Thursday, 14 November 2013

వోల్వోలో ప్రయాణం అంటేనే హడల్!


వోల్వో బస్సులో ప్రయాణమంటే ప్రయాణికులు భయపడే పరిస్థితి ఏర్పడింది. మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద ఓల్వో బస్సు దుర్ఘటన మరువక ముందే కర్నాటకలోని హవేరి జిల్లా కునిమళ్లహళ్లి వద్ద ఈ తెల్లవారుజామున మరో వోల్వో బస్సు ప్రమాదానికి గురైంది. ఈ బస్సులో మంటలు లేచాయంటే క్షణాల్లో పూర్తిగా దగ్ధమైపోతుంది. వోల్వో బస్సు ప్రమాదానికి గురైందంటే ప్రాణాలపై ఆశలు వదులుకోవలసిందే.


 బెంగళూరు నుంచి ముంబై వెళుతున్న నేషనల్ ట్రావెల్ కు చెందిన వోల్వో బస్సు ఈ తెల్లవారుజామున ప్రమాదానికి గురై కాలి బూడిదైపోయింది. ఏడుగురు సజీవ దహనం అయ్యారు. 20 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. మృతులలో ఒకరిని ముంబైకి చెందిన శ్రీరామ్ గా గుర్తించారు. బెంగళూరుకు చెందిన భార్య,భర్త, ఇద్దరు పిల్లలు సజీవదహనం అయ్యారు. ఈ ప్రమాదంలో తన పాస్ పోర్టు, డాక్యుమెంట్లు కాలిపోయాయని దక్షిణాఫ్రికాకు చెందిన బ్రైట్ అనే ప్రయాణికుడు వాపోతున్నారు. ప్రమాదానికి గురైన ఈ బస్సును గత సంవత్సరమే కొనుగోలు చేశారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే హవేరీ జిల్లా ఎస్ పి శశికుమార్ సహాయ కార్యక్రమాలు చేపట్టారు.

సినిమా రివ్యూ: వెంకటేశ్, రామ్ బ్రాండ్ 'మసాలా'


తెలుగు చలన చిత్ర పరిశ్రమ చరిత్రలో మహానటులు ఎన్ టీఆర్, ఏఎన్నాఆర్, శోభన్ బాబులు కృష్ణ, కృష్టం రాజులతో కలిసి అనేక మల్టీ స్టారర్ చిత్రాలతో ప్రేక్షకులను ఆలరించారు. జనరేషన్ మారిన తర్వాత స్టార్ డమ్ ఇమేజ్ లో చిక్కుకుపోయిన ప్రస్తుత హీరోలు మల్టీస్టారర్ చిత్రాలవైపు చూడటానికి జంకారు, ఆలోచించడానికి వెనకడుగు వేశారు. టాలీవుడ్ తెరపై మల్టీ స్టారర్ చిత్రాల ఉనికి ప్రశ్నార్ధకమైన నేపథ్యంలో తాజాగా విక్టరీ వెంకటేశ్ ఓ సాహోసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. దాని ఫలితమే మహేశ్ తో కలిసి వెంకటేశ్ నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఆ చిత్రం అందించిన విజయోత్సహాంతో మళ్లీ రామ్ తో జతకట్టి 'మసాలా' చిత్రంలో నటించగా, రాంచరణ్ తో వెంకటేశ్ మరో చిత్రానికి పచ్చజెండా ఊపారు. టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ కు తెరతీస్తూ.. హిందీలో ఘనవిజయం సాధించిన 'బోల్ బచ్చన్' చిత్ర రీమేక్ గా 'మసాలా'తో వెంకటేశ్ గురువారం నవంబర్ 14 తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రామ్ తో కలిసి నటించిన మసాలా చిత్రం తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళ్లొద్దాం!


