Saturday, 30 November 2013

రాయల పోయింది... రాజధానిగా మారింది


అందితే కాళ్లు లేకుంటే చేతులు అన్న సామెత ఇప్పుడు సీమాంద్ర నేతలను చూస్తే నిజమే అనిపిస్తోంది. నిన్నటి దాకా రాయలసీమ పరిరక్షణ సమితి ఏర్పాటు చేసి ట్రాక్టర్ యాత్ర చేసిన సీమ నేత బైరెడ్డి ఇక అది కాదని తెలుసుకున్నాడు. దీంతో ఏం చేయలేక ఢిల్లీ వెల్లి జంతర్ మంతర్ వద్ద దీక్షచేపట్టాడు, అందరు ప్రత్యేక రాయలసీమకోసం చేస్తున్నాడు అనుకున్నారు, కాని అది సీమకోసం కాదు, కొత్తగా ఏర్పడే రాష్ట్రంలో రాజధాని సీమలోనే ఉండాలి అంటూ కొత్త పల్లవి అందుకున్నారు బైరెడ్డి. ఇక సీమాంద్ర కేంద్రమంత్రుల తీరు చూడనే చూసాం, సమైక్యం అన్నారు, కాదని తేలాకా సమన్యాయం అన్నారు, ఇప్పుడు హైదరాబాద్ యూటి అంటున్నారు. ఇలా ఒకటి అందకుంటే మరోటి పట్టుకుంటున్నారన్నది అర్థమవుతోంది.

రాష్ట్రం ఇంకా ఏర్పడనే లేదు ఇప్పుడు రాజధాని అంటూ కొట్టుకోవడం మొదలుపెట్టారు. సీమాంద్ర నేతలు సమైక్యఉద్యమం చేసేటప్పుడు కూడా ఐక్యంగా ఉండకుండా విడిపోయే ఒకరినొకరు తిట్టుకుంటూ చేసారు, అది సక్సెస్ కాకుండా రాష్ట్రం విడిపోయే దాకా వచ్చింది. ఇప్పుడు సీమనేతలు రాజధాని కర్నూల్ అంటే కోస్తాంద్ర నేతలు విశాఖపట్టణం అని, ఆంద్రానేతలు విజయవాడ అని వాదన మొదలు పెట్టారు. దీంతో విడిపోక ముందే విబేదాలు సీమాంద్ర వాదుల్లో మొదలయ్యాయి. ఇప్పటికి కూడా వారిలో ఐక్యత లేకపోతే వారు సాధించుకోవాల్సిన వన్నీ ఇలాగే గాలికి పోతాయన్న వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది.

రామ్ చరణ్ పేరుతో నకిలీ దరఖాస్తు


దేశంలో ఓటరు గుర్తుంపు కార్డుల జారీ వ్యవస్థ ఎంత అద్వాన్నంగా తయారైందో గతంలో అనేక సంఘటనలు రుజువు చేసాయి. అప్పటి నుంచి చాలా అప్రమత్తంగా ఉంటున్న అధికారులు ఇటీవల తెలుగు సినీ స్టార్ రామ్ చరణ్ పేరుతో వచ్చిన నకిలీ ఓటరు గుర్తుంపు కార్డు దరఖాస్తును పసిగట్టారు. ఆన్ లైన్ దరఖాస్తుల విభాగంలో కొందరు ఆకతాయిలు ఈ చర్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ధర్మవరం నియోజకవర్గంలో ఈ ఘటన వెలుగు చూసింది. రామ్ చరణ్ తేజను ధర్మవరం ఓటురుగా నమోదు చేయాలంటూ 27939854 ఐడీ నెంబర్‌తో దరఖాస్తు అందింది. ఇందులో అతని ఇంటిపేరు ‘బండి', తండ్రి పేరు ‘చిరు', వయసు 53 ఏళ్లు, ధర్మవరం పట్టణంలోని రామ్ నగర్ ఏరియాలో 8-6-1969 నెంబరుగల ఇంట్లో ఉంటున్నట్లు పేర్కొన్నారు. మగధీర చిత్రంలోని రామ్ చరణ్ ఫోటోను జతచేసి ఆన్ లైన్లో దరఖాస్తు చేసారు ఫోటో చూడగానే ఇది నకిలీ దరఖాస్తు అని పసిగట్టిన అధికారులు...ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియను అపహాస్యం చేసేలా ప్రవర్తించిన ఆకతాయిలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

