
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధానిపై కసరత్తులు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధానిని విజయవాడ-గుంటూరు నగరాల మధ్య ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సంకేతాలిచ్చినట్లు ప్రచారం సాగుతోంది. రెండు రోజుల క్రితం కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో గుంటూరు-విజయవాడల మధ్యనే కొత్త రాజధానిని నిర్మించాలని వారు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. చంద్రబాబు నాయుడుకు కూడా ఇక్కడే రాజధానిని ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనే చంద్రబాబు నాయుడు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజధానిని ముందే ప్రకటిస్తే పలువురు వ్యాపారవేత్తలు, సంపన్నులు ఆ ప్రదేశంలోని భూములను భారీగా కొనుగోలు చేస్తారని, అది ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
No comments:
Post a Comment