Friday, 10 January 2014

నేనెవరిని? ( ‘1’ నేనొక్కడినే రివ్యూ)


కొత్తగా ఎప్పుడు ఏం చెప్పినా తెలుగు ప్రేక్షకుడు చూస్తున్నాడు...సూపర్ హిట్ చేస్తున్నాడు. అలాగని కొత్త పేరు చెప్పి కథ విడిచి సాము చేస్తే మాత్రం నిర్విర్ధంగా తిరస్కరిస్తున్నాడు. ‘1' నేనొక్కడినే సినిమాలో దర్శకుడు కొత్తదనం కోసం(సాంకేతికంగా,జెనర్ పరంగా) చేసిన ప్రయత్నం మాత్రం తప్పకుండా మెచ్చుకోవాల్సిన అంశం. అయితే మహేష్ వంటి స్టార్ హీరోల సినిమాలంటే ఖచ్చితంగా వాటినుంచి ప్రేక్షకులు ఎక్సపెక్ట్ చేసే అంశాలు కొన్ని ఉంటాయి. వాటిని వదిలేయకుండా తనదైన శైలిలో కథను సుకుమార్ చెప్పే ప్రయత్నం చేస్తే బాగుండేదనిపిస్తుంది. అయితే థ్రిల్లర్ నేరేషన్ కావటంతో అది ...కమర్షియల్ హీరో కథలా..హీరోనే హైలెట్ చేస్తూ...కథనం నడపటం కష్టమైపోయింది. తెలుగు సినిమాకు తగినట్లు కథ,కథనంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని సెకండాఫ్ ని సైతం ఫస్టాఫ్ లాగ స్పీడుగా రన్ నడిపితే ఖచ్చితంగా అంచనాలు అందుకునేది. అయితే మహేష్ మాత్రం తన నటనతో మైమరిపించాడనే చెప్పాలి. ఈ చిత్రానికి నేనొక్కడినే అని కాకుండా...నేనెవరిని అని పెడిగితే బాగుండేదనిపిస్తుంది. గౌతమ్(మహేష్)...చిన్నప్పుడే తల్లి తండ్రులను కోల్పోతాడు. తన తల్లి తండ్రులను ముగ్గురు చంపారని గుర్తుపెట్టుకుంటాడు..కాని వాళ్లు ఎవరు..ఎందుకు చంపారు అనేది మాత్రం తెలియకుండానే పెరిగి పెద్దవుతాడు. తన తల్లి తండ్రుల ముఖాలు మర్చిపోతాడు కానీ వారిని చంపిన వారిని మాత్రం ప్రతీ క్షణం తలుచుకుంటూ రాక్ స్టార్ గా ఎదుగుతాడు. ఎదుగుదలతో పాటు తన తల్లి తండ్రి ఎవరు అనే విషయం తెలుసుకోవాలనే కోరిక పెరిగి పెద్దవుతుంది...అంతేకాదు..వారిని చంపిన వారిపై పగ తీర్చుకోవాలనే నిర్ణయించుకుంటాడు. ఈ లోగా అతినిపై దాడులు మొదలువుతాయి..ఈ క్రమంలో గౌతమ్ తల్లి తండ్రులు ఎవరనేది ఎలా తెలుసుకున్నాడు..తన పగ ఎలా తీర్చుకున్నాడనేది మిగతా కథ. (థ్రిల్లర్ జానర్ లో వచ్చిన చిత్రం కావటంతో ఇంతకు మించి కథను రివిల్ చేస్తే చూడటం ఇబ్బందవుతుంది కాబట్టి...కథలో ఎలిమెంట్స్ ఏవీ రివిల్ చేయటం లేదు..) టెక్నికల్ గా సినిమా హాలీవుడ్ సినిమాల స్ధాయిలో హై స్టాండర్డ్స్ లో ఉండాలని సుకుమార్ ఫిక్సై తీసాడని మొదటి ఫ్రేమ్ నుంచే అర్దమవుతుంది. అయితే విభిన్నతే విజయానికి మూలం అని నమ్మిన సుకుమార్..ఇక్కడ మన వాళ్ల టేస్ట్ ఎందుకనో మర్చిపోయారు . ముఖ్యంగా ఇలాంటి కథలు ఏ ఇమేజీ లేని హీరోల మీద తీస్తే...చూడటానికి బాగుంటాయి. మహేష్ బాబు సినిమా అంటే కామెడీ, యాక్షన్,మోతిక్కించే పాటలు, జోష్ గా తెరపై చెలరేగే హీరో అని ఫిక్సయిన వారికి చూడటానికి ఇబ్బందిగానే ఉంటుంది. అందులోనూ హీరో ...ఎంతసేపు తన గతం తవ్వుకుంటూ, విలన్స్ నుంచి తనను తాను రక్షించుకుంటూ తిరగటమే సరిపోతుంది తప్ప..విలన్స్ కి ఎదురు ట్విస్ట్ లు ఇచ్చే ఎలిమెంట్స్ ఈ కథలో బాగా తక్కువ ఉన్నాయి. అసలు విలన్ ఎవరో తెలిస్తేనే కదా వారిపై దాడికి దిగేది ..అది క్లైమాక్స్ దాకా తెలియదు...అందులోనూ కథని థ్రిల్లింగ్ చెప్పాలనే తాపత్రయంలో కొంత కన్ఫూజన్ కి గురి అయ్యింది. ముఖ్యంగా ఇంటర్వెల్ దాటాక అయితే మరీను. ఫస్టాఫ్ ని ...ఎంతో పగడ్బందీగా నడిపిన దర్శకుడు సెకండాఫ్ ని ఆ ఫేజ్ లో రన్ చేయలేకపోయాడు.