పట్టపగలు మద్యం మత్తులో హీరోయిన్, స్నేహితుల వీరంగం


బెంగుళూరుకు చెందిన ఫ్యాషన్ డిజైనర్ రమేష్ దిమ్లా, కన్నడ నటి మాధురి, మరికొందరు స్నేహితులు రోడ్డుపై మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. పట్టపగలు జరిగిన ఈ సంఘటనతో స్థానికులు విస్తుపోయారు. బెంగుళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు రమేష్ దిమ్లా, మాధురితో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. బెంగుళూరు నార్త్ జోన్ డీసీపీ సందీప్ పాటిల్ సంఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. శుక్రవారం ఉదయం మల్లేశ్వరం ప్రాంతంలో 17వ క్రాస్ వద్దకు లగ్జరీకారు నెం. KA 05 NK 7275లో చేరుకున్న వీరు నడిరోడ్డుపై నిల్చుని బీర్లు తాగారు. నటి మాధురితో పాటు యువతులు అసభ్యంగా అర్థనగ్న దుస్తువులు వేసుకుని కనిపించారు. రోడ్డుపై వీరు మద్యం తాగుతూ, అర్ధనగ్న దుస్తువులతో అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేసారు. దీంతో రమేష్ దిమ్లా స్థానికులతో వాగ్వాదానికి దిగారు.

 ఈ గొడవ పెద్దది కావడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ తతంగాన్ని కొందరు సెల్ ఫోన్లలో చిత్రీకరించి టీవీ ఛానల్స్‌కు అందించారు. దీంతో ఈ సంఘట బెంగుళూరులో సెన్సేషన్ అయింది. దీంతో డీసీపీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంఘటన గురించి వివరించారు. కొందరు మద్యం సేవించినట్లు వైద్య పరీక్షల్లో తేలినట్లు తెలిపారు. వారిని వదిలి పెట్టాలని తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, విచారన అనంతరం కేసు నమోదు చేస్తామని ఆయన తెలిపారు.

Thursday, 28 November 2013

రైళ్లకు బాంబులతో సిగ్నళ్లు


తుపాను ప్రభావంతో ఒక్కసారిగా పెరిగిపోయిన పొగమంచు సిగ్నళ్లు కనిపించక డ్రైవర్ల ఆందోళన డిటోనేటర్ సిగ్నలింగ్‌కు అనుమతించిన అధికారులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని వణికిస్తున్న తుపానులు రైళ్లకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టాయి. ఎర్ర లైటో.. పచ్చలైటో చూసుకుని ముందుకెళ్లే పరిస్థితి లేక.. ఏకంగా డిటోనేటర్లు పేల్చాల్సిన పరిస్థితి. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైలు మార్గాల్లో ట్రాక్‌మెన్‌లు ‘డిటొనేటర్లు’ పట్టుకుని తిరుగుతున్నారు. అంతేకాదు.. కచ్చితంగా అన్ని రైల్వేస్టేషన్ల పరిధిలో డిటోనేటర్లు నిల్వ చేసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలూ వచ్చాయి. తుపానులు, అల్పపీడనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పొగ మంచు తీవ్రత పెరగటమే దీనంతటికీ కారణం. తెల్లవారుజామున, ఉదయం, సాయంత్రాల్లో పొగ మంచు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు రైలు డ్రైవర్లకు సిగ్నళ్లు కనిపించవు. ఇది ఒక్కోసారి ఘోర ప్రమాదాలకు కారణమవుతుంది. అలాంటి సందర్భాల్లో సిగ్నళ్లపై లోకోపైలట్లను అప్రమత్తం చేసేందుకు రైల్వే సిబ్బంది డిటోనేటర్లను పేల్చుతారు. దాంతో లోకో పైలట్లు అప్రమత్తమై రైలు వేగాన్ని బాగా తగ్గించి, సిగ్నల్‌ను నిశితంగా పరిశీలించి ముందుకు సాగుతారు. సాధారణంగా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితికి అవకాశం తక్కువ. చలి తీవ్రత బాగా పెరిగిన ప్పుడు ఏజెన్సీల్లాంటి ప్రాంతాల్లో పొగమంచు కనిపిస్తుంది. కానీ, ప్రస్తుతం వరుసగా తుఫానులు, అల్పపీడనాల ప్రభావంతో పొగమంచు బాగా పెరిగింది. లోకో పైలట్లు ఈ విషయాన్ని రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో.. ఆగమేఘాలమీద డిటొనేటర్లను సమకూర్చే పనిలో పడ్డారు.

