Wednesday, 6 November 2013

వోల్వో ప్రమాదం: కెమికల్స్ వొట్టిదే, కల్వర్ట్ పైపు వల్లే


మహబూబ్‌నగర్ జిల్లాలో ఇటీవల జరగిన జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రమాద ఘటనపై విచారణ మంగళవారం పూర్తయింది. బస్సులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని క్లూస్ టీమ్ ధ్రువీకరించింది. బస్సు అదుపు తప్పి కల్వర్ట్ను ఢీకొనటం వల్లే మంటలు చెలరేగినట్లు బృంద సభ్యులు మంగళవారమిక్కడ తెలిపారు. జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన ఓల్వో బస్సు కల్వర్టును ఢీకొట్టి 45 మంది మృత్యువాతపడిన విషయం తెలిసిందే. గతనెల 30వన కొత్తకోట మండలం పాలెం గ్రామ శివారు ప్రాంతంలో ప్రమాదం జరిగిన నాటినుంచి పోలీసులు మంగళవారం వరకూ ఆధారాలను సేకరించారు. దర్యాప్తు చేసిన అంశాల ఆధారంగా క్లూస్ టీమ్ మహబూబ్‌నగర్ ఎస్పీకి ఓ నివేదికను సమర్పించారు.

 బస్సు వేగంగా కల్వర్టును ఢీకొట్టిందని, కల్వర్టు పైపు డీజిల్ ట్యాంక్‌లోకి చొచ్చుకుపోవడం వల్ల మంటలు చెలరేగాయని క్లూస్ టీమ్ తన నివేదికలో తెలిపింది. మంటలు లగేజీ విభాగానికి తాకడంతో ప్రమాదం తీవ్రతను సరిగా అంచనా వేయలేకపోయారని చెప్పారు. బస్సులో రసాయనాలు గానీ, పేలుడు పదార్థాలు గానీ లేవని క్లూస్ టీమ్ తేల్చింది. కాగా, ఇప్పటి వరకు బస్సు ప్రమాదంలో మరణించినవారి 34 మందిని గుర్తించారు. గుర్తు పట్టలేకుండా కాలిపోవడంతో డిఎన్ఎ పరీక్షలు నిర్వహించి, మృతులను గుర్తిస్తున్నారు. బస్సులో రసాయనాలు ఉండి ఉండవచ్చునని మంగళవారంనాడు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వార్తలను క్లూస్ టీమ్ కొట్టిపారేసింది.

మహేష్ బాబును వాడుకుంటున్న ప్రియమణి!


పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాల్లోని సీన్లను, డైలాగులను, పాటలను వాడుకోవడం ఈ మధ్య కామన్ అయింది. తాజాగా ‘చండీ' చిత్రంలో మహేష్ బాబు ‘అతడు' చిత్రంలోని డైలాగును ఉన్నదున్నట్లు వాడేసారు. తాజాగా విడుదలైన చండీ టీజర్లో ‘సముద్రాన్ని చూడాలనుకో తప్పు లేదు...కానీ సునామీని చూడాలనుకోకు చచ్చిపోతావ్' అంటూ ప్రియమణి డైలాగ్ ఇరగదీసింది. ఇది బాగా పాపులర్ అయిన డైలాగు కావడంతో మహేష్ బాబు సినిమా డైలాగని ఇట్టే పసిగట్టేస్తున్నారు ప్రేక్షకులు. అయితే మరి ఈ డైలాగు కావాలని పెట్టారో? కాకతాళీయంగా జరిగిందో తెలియాల్సి ఉంది. ఇక చండీ సినిమా వివరాల్లోకి వెళితే...ప్రియమణి టైటిల్‌ పాత్రలో కృష్ణంరాజు ఓ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'చండీ'. 'వి.సముద్ర' దర్శకత్వంలో 'ఒమిక్స్ క్రియేషన్స్' పతాకంపై జి.జగన్నాథనాయుడు సమర్పణలో డాక్టర్‌ శీనుబాబు నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు వి.సముద్ర.. 'అల్లూరి సీతారామరాజు పాత్రను పోషించాలన్న కృష్ణంరాజు ఆశయం మా చిత్రం ద్వారా నెరవేరినందుకు ఆనందంగా ఉంది.