 కోర్టు తీర్పుతో యావదాస్తిని కోల్పోయిన రహమాన్ (రామ్), సోనియా(అంజలీ)లను తన తండ్రి స్నేహితుడు నారాయణ(ఎంఎస్ నారాయణ) చేరదీసి తన ఊరు భీమరాజపురంకి తీసుకెళుతాడు. భీమరాజపురంలో ధనవంతుడైన బలరాం వద్ద నారాయణ పనిచేస్తుంటాడు. బలరాం (వెంకటేశ్) దేనినైనా సహిస్తాడు కాని అబద్దం ఆడిన వాళ్ల ప్రాణలు తీయడానికైనా వెనుకాడడు. బలరాంకు మీనాక్షి అనే సోదరి ( షాజన్ పదాంసీ) ఉంటుంది. ఆ ఊరిలో బలరాంకు నాగరాజు (పోసాని) అనే దుష్టుడికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్ఠాయిలో విభేదాలు ఉంటాయి. వారిద్దరి మధ్య ఉన్న విభేదాల కారణంగా ఎన్నో ఏళ్లుగా ఓ ఆలయం మూతపడి ఉంటుంది. అయితే ఆ ఆలయ కొలనులో పడిన బాలుడిని రక్షించడానికి రెహమాన్ గుడి తాళం పగులగొట్టి, తలుపులు తెరుస్తాడు. దాంతో రహమాన్ పై నాగరాజు దాడికి పాల్పడుతున్న సమయంలో బలరాం వచ్చి కాపాడుతాడు. గుడి తలుపులు తెరిచిన రహమాన్ వివరాలు బలరాం అడుగుతాడు. ఆలయ తలుపులు తీసింది ఓ ముస్లిం అని చెబితే గొడవ అవుతుందనే ఉద్దేశంతో రహమాన్ పేరును రామ్ అని నారాయణ బృందం అబద్దం ఆడుతారు. రహమాన్ ఉరఫ్ రామ్ ప్రవర్తన నచ్చి బలరాం ఉద్యోగం ఇస్తాడు. ఒక అబద్దం ఆడిన రామ్.. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని అబద్దాలు ఆడాల్సి వస్తుంది. అంతేకాక రహమాన్, మీనాక్షిలు ఒకరికొకరు ప్రేమించుకుంటారు. అయితే అనేక అబద్దాలు ఆడిన రామ్.. బలరాంను ఎలా మెప్పించి, మీనాక్షితో పెళ్లిని ఎలా ఒప్పించాడు అనే సాదాసీదా కథతో 'మసాలా' చిత్రం రూపొందింది. వెంకటేష్ బ్రోకెన్ ఇంగ్లీష్ లో మాట్లాడటం బలరాం పాత్ర ప్రత్యేకత. కెరీర్ లో వెంకటేశ్ కు ఇది విభిన్నమైన పాత్ర. మల్టీస్టారర్ చిత్రాల్లో ఉండే పరిమితులు, ఇతర కారణాల వల్ల బలారాం పాత్ర కొంత మూసలో సాగినా.. పర్వాలేదనిపించింది. బలరాం పాత్ర చుట్టే ఇతర పాత్రలు తిరుగుతుంటాయి కాబట్టి వెంకటేశ్ ఈ చిత్రానికి వెన్నుముక అని చెప్పవచ్చు. ఇక రామ్, రహమన్ రెండు రకాల పాత్రలతో రామ్ ప్రేక్షకులను ఆలరించాడమే కాకుండా ఆకర్షించాడు కూడా. రామ్ పాత్ర కొంత అమాయకంగా ఉంటుంది. రహమాన్ గే (స్వలింగ సంపర్కుడు) రూపంతో నవ్వులు పూయించాడు.


 రామ్ లో ఉండే ఎనర్జీ గే పాత్రకు చాలా ప్లస్ అయింది. గే పాత్ర పోషించడానికి స్టార్స్ సహజంగానే వెనుకాడుతుంటారు. అయితే రామ్ ఇలాంటి పాత్రను చేయడమనేది ఓ సాహాసామే అని చెప్పవచ్చు. సోనియా పాత్రలో అంజలి తన పరిధి మేరకు ఓకే అనిపించింది కాని ఈ చిత్రంపై పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. మీనాక్షిగా పదాంసీ చిన్న చిన్న సీన్లలో కనిపించినా.. పాటలకు మాత్రమే పరిమితమైంది. మీనాక్షి పాత్రకు ఇంకెవర్నినైనా సెలెక్ట్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నారాయణ, ఆలీ బృందం గురించి. నారాయణ కొడుకుగా ఆలీ నటించాడు. ఆలీ మసాలా అనే డ్రామా కంపెనీని నడుపుతుంటాడు. కామెడి, డ్రామా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఆలీ ట్రాక్ ను తెలుగు వాతవరణానికి అనుగుణంగా చక్కగా డిజైన్ చేశారు. హిందీ 'బోల్ బచ్చన్' పోల్చకుంటే కృష్ణ, ఏఎన్నార్ కారెక్టర్లను బాగా ఇంప్రూవ్ చేసి ఆలీతో చేయించడం ఆకట్టుకుంది. అంతేకాక చింతామణి పాత్రలో కోవై సరళ తన మార్కును నిలబెట్టుకుంది. పాత సినిమాల్లోని ఐటమ్ సాంగ్స్ కు కోవై సరళతో డ్యాన్సులు చేయించడం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. జయప్రకాశ్, పోసానిలకు రొటిన్ పాత్రలే దక్కాయి.