 డిటొనేటర్లు ఎందుకు?: పొగమంచు దట్టంగా ఉన్నప్పు డు లోకోపైలట్లు సిగ్నళ్లను గమనించగలిగేందుకు తోడ్పడే పరికరాలు మన రైల్వే వద్ద లేవు. దాంతో ప్రత్యేకంగా రూపొందించిన డిటొనేటర్లను రైలు వచ్చే సమయంలో సిగ్నళ్లకు కొన్ని వందల మీటర్ల ముందు పట్టాలపై అమరుస్తారు. రైలు దానిమీదుగా వెళ్లగానే అది పేలుతుంది. వెంటనే లోకోపైలట్ అప్రమత్తమై ముందు సిగ్నల్ ఉందని గుర్తించగలుగుతారు. వెంటనే రైలు వేగాన్ని కనిష్టస్థాయికి తగ్గించి, సిగ్నల్‌ను మసకగానైనా పరిశీలించి, తగిన చర్యలు చేపడతారు. సాధారణంగా చలి తీవ్రంగా ఉన్నప్పుడు రైలుపట్టాలు సంకోచిస్తాయి. ఒక్కోసారి విరిగిపోయి, ప్రమాదానికి కారణమవుతాయి. ట్రాక్‌మెన్ ద్వారా అధికారులు లోపాలను గుర్తించి, సిగ్నళ్లద్వారా లోకోపైలట్లను అప్రమత్తం చేస్తుంటారు. కానీ, పొగమంచుతో సిగ్నల్ కనిపించకపోతే ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏదైనా రైలు పట్టాలు తప్పటం వల్లనో, మరే కారణం చేతనో నిలిచిపోతే... వెనుక వస్తున్న ఇతర రైళ్లను ఎక్కడికక్కడ సిగ్నళ్ల ద్వారా నియంత్రించాల్సి ఉంటుంది. పొగమంచుకు సిగ్నల్ కనిపించకపోతే రైళ్లు ఢీకొనే ప్రమాదముంటుంది. కాగా.. ఉత్తర భారత ప్రాంతంలోని రైళ్లకు పొగమంచును చీల్చుకుంటూ కూడా ప్రసరించగలిగే సామర్థ్యమున్న లైట్లను అమర్చుతున్నారు. కానీ, దక్షిణమధ్య రైల్వేలో అలాంటివి లేవు. వాటిని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా అమలు కాలేదు. దాంతో ఇంకా డిటొనేటర్ సిగ్నళ్లపై ఆధారపడాల్సి వస్తోంది.

Tuesday, 26 November 2013

అతడు చెప్పేవన్నీ అబద్దాలే: శృతి హాసన్


హీరోయిన్ శృతి హాసన్‌పై ఇటీవల ముంబైలోని తన అపార్టుముంటులో ఓ గుర్తు తెలియని వ్యక్తి దాడికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. సిసి టీవీ పుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేసారు. నిందితుడు అశోక్ శంకర్ త్రిముఖే(45)గా గుర్తించారు. అతడు ఫిల్మ్ సిటీలో స్పాట్ బాయ్‌గా పని చేస్తున్నట్లు గుర్తించారు. తాను సోదరుడికి ఉద్యోగం కోసం శృతి హాసన్ ఇంటికి వెళ్లాలని.. తాను చెప్పడానికి ప్రయత్నిస్తుండగానే ఆమె డోర్ వేసేశారని అశోక్ శంకర్ పోలీసులకు చెప్పాడు. అంతేకానీ, ఆమెను బెదిరించాలన్నది తన ఉద్దేశం కాదని చెప్పాడు. అయితే అశోక్ శంకర్ త్రిముఖే వాదనను శృతి హాసన్ ఖండించారు పోలీసులకు అశోక్ శంకర్ త్రిముఖే చెప్పేది అవాస్తవమని, ఒంటరిగా ఒక ఆడపిల్ల ఉంటున్న పార్టుమెంటులోకి రాత్రి 9.30 గంటలకు రావాల్సిన అవసరం ఏమిటని ఆమె ప్రశ్నించారు.