ఇద్దరు మాస్‌ నటులైన కృష్ణంరాజు, శరత్‌కుమార్‌ల అభినయం మధ్య కథానాయిక నిలబడటమంటే మాటలుకాదు. ప్రియమణి ఆ పోటీని కూడా తట్టుకుని తన పాత్రకు న్యాయం చేసింది' అని అన్నారు. నిర్మాత శీనుబాబు.. 'రెండు పెద్ద సినిమాల అనంతరం విడుదల చేద్దామనే వేచి చూశాం. యాక్షన్‌, మంచి మెసేజ్ ఇంచే చిత్రంగా 'చండీ' నిలుస్తుంది. ప్రస్తుత సమాజంలో మహిళలు ఎలా జీవించాలో అన్న అంశాన్ని ఇందులో ఆవిష్కరించాం'అని అన్నారు. మహిళలకు ఎంతో స్ఫూర్తినిచ్చేంతంగా ఈ చిత్రముంటుందని సహ నిర్మాత సత్య ముమ్మిడి తెలిపారు. ఈ చిత్రానికి కథ, మాటలు: కరణం పి. బాబ్జీ, ఛాయాగ్రహణం: వాసు, సంగీతం: ఎస్‌ఆర్‌ శంకర్‌, చిన్నా అందించారు.

ఇబ్బంది పెడితే దేశం విడిచిపోతా : కమల్ హాసన్


కమల్ హాసన్ తెరకెక్కించిన ‘విశ్వరూపం' చిత్రం విడుదల సందర్భంగా తమిళనాడులో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో తెలిసిందే. ఆ ఘటనతో తీవ్ర మనస్తాపానికి చెందిన ఆయన అప్పట్లో సంచలన ప్రకటన చేసారు. ‘నన్ను మరిత ఇబ్బంది పెడితే వేరే రాష్ట్రానికో, వేరే దేశానికో వెళ్లి పోతా' అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం విశ్వరూపానికి సీక్వెల్ గా ‘విశ్వరూపం 2' చిత్రం రాబోతోంది. ఈ చిత్రాన్ని కూడా కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. మళ్లీ అలాంటి ఇబ్బందులు ఎదురయితే ఏం చేస్తారు? అనే ప్రశ్నకు కమల్ హాసన్ స్పందిస్తూ....‘నా నిర్ణయంలో ఏ మార్పు ఉండదు. ఎంఎఫ్ హుస్సేన్ మాదిరి విదేశాల్లో స్థిరపడతాను. ఇది బెదిరింపు కాదు..రాజీనామా. ఎక్కడికి వెళ్లినా మాతృ దేశాన్ని మరిచిపోను' అని సమాధానం ఇచ్చారు. విశ్వరూపం 2 సినిమా వివరాల్లోకి వెళితే...విశ్వరూపం చిత్రం భారీ విజయం సాధించడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి. 'విశ్వరూపం' చిత్రం పలు వివాదాలకు కేంద్రబిందువైంది. అయితే దర్శకుడిగా కమల్‌ ప్రతిభ విమర్శకుల్ని మెప్పించింది. విశ్వరూపం'-2 చిత్రాన్ని ఆస్కార్‌ వి.రవిచంద్రన్‌ నిర్మిస్తున్నారు. రెండో భాగంలోనూ అంతర్జాతీయ ఉగ్రవాదం ప్రస్తావన ఉంటుంది.

దాంతోపాటు తల్లీబిడ్డల అనుబంధాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇందులో యుద్ధ ఘట్టాలు ఉత్కంఠను రేకెత్తిస్తాయని సమాచారం. ఇక 'విశ్వరూపం'లో చూపించలేకపోయిన కొన్ని సన్నివేశాలను సీక్వెల్ లో చూడొచ్చని కమల్‌హాసన్‌ తెలిపారు. ఇందులో యుద్ధ సన్నివేశాలు మరింత బ్రహ్మాండంగా ఉంటాయి. తొలి భాగంలో చూపించలేకపోయిన ప్రేమ, రొమాన్స్‌ సన్నివేశాలే కాక తల్లీకొడుకు మధ్య ఉండే అప్యాయత, అనురాగాలను కూడా కొనసాగింపులో చూపనున్నట్లు ఆయన వివరించారు. తొలుత దీపావళికి విడుదల చేయాలనుకున్నారు కానీ... అదే సమయంలో అజిత్ నటించిన ‘ఆరంభం' చిత్రం విడుదలైంది. ఈ నేపథ్యంలో డిసెంబర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎక్కువ స్క్రీన్లలో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారట. మేజర్ వసీం ఆహ్మద్ కశ్మీరి పాత్రను కమల్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ తల్లి పాత్రను బాలీవుడ్ నటి వహిదా రహ్మన్ పోషిస్తుండగా, రాహుల్ బోస్, పూజా కుమార్, శేఖర్ కపూర్, ఆండ్రియా జెర్మియాలు నటిస్తున్నారు.