 మీనాక్షి పాట ఒక్కటే థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గుర్తుండేలా ఉంది. ఎందుకంటే ప్రోమోలో ఎక్కువగా కనిపించడమేమో. తమన్ మళ్లీ అదే సంగీతం రొటిన్. తమన్ సంగీతం ఈ చిత్రానికి ప్లస్ అని చెప్పడం చాలా కష్టం. అనిల్ డైలాగ్స్ అక్కడక్కడ పేలాయి. ఇక 'నువ్వే కావాలి', 'నువ్వు నాకు నచ్చావు', 'మన్మధుడు' 'మల్లీశ్వరి' లాంటి ఫ్యామీలీ ఎంటర్ టైనర్లతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నదర్శకుడు విజయ భాస్కర్ ను ఇటీవల కాలంలో ఫ్లాప్ లు వెంటాడుతున్నాయి. చాలా కాలం తర్వాత 'బోల్ బచ్చన్' రీమేక్ తో అక్కడక్కడా తన మార్కును చూపించినా.. ప్రయోగాలకు దూరంగానే ఉన్నట్టు కనిపించింది. బోల్ బచ్చన్ సినిమాను సీన్ టూ సీన్ ను కదపకుండా.. టాలీవుడ్ ట్రెండ్ కు తగినట్టుగా రూపొందించారు. ఈ చిత్ర సెకండాఫ్ లో కొంత గందరగోళం అనిపించానా.. రామ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ బ్యాలెన్స్ చేసింది. వెంకటేశ్ ఇంగ్లీష్ డైలాగ్స్ బీ, సీ ఆడియెన్స్ ను ఆకట్టుకోవడంపైనే 'మసాలా' చిత్ర విజయం కొంత ఆధారపడి ఉంటుంది. వెంకటేశ్, రామ్ అందించిన 'మసాలా' చిత్రంలో ఘాటు ఎక్కువైందనిపిస్తుంది. లాజిక్కులన్ని వదిలేసి.. వినోదాన్ని ఆశించే ప్రేక్షకులు మసాలాను ఎంజాయ్ చేయవచ్చు అనే రేంజ్ టాక్ ను సంపాదించుకుంది. వెంకట్రామ్ (వెంకటేశ్, రామ్) బ్రాండ్ మసాలాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో వేచిచూద్దాం!

Wednesday, 6 November 2013

సచిన్ కు థ్యాంక్యూ చెప్పాలనుకుంటున్నారా?


ప్రపంచ క్రికెట్ కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అందించిన సేవలకు గుర్తుగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సోషల్ మీడియా వెబ్ సైట్ లో #ThankYouSachin అనే అకౌంట్ ప్రారంభించారు. విశ్వవ్యాప్తంగా సచిన్ టెండూల్కర్ కు ఉన్న అభిమానులు కృతజ్క్షతలు తెలియ చేయడానికి ఈ అకౌంట్ ను అందుబాటులోకి తెచ్చారు.


 అభిమానులు @BCCI #ThankYouSachin అకౌంట్ ఉపయోగించి మెసేజ్ పంపితే.. ఒక్క క్షణంలోనే బీసీసీఐ ట్విటర్ అకౌంట్ నుంచి సచిన్ ఆటోగ్రాఫ్ తో ఉన్న పోస్టర్ వస్తుంది. సచిన్ ఆటోగ్రాఫ్ తో ఉన్న పోస్టర్ ను అభిమానులు తమ పేరుతో పొందాలనుకుంటే మీరు ప్రయత్నించవచ్చు. నేను ప్రయత్నించాను.. మీరు కూడా ప్రయత్నించి సచిన్ వాల్ పోస్టర్ పొందండి.. మరి ఆలస్యమెందుకు?


 బీసీసీఐ చేసిన ప్రయత్నానికి వేలాది మంది అభిమానుల నుంచి స్పందన వచ్చిందని బీసీసీఐ వెల్లడించింది.