అతడు అనేక సందర్భాల్లో సినిమా సెట్లలో కనిపించాడని, అప్పుడెప్పుడూ తనతోగానీ, తన సిబ్బందితో గానీ అతని సోదరుడి ఉద్యోగం గురించి ఎందుకు మాట్లాడలేదని, దురుద్దేశంతోనే తన ప్లాటుకు వచ్చాడనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలనే విధంగా శృతి హాసన్ స్పందించారు. బాంద్రా పోలీసుల కథనం ప్రకారం మంగళవారం ఉదయం 9.30గంటల సమయంలో నిందితుడు శంకర్ శృతి హాసన్ ఇంటికి వెళ్లి డోర్ బెల్ కొట్టాడు. ఆమె తలుపుతీయగా.. తనను ఎందుకు గుర్తు పట్టలేదని ప్రశ్నించాడు. ఆమె భుజంపై చేయి వేశాడు. దీంతో శృతి హాసన్ నిందితుడిని గట్టిగా బయటకు నెట్టేసి తలుపు వేసేసింది.

పవన్ కళ్యాణ్ ను అనుకరించిన అన్నయ్య!


సంచలన విజయంతోపాటు రికార్డుల కలెక్షన్లతో దూసుకుపోతున్న అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓ విభిన్న పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్నసంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పోషించిన పాత్రను ఆయన సోదరుడు నాగబాబు అనుకరించనున్నాడు. త్వరలో విడుదల కానున్న 'చూసినోడికి చూసినంత' అనే చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్రను పోలివుండే కారెక్టర్ ను నాగబాబు పోషిస్తున్నారని చిత్ర దర్శకుడు అనిల్ వాటుపాలి తెలిపారు. ఈ చిత్రంలో పవన్ పేరుతో ఉండే పాత్రను ఈ చిత్రంలో నాగబాబు చేస్తున్నారని.. ఆ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పవన్ పాత్రతో పోలివుండే లుక్ ను షూట్ చేశామన్నారు. కేవలం వినోదం కోసమే నాగబాబుతో ఈ పాత్రను చేయిస్తున్నామని.. అభిమానులు మరోలా భావించకూడదు అని అనిల్ అన్నారు. ఈ పాత్రలో నటించేటప్పుడు నాగబాబు ఎంజాయ్ చేశారు అని తెలిపారు. ఈ చిత్రంలో శివాజీ, కృష్ణుడు, నిత్యాలు ప్రధాన పాత్రలో నటించారు.

Monday, 25 November 2013

రామ్ గోపాల్ వర్మ పిటీషన్ తిరస్కరణ


సత్య 2 సినిమాను నిర్మించిన ప్రముఖ డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ కు నాంపల్లి కోర్టులో రెండోసారీ చుక్కెదురు అయ్యింది. సెన్సార్ బోర్డ్ ప్రాంతీయ అథికారిణి ధనలక్ష్మి తన సినిమాకు ఉద్దేశపూర్వకంగా ఆటంకాలు కల్పిస్తున్నారని, ఆమెపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన రెండోసారి ధాఖలు చేసిన పిటీషన్ ను కూడాకోర్టు తిరస్కరించిందని సమాచారం. కొద్దిరోజులు క్రితం నాంపల్లి కోర్టులో వర్మ తరుపు న్యాయవాది పిటీషన్ వేయగా అది తమ పరిధిలోకి రాదంటూ ఈ నెల 20న తిరస్కరించింది. ఈ విషయమై తాము పలువురు న్యాయవాదులను సంప్రదించామని,సెన్సార్ బోర్డ్ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం మసాబ్ ట్యాంక్ కు ప్రాంతంలో ఉండటంతో నాంపల్లి కోర్టులో పిటీషన్ దాఖలు చేయాలని వారు సూచించడంతో 12వ సీఎంఎంకోర్టులో పిటీషన్ పేర్కొంటూ వర్మ తరుపు న్యాయవాది రెండోసారి పిటీషన్ దాఖలు చేసారు. కోర్టు వర్గాల సమాచారం మేరకు...రెండో పిటీషన్ పైనా పరిథి తమది కాదు అని కోర్టు రాసిందని తెలుస్తోంది. దీనిపై వర్మ న్యాయవాదిని సంప్రదించగా...తమ పిటీషన్ ని కోర్టు రెండోసారి తిరస్కరించిన విషయం తమనకు తెలియదని చెప్పారు.