Tuesday, 5 November 2013

అఖిల్ 'లవ్ గేమ్' అలా మొదలైందా..!?


కింగ్ నాగార్జున అందాల భామ అమల ముద్దుల కొడుకు... అఖిల్ తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే సినీ హీరోకి కావాల్సిన ట్రెయినింగ్ అంతా కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్... అఖిల్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ సెన్సేషన్ సృష్టించాలనే లక్ష్యంతో ప్లాన్ తయారు చేసుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అఖిల్ తో త్రివిక్రమ్ మూవీ కొందరు... రూమర్ అనే వాళ్ళు ఉన్నారు. ఇంతకూ అఖిల్ ఈ ఏడాది తెరంగేట్రం చేస్తే ఫస్ట్ మూవీలో హీరోయిన్ ఎవరు..? ఆమె హైదరాబాదీయా? లేక ఎప్పటిలాగానే మేడిన్ ముంబయా సరుకా? దీనిపై రకరకాల కథనాలు వస్తున్నాయి. అఖిల్ సరసన అలనాటి ప్రముఖ హీరోయిన్ కూతురు హీరోయిన్ గా ఎంపిక చేయాలనే ఆలోచన సాగుతున్నట్టు తెలుస్తోంది. అయితే... టీనేజ్ లో ఉన్న అఖిల్ కు ఇంతకు ముందే ఆ ముద్దుగుమ్మతో బాలివుడ్ క్రికెట్ మ్యాచ్ సమయంలో పరిచయం జరిగినట్టు తెలుస్తోంది. అదే తర్వాత దోస్తీగా మారినట్టు... అదే మూవీలో లవ్వాటకు సీన్ క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది. ఇద్దరూ పరిచయస్తులైతే... తెరపై లవ్ కెమిస్ర్టీ బాగా పండుతుందనేది మూవీ ఎక్సపర్ట్స్ ఆలోచన. అందుకే అఖిల్ జోడీగా అలనాటి హీరోయిన్ కూతురుని ఎంపిక చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే అఖిల్ లవ్ సీన్స్ రొమాంటిక్ గా ఉంటాయా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మాదిరిగా ఆ జంట తెలుగు తెరపై పదికాలాలపాటు సక్సెస్ జోడీ అవుతుందా? నాగ చైతన్య '100% లవ్' మాదిరిగా యూత్ ఫుల్ సబ్జెక్టా..? ఏమిటనేది అంతా సస్పెన్స్... అఖిల్ మూవీ వచ్చాకే లవ్ స్టోరీ కథ తెలుస్తుంది..!

‘పల్నాడు’ లో ‘అత్తారింటికి దారేది ’ సీన్


అదేంటి విశాల్ తాజా చిత్రం ‘పల్నాడు' లో సూపర్ హిట్ చిత్రం ‘అత్తారింటికి దారేది ' ఉండటమేంటి..దానికి విజిల్స్ పడటం ఏంటీ అని డౌట్ పడుతున్నారా... అది నిజమే. దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రం రిలీజైన రోజు మార్నింగ్ షోకే నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే సినిమా డల్ గా నడుస్తున్న సమయంలోనూ జనం విజిల్స్ తో థియోటర్ మారు మ్రోగింది అంటే దానికి కారణం ఓ సన్నివేశంలో ‘అత్తారింటికి దారేది ' ని చూపెట్టడమే. ‘పల్నాడు' సెకండాఫ్ లో...విలన్ ...ఓ రాజకీయనాయకుడుని థియోటర్ లో కలుసుకునే సీన్ ఉంది.

