Friday, 22 November 2013

'అత్తారింటికెళ్లారు: పవర్ కల్యాణ్‌లా వద్దు'


పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు గవర్నర్ నరసింహన్ రాజకీయాలపై హెచ్చరించారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో వారం రోజుల పాటు జరిగిన 18వ అంతర్జాతీయ చిత్రోత్సవాలు బుధవారం సాయంత్రం లలిత కళా తోరణంలో ముగిశాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, మంత్రి డికె అరుణలతో పాటు హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా వచ్చారు. ఈ సమయంలో నరసింహన్.. పవన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ సాగుతోంది. పవన్‌ను ఉద్దేశించి ఆరడుగుల బుల్లెట్టు.. ధైర్యం విసిరిన రాకెట్టు అని చెప్పిన గవర్నర్ ఆ తర్వాత ‘అత్తారింటికి దారేది సినిమా ద్వారా పవన్ కల్యాణ్ తన పవర్ చూపించారు.

అయితే పవన్ కల్యాణ్ ఇంట్లో పవర్ కల్యాణ్‌లా కాకుండా పవన్ కల్యాణ్‌లా ఉండాలి' అని ఛలోక్తులు విసిరారు. ఈ సమయంలో పవన్ ముసి ముసి నవ్వులు నవ్వారు. ఇటీవల పవన్ రాజకీయాల్లోకి వస్తారని, తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని, ప్రజారాజ్యం పార్టీని పునరుద్దరిస్తారనే ప్రచారం సాగింది. ఆ ప్రచారాన్ని ఖండించినప్పటికీ.. పుకార్లు వినిపించిన నేపథ్యంలో పవన్ కల్యాణ్‌ను రాజకీయాల్లోకి రావొద్దనే ఉద్దేశ్యంతోనే గవర్నర్ ఆ హెచ్చరికను చలోక్తిగా చేశారని అంటున్నారు.

No comments:

Post a Comment