గోపిచంద్‌ తో తమన్నా రొమాన్స్...డిటేల్స్


గోపీచంద్‌, తమన్నా కాంబినేషన్ లో చిత్రం రాబోతోందా అంటే అవుననే అంటు న్నాయి టాలీవుడ్‌ వర్గాలు. అహనా పెళ్ళంట, పూలరంగడు, భాయ్‌ సినిమాలకు దర్శకత్వం వహించిన వీరభద్రమ్‌ ఈ చిత్రానికి దర్శ కత్వం వహిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. భవ్యక్రియేషన్స్‌ పతాకంపై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పూర్తి స్ధాయి కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుందని చెప్పుకుంటున్నారు. గతంలో 'శౌర్యం", 'అమరావతి", 'వాంటెడ్‌" చిత్రాలు నిర్మించిన భవ్య క్రియేషన్స్‌ వీరభద్రమ్‌తో నిర్మించే చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ చిత్రంలో గోపీచంద్ హీరోగా చేయనున్నాడు. వీరభధ్రమ్ చెప్పిన కథను విన్న గోపీచంద్ స్టోరీ లైన్ ఓకే చేసి కొన్ని స్క్రిప్టు కరెక్షన్స్ చెప్పాడని తెలుస్తోంది. ఇక నాగార్జున తో చేసిన భాయ్ చిత్రం పెద్దగా వర్కవుట్ కాకపోయినా దర్శకుడుగా బాగానే హ్యాండిల్ చేసాడనే పేరు మాత్రం వచ్చింది. దాంతో గోపీచంద్ ...చేయటానికి ఆసక్తి చూపుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం గోపీచంద్‌ బి.గోపాల్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందు లో నయనతార హీరోయిన్. నిర్మాత తాండ్ర రమేష్, బి. గోపాల్-గోపీచంద్‌ల కాంబినేషన్‌తో నిర్మిస్తున్న తాజా చిత్రం గురించి చెబుతూ..బి. గోపాల్ దర్శకత్వంలో గోపీచంద్ కథానాయకుడిగా నిర్మిస్తున్న మా చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ని సెప్టెంబర్ 3 నుంచి స్విట్జర్లాండ్‌లో మొదలు పెట్టామన్నారు. అక్కడి అందమైన లొకేషన్స్‌లో రచయిత శ్రీమణి రాసిన రెండు యుగళ గీతాలను గోపీచంద్, నయనతారలపైన దినేష్ మాస్టర్ నృత్య దర్శకత్వంలో చిత్రీకరిస్తున్నామని తెలిపారు. అలాగే తమన్నా తమిళంలో వీరం చిత్రంలో నటిస్తోంది. తెలుగులో మహేష్‌తో కలిసి ఆగడు చేస్తోంది. ఈ సినిమా ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే....పలు సౌత్ ప్రాజెక్టులతో పాటు, బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్ సాజిద్-పర్హాద్ ‘ఇట్స్ ఎంటర్టెన్మెంట్స్' చిత్రంతో పాటు, సాజిద్ ఖాన్ ‘హమ్ షకల్' చిత్రంలో నటిస్తోది. సౌత్‌లో సిరుతై శివ దర్శకత్వంలో అజిత్ హీరోగా తెరకెక్కుతున్న తమిళ మూవీ ‘వీరమ్'లో నటిస్తోంది. మహేష్ బాబు తర్వాతి సినిమా ‘ఆగడు' చిత్రంలో కూడా తమన్నా హీరోయిన్‌గా ఎంపికయినట్లు తెలుస్తోంది.

సిఐ చొక్కా పట్టిన అంబటి రాంబాబు!, హెచ్చరిక, అరెస్టు


గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ముఖ్య నేత అంబటి రాంబాబు బుధవారం ఓ సిఐ చొక్కా పట్టుకున్నారట. సమైక్యాంధ్రకు మద్దతుగా జగన్ పార్టీ బుధవారం, గురువారం రహదారుల దిగ్బంధానికి పిలుపునివ్వగా, అంబటి రాంబాబు గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలో రోడ్డు పైన రాస్తా రోకో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో అంబటి రెచ్చిపోయారు. సీఐ చొక్కా పట్టుకుని, వేలెత్తి చూపుతూ హెచ్చరికలు చేశారని వార్తలు వచ్చాయి. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబటి సహా 50 మంది కార్యకర్తలు కొండమోడు సెంటర్లో రాస్తా రోకోకు దిగారు. దీంతో మూడు కిలో మీటర్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది.


 ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా రాస్తారోకోను విరమించాలని సీఐలు బిలాలుద్దీన్, వై. శ్రీధర్‌రెడ్డిలు అంబటికి సూచించారు. రాస్తారోకో విరమించేదిలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు భీష్మించుకుకూర్చున్నారు. దీంతో సత్తెనపల్లి డిఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు వలయంగా ఏర్పడి అంబటితో పాటు కార్యకర్తలను పక్కకు లాగేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో పోలీసులు అంబటి మధ్య వాగ్వివాదం జరిగింది. పోలీసుల పైకి వేలెత్తిచూపుతూ అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోపంతో ఇద్దరు సిఐ చొక్కాలను పట్టుకొని, నా ఒంటిపై చేయి వేస్తారా? అంటూ మండిపడ్డారట. అంబటిని బలవంతంగా పోలీసులు జీపులోకి ఎక్కించి పిడుగురాళ్ల పోలీసు స్టేషన్‌కు తరలించారు. స్టేషన్ ఎదుట, కొండమోడు సెంటర్లో కార్యకర్తలు కొద్దిసేపు మళ్లీ రాస్తారోకో చేశారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేశారు.

వోల్వో ప్రమాదం: నిమిషాల్లో మృతి, అలాఐతే బతికేవారు



వారం రోజుల క్రితం మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన బస్సు ప్రమాదం పైన విచారణ జరుగుతోంది. బస్సులో సజీవదహనమైన వారు మంటలు అంటుకున్న రెండు నిమిషాల్లోనే మరణించినట్లుగా క్లూస్ టీం నిర్ధారించినట్లుగా తెలుస్తోంది. మంటలు వ్యాపించిన క్షణాల్లోనే కార్పన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్ పెద్ద ఎత్తున ఉత్పత్తయ్యాయి. దీంతో గాఢనిద్రలో ఉన్న ప్రయాణీకులు మేల్కొనేసరికి ఆ రెండు వాయువులు బస్సు అంతటా వ్యాపించాయి. దీంతో వారు ఊపిరాడక అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. బస్సులోకి ఆక్సిజన్ అందలేదు. ఆ స్థితిలో ఎవరైనా ఒకటి రెండు నిమిషాల కంటే ఎక్కువ సేపు బతకడం అసాధ్యమని, అద్దాలు పగులగొట్టి ఉంటే ఆక్సిజన్ సరఫరా జరిగి చాలామంది బతికే వారని, ఆ అవకాశం లేకపోవడంతో మంటలు తీవ్రత పెరగకముందే అంతా మృత్యువాత పడ్డారని తేల్చింది. దీంతో ప్రయాణీకులు మరణించాకే మంటల్లో కాలిపోయారని, బస్సుల్లో బాణసంచా, పేలుడు పదార్థాలు లేవని తేల్చింది.

కల్వర్టును బస్సు దూసుకు వచ్చి తాకడంతో ప్రమాదం సంభవించింది. కల్వర్టును బలంగా ఢీకొనడంతో బస్సు రేకు ఊడింది. అదే సమయంలో రెయిలింగ్ గొట్టం.. డీజిల్ ట్యాంకుకు గుచ్చుకోవడంతో లీకైంది. ఊడిన రేకు.. రహదారిపై రాసుకుంటూ వెళ్లడంతో నిప్పురవ్వలు వచ్చాయి. ఊడిన రేకుకు దగ్గర లగేజీ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదం పైన మరిన్ని టీంలు విచారణ జరుపుతాయని, ఆ తర్వాతే తుది నివేదిక ఉంటుందని వనపర్తి డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.

పొగాకు వ్యతిరేక ప్రకటనలను వెక్కిరించిన రాంగోపాల్ వర్మ!


వివాదస్పద వ్యాఖ్యలు చేయడంలోనూ, వివాదాల్లో కూరుకుపోవడం మంటే సినీ దర్శకులు రాంగోపాల్ వర్మకు చెప్పలేనంత సరదాగా ఉంటుందేమో. తన ట్విటర్ అకౌంట్ ఆసరాగా చేసుకుని చేసే సంక్షిప్త సందేశాలు కొన్నిసార్లు ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ, మరి కొన్నిసార్లూ ఫులీష్ గా, కాంట్రవర్సీగా కనిపిస్తాయి. సినిమాల ప్రదర్శనకు ముందు దూమపానం, పోగాకు వ్యతిరేక ప్రకటనలను చూపించడంపై తాజాగా రాంగోపాల్ వర్మ ధ్వజమెత్తారు. వినోదం కోసం థియేటర్ కు వచ్చిన చికాకు కలిగించే విధంగా క్యాన్సర్ వ్యాధికి గురైన వారి ఊపిరితిత్తులు, నోటిని చూపిస్తున్నారని సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో పేర్కోన్నారు. అంతేకాకుండా తన చిన్నతనం నుంచి లక్షలాది దూమపాన వ్యతిరేకం కార్యక్రమాలు నిర్వహించినా.. ఏ ఒక్కడు కూడా సిగిరెట్ మానినట్టు కనిపించలేదని వ్యాఖ్యలు చేశారు.