ఆ సీన్..జరిగే థియోటర్ లో...అత్తారింటికి దారేది చిత్రం ప్రదర్శింపబడుతూంటుంది. విలన్ ...పొలిటీషియన్ తో మాట్లాడేటప్పుడు... అత్తారింటికి దారేది సీన్స్... కనపడతాయి. అప్పటివరకూ డల్ గా ఉన్న థియోటర్ ఈ సీన్ తో ..పవన్ కనపించటంతో ఉషారు వచ్చింది. పందెం కోడి, భరణి, వాడు వీడు, వెంటాడు వేటాడు వంటి వైవిధ్యమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విశాల్‌ తొలిసారి విశాల్‌ ఫిలింఫ్యాక్టరీని స్థాపించి స్వయంగా నిర్మించిన ద్విభాషా చిత్రం ‘పల్నాడు'. ‘నా పేరు శివ' ఫేం సుశీంద్రన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘గజరాజు' ఫేం లక్ష్మీమీనన్‌ హీరోయిన్. విశాల్‌ అంటే పదిమందిని ఒక్కడే తంతాడు. ఇదీ జనాల్లో ఉన్న ఇమేజ్‌. దానికి దూరంగా చేసిన తొలి ప్రయత్నమిది. దాదాపు పదేళ్ల తర్వాత నా ఇమేజ్‌కి పూర్తి ఆపోజిట్‌ పాత్రలో కనిపిస్తున్నా. కొట్టాలంటే భయపడే కుర్రాడిగా ఈసారి కనిపిస్తున్నా. నా కెరీర్‌లో మర్చిపోలేని పాత్ర ఇది అన్నారు విశాల్‌.

'అత్తారింటి..' తమిళ రీమేక్ కి రంగం సిద్దం


త్రివిక్రమ్‌- పవన్‌కల్యాణ్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'అత్తారింటికి దారేది' సంచలన విజయం సాధించి అక్కడ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర రీమేక్‌లో నటించేందుకు ఇలయ తలబది విజయ్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. తమిళంలోనూ రిలియన్స్ వారే అక్కడో నిర్మాతతో కలిసి టై అప్ అయ్యి నిర్మించే అవకాసం ఉందని తెలుస్తోంది. విజయ్ ప్రస్తుతం తాను చేస్తున్న జిల్లా అనంతరం ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటాయని తమిళ మీడియా అంటోంది. రీమేక్‌ చిత్రాల హీరోగా పేరు పొందిన ఇలయ తలబది విజయ్‌ మరో విజయవంతమైన చిత్రం 'అత్తారింటికి దారేది' రీమేక్ చేయటంతో ఆయన తన క్రేజ్ పెంచుకునేందుకు చూస్తున్నారు. ఆయన కెరీర్‌లోని గిల్లీ, పోక్కిరి, కావలన్‌, బద్రీ, వేలాయుధం వంటి భారీ విజయాలన్నీ రీమేక్‌లే కావటం విశేషం.

 ప్రస్తుతం 'జిల్లా'లో నటిస్తున్న విజయ్‌ తాజాగా టాలీవుడ్‌ పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ చిత్రం చేస్తాననటంతో ట్రేడ్ వర్గాల్లో సైతం చాలా హిట్ గ్యారెంటీ అని, విజయ్ కు రీమేక్ లే అచ్చి వచ్చాయంటున్నారు., గతంలో పవన్‌కల్యాణ్‌ నటించిన 'తమ్ముడు' రీమేక్‌ 'బద్రీ'లో నటించి విజయాన్ని అందుకున్నాడు విజయ్‌. అంతే కాకుండా ఇటీవల పోక్కిరి, వేలాయుధం తదితర తెలుగు కథలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ సెంటిమెంటుతోనే 'అత్తారింటికి దారేది' రీమేక్‌లో నటించేందుకు ఉత్సాహం చూపుతున్నాడని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.

జూ.ఎన్టీఆర్ ఇంట్లోకి చొరబాటు యత్నం


సెక్యూరిటీ అప్రమత్తతతో పరార్ సాక్షి, హైదరాబాద్: సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లోకి చొరబడేందుకు ఓ అగంతకుడు విఫలయత్నం చేసిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 37లో నివాసం ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లోకి ఆదివారం అర్ధరాత్రి చేతిలో తుపాకీ ఉన్న ఓ గుర్తుతెలియని వ్యక్తి ప్రహరీగోడ దూకి లోనికి వెళ్లాడు. అలికిడి కావడంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అటువైపుగా రావడంతో.. గమనించిన అగంతకుడు అక్కడ్నుంచి పారిపోయాడు. అగంతకుడు నెంబర్‌ప్లేట్ లేని వాహనంపై అక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనంతా సమీపంలోని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇంటి ముందున్న సీసీ కెమెరాలో రికార్డైంది. జూనియర్ ఎన్టీఆర్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం సీసీ కెమెరా పుటేజిని పరిశీలించి, ఆ వ్యక్తి ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