Tuesday, 7 January 2014

ఉదయ్ కిరణ్ జీవితంలో నిజమైన.. 'ఆ నలుగురు'


తెలుగు సినీ పరిశ్రమ నిర్మించిన ఉత్తమ చిత్రాలలో 'ఆ నలుగురు' ఒకటి. అందులో ప్రధాన పాత్రధారి (రాజేంద్ర ప్రసాద్ పోషించారు) చనిపోయిన తర్వాత, ఆయన అంత్యక్రియలు చేయడానికి కన్న కొడుకులు కూడా దగ్గర లేని పరిస్థితిలో... ఊరంతా తామున్నామంటూ వస్తుంది. ఈ సన్నివేశం ప్రేక్షకులను ఊపిరి బిగబట్టేలా చేస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఉదయ్ కిరణ్ నిజజీవితంలో ఇదే జరిగింది. అందరూ కాలేజి ఎగ్గొట్టి సినిమాలు చూసే వయసులోనే ఉదయ్ కిరణ్ సినీ హీరోగా అంతులేని స్టార్ డమ్ ను సొంతం చేసుకున్నాడు. హిట్ మీద హిట్ కొడుతూ దూసుకుపోయాడు. కానీ, తలరాతో లేక దాసరి నారాయణ రావు చెప్పినట్టు కొన్న శక్తుల ప్రోద్బలమో కానీ, ఉదయ్ కిరణ్ చిన్న వయసులోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయ్ మరణ వార్త విన్న యావత్ ఆంధ్రదేశం ఒక్క సారిగా షాక్ కు గురయింది.

అయ్యో పాపం అన్న వారే తప్పితే, మరో కామెంట్ ఎవరూ చేయలేకపోయారు. మరో విషాదమేంటంటే, ఉదయ్ మరణించినప్పుడు అతని పక్కన నా అన్న వారు కూడా లేకపోవడం. ఉదయ్ మరణ వార్త వినగానే శ్రీకాంత్, శివాజీ రాజా లాంటి నటులు కొంత మంది ఆయన నివాసం వద్దకు వచ్చారు. కానీ, మేమంతా ఒకే కుటుంబం అని చెప్పుకునే సినీ పరిశ్రమ పెద్దలు ఒక్కరంటే ఒక్కరూ రాలేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఉదయ్ కు తల్లి లేదు, అన్న లేడు, సొంత తండ్రి చాలా కాలం నుంచి దూరంగా ఉంటున్నాడు. ఈ పరిస్థితుల్లో ఉదయ్ అనాథ శవంలా మిగిలిపోయాడు. ఆయన అంత్యక్రియలు ఎలా జరుగుతాయో అన్న సందేహాలు అందర్లోనూ వెల్లువెత్తాయి. ఈ పరిస్థితుల్లో సొంత మనుషులు లేకపోతే ఏంటి, మేమున్నామంటూ ఆయన అభిమానులు తరలి వచ్చారు. ఆయన నివాసం వద్ద, ఫిల్మ్ ఛాంబర్ వద్ద, చివరకు అంత్యక్రియల సమయంలోనూ... మేమే నీ ఆత్మీయులం అంటూ వీడ్కోలు పలికారు. అభిమానుల రాకతో ఎర్రగడ్డ శ్మశానవాటిక ఇసుక వేస్తే రాలనంతగా నిండిపోయింది. చూశారా... ఆ నలుగురు సినిమాలో చూసిన సన్నివేశం ఉదయ్ జీవితంలో ఎలా నిజమయిందో. కల్మషం లేని చిరునవ్వే కాదు... అంతకన్నా గొప్ప వాడు ఉదయ్ కిరణ్. అందుకే బతికున్న రోజుల్లో ఒంటరి తనాన్ని ఫీలైనా... చనిపోయిన తర్వాత అంతమంది ఆప్యాయతల్ని, అనురాగాలనూ తనతో తీసుకెళ్లారు.

