అంజలిపై అరెస్టు వారెంటు జారీ....
సీతమ్మకు సినిమా కష్టాలు తీరట్లేదు. చెన్నైలోని సైదాపేట కోర్టు ఆమెపై అరెస్టు వారెంటు జారీచేసింది. తమిళ సినీ దర్శకుడు కళంజియం దాఖలుచేసిన పరువు నష్టం కేసు విచారణకు హాజరు కావాల్సిన అంజలి.. పదే పదే ఆ కేసు విచారణకు హాజరు కాకపోవడంతో ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీచేసిన కోర్టు, ఈసారి ఏకంగా అరెస్టు వారెంటే ఇచ్చేసింది. గతంలోనూ అంజలి విచారణ నిమిత్తం కోర్టుకు హాజరు కాకపోవటంతో ఆమెకు కోర్టు మరోసారి అవకాశం ఇచ్చింది. తదుపరి తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది. అంతే కాకుండా విచారణకు హాజరుకాని పక్షంలో అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని కూడా కోర్టు హెచ్చరించింది. అయినా అంజలి కోర్టు హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోలేదు. మళ్లీ కోర్టుకు డుమ్మా కొట్టింది. ఇప్పటికే నాలుగైదు సార్లు అంజలి కోర్టుకు గైర్హాజరైంది. దాంతో తదుపరి విచారణకు కోర్టుకు హాజరు కాకపోతే చర్యలు తప్పవని సైదాపేట కోర్టు ముందే హెచ్చరించింది. మరోవైపు అంజలికి అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని పిటిషనర్ కళంజియమ్ కూడా కోర్టును కోరారు. మరోవైపు అంజలి తీరుపై ఇటీవలే మద్రాసు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నటి అంజలి కనిపించడం లేదని ఏప్రిల్ 8న ఆమె పిన్ని భారతీ దేవి మద్రాస్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో స్పందించిన కోర్టు అంజలిని తమ ముందు హాజరుపర్చాలని చెన్నై పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ అమ్మడు కోర్టులకు డుమ్మాలు మీద డుమ్మాలు కొట్టడం చూస్తుంటే ఆమె అరెస్ట్ తప్పదనేలా కనిపిస్తోంది.
No comments:
Post a Comment