నింగికేసి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ25


సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మార్స్ మిషన్‌ లో కీలకఘట్టానికి తెర లేచింది. మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను మోసుకుంటూ ఉపగ్రహ వాహకనౌక పీఎస్‌ఎల్‌వీ సీ25 నింగికేసి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ మధ్యాహ్నం 2.38 గంటలకు దీన్ని ప్రయోగించారు. నిప్పులు చిమ్ముకుంటూ పీఎస్‌ఎల్‌వీ సీ25 అంగారక యాత్రకు బయలుదేరింది. కేంద్రమంత్రి నారాయణస్వామి సహా పలువురు ప్రముఖులు ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. యావత్ దేశం ఈ మధుర ఘట్టాన్ని అమితాసక్తితో తిలకించింది.

 మార్స్ మిషన్‌ విజయవంతం కావాలని ఆకాంక్షించింది. ఈ ప్రయోగంపై ప్రపంచదేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. పీఎస్‌ఎల్‌వీ ఉపగ్రహ వాహకనౌక రోదసీ ప్రయాణానికి 40 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశముంది. సెప్టెంబరు 14, 2014 నాటికి ఉపగ్రహం అంగారకుడిని చేరనుంది. మొత్తం 5 రకాల పరికరాలను అంగారకుడిపైకి ఉపగ్రహం తీసుకెళ్లనుంది. లైమాన్‌ ఫొటో ఆల్ఫా ఫొటోమీటర్(ల్యాప్‌), మీథేన్‌ సెన్సార్‌ ఫర్‌ మార్స్‌, మార్స్‌ ఎక్సోస్ఫెరిక్‌ న్యూట్రల్‌ కాంపోజిషన్‌ అనలైజర్‌, మార్స్‌ కలర్‌ కెమెరా, థర్మల్‌ ఇన్‌ఫ్రారెడ్‌ ఇమేజింగ్‌ స్పెక్ట్రోమీటర్‌ పరికరాలను అంగార గ్రహానికి మోసుకెళ్లింది. ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్‌ ప్రయోగ ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ ప్రయోగంతో గ్రహాంతర ప్రయోగాలకు భారత్ శ్రీకారం చుట్టింది. సుమారు రూ.455 కోట్ల వ్యయంతో ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు. దీన్ని అక్టోబర్ 28నే నిర్వహించాలని ముందుగా నిర్ణయించినా రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ ఇబ్బందికరంగా మారడంతో నవంబర్ 5కు వాయిదా వేశారు.

 అంగారకుడిపైకి వెళ్లాలంటే 30 కోట్ల నుంచి 35 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంది. దాంతో రాకెట్ గమనాన్ని నిర్దేశించే రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ కోసం బెంగళూరు ఇస్‌ట్రాక్ సెంటర్‌లో 32 డీప్‌స్పేస్ నెట్‌వర్క్, అండమాన్ దీవుల్లోని మరో నెట్‌వర్క్‌తో పాటు నాసాకు చెందిన మాడ్రిడ్ (స్పెయిన్), కాన్‌బెర్రా (ఆస్ట్రేలియా), గోల్డ్‌స్టోన్ (అమెరికా)ల్లోని మూడు డీప్ స్పేస్ నెట్‌వర్క్‌లతో పాటు మరో నాలుగు నెట్‌వర్క్‌ల సాయం కూడా తీసుకున్నారు. నాలుగో దశలో రాకెట్ గమనాన్ని తెలిపేందుకు దక్షిణ ఫసిపిక్ మహాసముద్రంలో రెండు నౌకలపై తాత్కాలిక రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం భారత షిప్పింగ్ కార్పొరేషన్ నుంచి అద్దెకు తీసుకున్న నలంద, యుమున నౌకలు ఆస్ట్రేలియా-దక్షిణ అమెరికా మధ్యలో నిర్దేశిత స్థలానికి చేరుకుని సిద్ధంగా ఉన్నాయి.