Uday kiran producer shocking statement on chiranjeevi


Sunday, 5 January 2014

ఉరేసుకొని హీరో ఉదయ్ కిరణ్ సూసైడ్, భార్యకు మెసేజ్!


హైదరాబాద్: ప్రముఖ తెలుగు హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన శ్రీనగర్ కాలనీలోని స్వగృహంలో ఆదివారం అర్ధరాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గ మధ్యలో మృతి చెందారు. ఆయన నటించిన తొలి సినిమా 'చిత్రం'. దీనిని ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పైన ప్రముఖ దర్శకులు తేజ తెరకెక్కించారు. 'నువ్వు నేను' సినిమాలో ఉత్తమ నటనకు గాను 2001లో ఫిలింఫేర్ అవార్డు పొందారు. నువ్వు నేను, మనసంతానువ్వే, శ్రీరామ్ చిత్రాలతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఉదయ్ కిరణ్ తమిళంలో కూడా నటించాడు. మొత్తం 19 సినిమాలలో నటించాడు. తెలుగులో 16, తమిళంలో 3 సినిమాల్లో నటించారు. 1980 జూన్ 26న జన్మించిన ఉదయ్ సికింద్రాబాదులోని వెస్లీ కళాశాలలో చదువుతున్న రోజుల్లో మోడలింగ్ వైపు వెళ్లారు. ఆ తర్వాత చిత్రం సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. హ్యాట్రిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఉదయ్ కిరణ్ 2012 అక్టోబర్ 24న విషితను పెళ్లి చేసుకున్నారు. చనిపోయే ముందు ఉదయ్ భార్యకు ఐ లవ్యూ అని మెసేజ్ పెట్టారట. ఉదయ్ కిరణ్ ఇంటికి క్లూస్ టీం చేరుకుంది. ఆయన సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చివరిసారిగా ఓ మిత్రుడితో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. భూపాల్ ద్వారా తమకు సమాచారం అందిందని హీరో శ్రీకాంత్ అన్నారు. తాము వెళ్లేసరికి మృతి చెందాడన్నారు. ఉదయ్ తండ్రి అందుబాటులో ఉన్నారని, మామ, భార్య ఆసుపత్రికి వచ్చారని చెప్పారు.

Tuesday, 17 December 2013

అంత సంపాదన లేదు, ఫోర్బ్స్ కథనంపై నాగ్ అసంతృప్తి


హైదరాబాద్: ప్రముఖ ఇంటర్నేషనల్ బిజినెస్ మేగజైన్ ఫోర్బ్స్ ఇండియాలోని టాప్ 100 సెలబ్రిటీల లిస్టు విడుదల చేసిన సంగతి తెలిసిందే. పాపులారిటీ పరంగా, సంపాదన పరంగా టాప్ 100 వ్యక్తులను సెలక్ట్ చేసింది ఫోర్బ్స్ మేగజైన్. అయితే ఈ జాబితాలో తన పేరు రావడంపై తెలుగు సినీ స్టార్ నాగార్జున అసంతృప్తి వ్యక్తం చేసారు. ఫోర్బ్స్ లిస్టులో నాగార్జున 61వ స్థానం దక్కించుకున్నారు. 2013 సంవత్సరంలో రూ. 20.5 కోట్లు సంపాదించినట్లు పేర్కొనబడి ఉంది. సంపాదన పరంగా ఆయన 34వ స్థానంలో, పాపులారిటీ పరంగా 75వ స్థానంలో ఉన్నట్లు ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది. అయితే తనకు అంత సంపాదన లేదని, ఊహా జనితంగానే ఆ లెక్కలు ప్రకటించారని అంటున్నారు నాగార్జున. ఈ మేరుకు ఫోర్బ్స్ ఎడిటర్‌కు ఈమెయిల్ పంపినట్లు ఆయన తెలిపారు. ఈ పత్రిక ప్రటించి ఇతర తెలుగు సెలబ్రిటీల వివరాల్లోకి వెళితే...పవన్ కళ్యాణ్ కు ఈ లిస్టులో 26వ స్థానం దక్కింది. అతని సంపాదన రూ. 57 కోట్లుగా పేర్కొన్నారు. సంపాదన పరంగా పవన్ కళ్యాణ్ 13వ స్థానంలో ఉన్నారని, పాపులారిటీ పరంగా 79వ స్థానంలో ఉన్నారని పేర్కొంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈ లిస్టులో 54వ స్థానం దక్కింది. ఆయన సంపాదన రూ. 28.96 కోట్లుగా పేర్కొన్నారు. సంపాదన పరంగా 24వ స్థానం, పాపులారిటీ పరంగా 84వ స్థానం దక్కించుకున్నాడు మహేష్ బాబు. ఇక రవితేజకు 68 స్థానం దక్కగా సంపాదన రూ. 13 కోట్లు ప్రకటించారు. సంపాదన పరంగా రవితేజ 54వ స్థానం, పాపులారిటీ పరంగా 73వ స్థానంలో ఉన్నారు. రామ్ చరణ్ 69వ స్థానం దక్కించుకోగా, సంపాదన 12.67 కోట్లు. సంపాదన పరంగా చరణ్ 55వ స్థానం, పాపులారిటీ పరంగా 72వ స్థానంలో ఉన్నట్లు తెలిపారు.

