పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాగబాబు ఇద్దరూ అన్న చిరంజీవికి విధేయులే. తమ ఎదుగుదలకు అన్నే కారణం అని ఇప్పటికీ, ఎప్పటికీ వారు నమ్ముతారు. వారు అలా భావించినంత మాత్రాన వారిలో టాలెంట్ లేదని కాదు. నటనా సామర్ధ్యంతోపాటు వారి వ్యక్తిత్వం వారికి ఉంది. వారి విలువలు వారికి ఉన్నాయి. అన్న అండతో అల్లుకుపోయామని వారికి తెలుసు. వాస్తవాలు తెలుసుగనుకనే ఒద్దికగా ఉంటారు. అన్న మాటకు విలువ, గౌరవం ఇచ్చినంత మాత్రాన వారి మధ్య అభిప్రాయ బేధాభిప్రాయాలు, చిన్నచిన్న మనఃస్పర్ధలు లేవని కాదు. అవి ఉంటాయి. వాటి దారి వాటిదే. వారి ఐక్యత వారిదే. ఆ రకంగా అటుంటి తమ్ముళ్లు ఉన్నందుకు చిరంజీవి కూడా అదృష్టవంతుడు. బాబాయి పవన్ మనసు తెలిసినందునే చరణ్ అప్పుడప్పుడు రెచ్చిపోయి మాట్లాడుతుంటారు.తమ సంబంధం పటిష్టమైనదని చెబుతుంటారు. అన్నను వదిలి పవన్ గానీ, నాగబాబు గానీ రాజకీయ పార్టీ పెట్టే అవకాశం లేదు. మరో పార్టీలో చేరే అవకాశం అంతకంటే లేదు. అన్నకు విధేయులుగా ఉండే వారు అన్న ఒక పార్టీలో ఉంటే మరో్ పార్టీలో ఎందుకు చేరతారు? ఈ ఇద్దరూ తెలుగు దేశం పార్టీలో చేరుతున్నట్లు ఎవరు ఊహించారోగానీ, అది రెండు రోజులపాటు విస్తృతంగా ప్రచారం అయింది. టిడిపి నేతలైతే ఒక అడుగు ముందుకువేసి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి తమ పార్టీలోకి వస్తే మంచిదేనని ఆహ్వానం పలికారు.
ఆ తరువాత నాగబాబు, పవన్ వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. తాను, పవన్ కళ్యాణ్ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్లు వచ్చిన వార్తలను నాగబాబు ఖండించారు. టీడీపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు నిరాధారమైనవని పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయాల్లోకి వచ్చే తీరిక తమకు లేదని స్పష్టం చేశారు. తాము వృత్తిపరంగా బిజీగా ఉన్నట్లు తెలిపారు. వృతికి న్యాయం చేయడమే తమ బాధ్యతగా పేర్కొన్నారు. తాము రాజకీయ పార్టీ పెట్టడం లేదని కూడా నాగబాబు స్పష్టం చేశారు. మీడియా కథనాలు అభిమానులను, ప్రజలను గందరగోళపరిచేలా ఉన్నాయని వాపోయారు.
No comments:
Post a Comment