రామ్ గోపాల్ వర్మ వేసిన పిటీషన్‌పై సెన్సార్ ఆఫీసర్ ధనలక్ష్మి స్సందించినట్లు తెలుస్తోంది. సినిమాల సెన్సార్ విషయంలో తాను ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం లేదని, రివ్యూ కమిటీ సభ్యులంతా కలిసే సెన్సార్ చేస్తామని, వర్మ పిటీషన్ దాఖలు చేసే ముందు రివ్యూ కమిటీని సంప్రదించి ఉండాల్సిందని వ్యాఖ్యానించినట్లు సమాచారం. సత్య 2 సినిమాలో ముగ్గురు ప్రముఖ వ్యక్తులను ఉద్దేశించేలా సన్నివేశాలు ఉన్నాయని, ఓ టీవీ ఛానల్ నుండి సెన్సార్ బోర్డుకు మెమోరండం అందిందని, సినిమాలో నుండి తమ సీఈవో పేరు తొలగించాలని వారు కోరినట్లు సమాచారం. వర్మ సినిమాలో ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ9 సీఈఓ రవిప్రకాష్‌, మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ లను ఉద్దేశించిన సన్నివేశాలు ఉన్నట్లు ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు. కాగా...పిటీషన్ దాఖలు చేయడానికి ముందు ఆయన పలు టీవీ ఛానళ్లలో ఈ విషయమై లైవ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ఇండస్ట్రీ పెద్దలు మద్దతు ప్రకటించారు. వర్మకు మద్దతుగా నిలిచిన వారిలో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు, మోహన్ బాబు కాడా ఉన్నారు. ఇప్పటి వరకు సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ ధనలక్ష్మి గురించి ఎవరికీ ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు నిర్మాతలు వాపోయారు.

అమ్మ అంత అందంగా...


‘ఆ భగవంతుడు మాకిచ్చిన వరం మా కూతురు ఆరాధ్య’ అని ఓ సందర్భంలో ఐశ్వర్యరాయ్ ఎంతో మురిపెంగా చెప్పారు. ఈ నెల 16న ఆరాధ్య పుట్టినరోజు వేడుకను సన్నిహితుల మధ్య ఘనంగా జరిపారు అభిషేక్, ఐశ్వర్య. పాపకు రెండేళ్లు పూర్తయ్యాయి కాబట్టి.. ఇక నటిగా ఐష్ రీ-ఎంట్రీకి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఐష్ కూడా ఆ సన్నాహాల్లోనే ఉన్నారట. మరోవైపు ఇటీవల తన తల్లిదండ్రులు వృందారాయ్, కృష్ణరాజ్, సోదరుడు ఆదిత్య, అతని భార్యతో కలిసి కూతుర్ని తీసుకుని ఐష్ దుబాయ్ వెళ్లారట. ‘హ్యాపీ న్యూ ఇయర్’ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్న అభిషేక్‌బచ్చన్ మాత్రం ఈ ట్రిప్‌ని మిస్ అయ్యారు.

 పుట్టింటివాళ్లతో హాయిగా గడిపి ఐష్ ముంబయ్ వచ్చారు. మామూలుగా ఈ అందాల సుందరి పబ్లిక్‌లోకి వస్తే.. కొన్ని కెమెరాలు ఆమెను వెంటాడతాయి. పైగా, కూతుర్ని తీసుకొని బయటకు వచ్చారంటే, ఈ తల్లీకూతుళ్లను కెమెరాలో బంధించడానికి ఫొటోగ్రాఫర్లు తాపత్రయపడతారు. ఈ క్రమంలో ఇటీవల దుబాయ్ ట్రిప్ ముగించుకుని ఐష్ ముంబయ్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో కొంతమంది ఫొటోలు తీశారు. ఆ ఫొటోల్లో క్యూట్‌గా ఉన్న రెండేళ్ల ఆరాధ్యని చూస్తే.. అచ్చం అమ్మలా మంచి అందగత్తె అవుతుందని అందరూ అనుకున్నారు.