరఖాస్తు అని పసిగట్టిన అధికారులు...ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియను అపహాస్యం చేసేలా ప్రవర్తించిన ఆకతాయిలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

పట్టపగలు మద్యం మత్తులో హీరోయిన్, స్నేహితుల వీరంగం


బెంగుళూరుకు చెందిన ఫ్యాషన్ డిజైనర్ రమేష్ దిమ్లా, కన్నడ నటి మాధురి, మరికొందరు స్నేహితులు రోడ్డుపై మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. పట్టపగలు జరిగిన ఈ సంఘటనతో స్థానికులు విస్తుపోయారు. బెంగుళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు రమేష్ దిమ్లా, మాధురితో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. బెంగుళూరు నార్త్ జోన్ డీసీపీ సందీప్ పాటిల్ సంఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. శుక్రవారం ఉదయం మల్లేశ్వరం ప్రాంతంలో 17వ క్రాస్ వద్దకు లగ్జరీకారు నెం. KA 05 NK 7275లో చేరుకున్న వీరు నడిరోడ్డుపై నిల్చుని బీర్లు తాగారు. నటి మాధురితో పాటు యువతులు అసభ్యంగా అర్థనగ్న దుస్తువులు వేసుకుని కనిపించారు. రోడ్డుపై వీరు మద్యం తాగుతూ, అర్ధనగ్న దుస్తువులతో అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేసారు. దీంతో రమేష్ దిమ్లా స్థానికులతో వాగ్వాదానికి దిగారు.

 ఈ గొడవ పెద్దది కావడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ తతంగాన్ని కొందరు సెల్ ఫోన్లలో చిత్రీకరించి టీవీ ఛానల్స్‌కు అందించారు. దీంతో ఈ సంఘట బెంగుళూరులో సెన్సేషన్ అయింది. దీంతో డీసీపీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంఘటన గురించి వివరించారు. కొందరు మద్యం సేవించినట్లు వైద్య పరీక్షల్లో తేలినట్లు తెలిపారు. వారిని వదిలి పెట్టాలని తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, విచారన అనంతరం కేసు నమోదు చేస్తామని ఆయన తెలిపారు.

Thursday, 28 November 2013

రైళ్లకు బాంబులతో సిగ్నళ్లు


తుపాను ప్రభావంతో ఒక్కసారిగా పెరిగిపోయిన పొగమంచు సిగ్నళ్లు కనిపించక డ్రైవర్ల ఆందోళన డిటోనేటర్ సిగ్నలింగ్‌కు అనుమతించిన అధికారులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని వణికిస్తున్న తుపానులు రైళ్లకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టాయి. ఎర్ర లైటో.. పచ్చలైటో చూసుకుని ముందుకెళ్లే పరిస్థితి లేక.. ఏకంగా డిటోనేటర్లు పేల్చాల్సిన పరిస్థితి. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైలు మార్గాల్లో ట్రాక్‌మెన్‌లు ‘డిటొనేటర్లు’ పట్టుకుని తిరుగుతున్నారు. అంతేకాదు.. కచ్చితంగా అన్ని రైల్వేస్టేషన్ల పరిధిలో డిటోనేటర్లు నిల్వ చేసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలూ వచ్చాయి. తుపానులు, అల్పపీడనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పొగ మంచు తీవ్రత పెరగటమే దీనంతటికీ కారణం. తెల్లవారుజామున, ఉదయం, సాయంత్రాల్లో పొగ మంచు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు రైలు డ్రైవర్లకు సిగ్నళ్లు కనిపించవు. ఇది ఒక్కోసారి ఘోర ప్రమాదాలకు కారణమవుతుంది. అలాంటి సందర్భాల్లో సిగ్నళ్లపై లోకోపైలట్లను అప్రమత్తం చేసేందుకు రైల్వే సిబ్బంది డిటోనేటర్లను పేల్చుతారు. దాంతో లోకో పైలట్లు అప్రమత్తమై రైలు వేగాన్ని బాగా తగ్గించి, సిగ్నల్‌ను నిశితంగా పరిశీలించి ముందుకు సాగుతారు. సాధారణంగా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితికి అవకాశం తక్కువ. చలి తీవ్రత బాగా పెరిగిన ప్పుడు ఏజెన్సీల్లాంటి ప్రాంతాల్లో పొగమంచు కనిపిస్తుంది. కానీ, ప్రస్తుతం వరుసగా తుఫానులు, అల్పపీడనాల ప్రభావంతో పొగమంచు బాగా పెరిగింది. లోకో పైలట్లు ఈ విషయాన్ని రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో.. ఆగమేఘాలమీద డిటొనేటర్లను సమకూర్చే పనిలో పడ్డారు.

 డిటొనేటర్లు ఎందుకు?: పొగమంచు దట్టంగా ఉన్నప్పు డు లోకోపైలట్లు సిగ్నళ్లను గమనించగలిగేందుకు తోడ్పడే పరికరాలు మన రైల్వే వద్ద లేవు. దాంతో ప్రత్యేకంగా రూపొందించిన డిటొనేటర్లను రైలు వచ్చే సమయంలో సిగ్నళ్లకు కొన్ని వందల మీటర్ల ముందు పట్టాలపై అమరుస్తారు. రైలు దానిమీదుగా వెళ్లగానే అది పేలుతుంది. వెంటనే లోకోపైలట్ అప్రమత్తమై ముందు సిగ్నల్ ఉందని గుర్తించగలుగుతారు. వెంటనే రైలు వేగాన్ని కనిష్టస్థాయికి తగ్గించి, సిగ్నల్‌ను మసకగానైనా పరిశీలించి, తగిన చర్యలు చేపడతారు. సాధారణంగా చలి తీవ్రంగా ఉన్నప్పుడు రైలుపట్టాలు సంకోచిస్తాయి. ఒక్కోసారి విరిగిపోయి, ప్రమాదానికి కారణమవుతాయి. ట్రాక్‌మెన్ ద్వారా అధికారులు లోపాలను గుర్తించి, సిగ్నళ్లద్వారా లోకోపైలట్లను అప్రమత్తం చేస్తుంటారు. కానీ, పొగమంచుతో సిగ్నల్ కనిపించకపోతే ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏదైనా రైలు పట్టాలు తప్పటం వల్లనో, మరే కారణం చేతనో నిలిచిపోతే... వెనుక వస్తున్న ఇతర రైళ్లను ఎక్కడికక్కడ సిగ్నళ్ల ద్వారా నియంత్రించాల్సి ఉంటుంది. పొగమంచుకు సిగ్నల్ కనిపించకపోతే రైళ్లు ఢీకొనే ప్రమాదముంటుంది. కాగా.. ఉత్తర భారత ప్రాంతంలోని రైళ్లకు పొగమంచును చీల్చుకుంటూ కూడా ప్రసరించగలిగే సామర్థ్యమున్న లైట్లను అమర్చుతున్నారు. కానీ, దక్షిణమధ్య రైల్వేలో అలాంటివి లేవు. వాటిని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా అమలు కాలేదు. దాంతో ఇంకా డిటొనేటర్ సిగ్నళ్లపై ఆధారపడాల్సి వస్తోంది.