Wednesday, 11 December 2013

రాహుల్ గాంధీకి తృటిలో తప్పిన విమాన ప్రమాదం


న్యూఢిల్లీ: ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి విమాన ప్రమాదం తృటిలో తప్పింది. ఢిల్లీ విమానాశ్రయంలో రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చాయి. పైలట్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానం ల్యాండ్ కావలసిన సమయానికే రన్ వేపై మరో విమానం ఉంది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. రాహుల్ గాంధీ రాయబరేలీ నుంచి ఢిల్లీ వస్తుండగా ఈ ఘటన జరిగింది.

Sunday, 8 December 2013

రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు మనోజ్‌కు గాయాలు


ఔటర్‌రింగ్‌రోడ్డుపై అప్పా వద్ద ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న సినీ నటుడు మోహన్‌బాబు కుమారుడు మనోజ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అతన్ని వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. జూబ్లీహిల్స్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వెళ్తుండగా గేదె అడ్డుతగిలి కారు బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ఉన్న బెలూన్స్ తెరుచుకోవడంతో అందులోని మనోజ్‌తో పాటు డ్రైవర్, బాడీగార్డు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ముగ్గురికి స్వల్ప గాయాలయ్యా యి. వివరాల్లోకి వెళితే...మనోజ్ రాజేంద్రనగర్‌లో జరుగుతున్న ఓ పెళ్లికి హాజరుకావడానికి స్నేహితుడు రంజిత్, డ్రైవర్ నరేష్, బాడీగార్డు రాజుతో కలిసి రాత్రి 8 గంటలకు తన ఇంటి నుంచి ఫార్చూనర్ కారు (ఏపీ 03ఏవై 0019)లో ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా బయలు దేరారు.

అప్పా జంక్షన్ దాటిన తరువాత వీరి కారు ప్రమాదానికి గురైంది. బోల్తాపడ్డ కారు 200 మీటర్ల దూరం వరకు రోడ్డును రాసుకుంటూ పోయింది. గాయపడిన మనోజ్, నరేష్, రాజులను ఓ కారులో బంజారాహిల్స్‌లోని ఆపోలో ఆస్పత్రికి తరలించా రు. రోడ్డుపై మృతి చెంది పడి ఉన్న గేదెను కారు ఢీకొనడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. గాయపడ్డ మనోజ్‌కు అపోలో ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందించారు. ఆయన కుడి చెయ్యి, కుడి కన్ను వద్ద స్వల్ప గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు మోహన్‌బాబు, నిర్మల, సోదరుడు మంచు విష్ణు దంపతులు ఆస్పత్రికి వచ్చారు. అప్పటికే ఆస్పత్రికి భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. చికిత్స అనంతరం రాత్రి మనోజ్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఇక మంచు మనోజ్ ...తన ఫ్యామిలీ మల్టీ స్టారర్ మూవీ ‘పాండవులు పాండవలు తుమ్మెద' చిత్రంలో చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మొహన్ బాబు ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలయిన సంగతి తెలిసిందే. తాజాగా మంచు మనోజ్ ఈచిత్రంలోని తన ఫస్ట్ లుక్ ఫోటోను ట్విట్టర్ ద్వారా విడుదల చేసారు. మనోజ్ గెటప్‌ను బట్టి ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో మనోజ్ మీసాలు లేకుండా కనిపిస్తున్నాడు. తన ఈ లుక్‌లో మీసం లేదని, ఇతర సన్నివేశాల్లో మీసం ఉంటుందని మనోజ్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. తన లుక్ చూసి సీరియస్ రోల్ అనుకోవద్దని, ఫుల్ టైం కామెడీ రోల్ చేస్తున్నట్లు మనోజ్ తన పాత్ర గురించి చెప్పుకొచ్చారు.